Jul 24,2022 22:26

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: తెలుగును సంస్కృతంలోకి తర్జుమా చేసే టెక్నాలజీని కనుగొని భారత ప్రభుత్వంచే పేటెంట్‌ పొందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ తియ్యబిండి కామేశ్వరరావును ఆదివారం నగరంలోని రఘురామ వేదికలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. విశ్వబ్రాహ్మణ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్‌ వజ్రాల శివకుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగును సంస్కృతంలోకి తర్జుమా చేసే టెక్నాలజీని కనుగొనడం గొప్ప అంశమని తెలిపారు. రానున్న కాలంలో కామేశ్వరరావు మరిన్ని కొత్త విషయాలను కనుగొని మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు కందుకూరి శ్రీనివాసాచార్యులు అధ్యక్షత వహించగా తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు, విశ్వబ్రాహ్మణ విజ్ఞాన వేదిక క్రియేటర్‌ సత్తెనపల్లి ఉమామహేశ్వరాచార్యులు, ప్రదాన కార్యదర్శి కందుకూరి రమేష్‌ ఆచార్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.