Jul 25,2022 22:18

  • రెయిన్‌బో ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ: సంతానం లేకుండా బాధ పడుతున్న వారికి ఐవిఎఫ్‌ ప్రక్రియ ఒక వరం లాంటిదని రైయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ యూనిట్‌ హెడ్‌ పి.శ్రీనివాసరావు అన్నారు. వరల్డ్‌ ఐవిఎఫ్‌ డే సందర్భంగా రెయిన్‌బో చిల్ట్రన్స్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యాన అవగాహనా పాదయాత్ర సోమవారం నగరంలోని రెయిన్‌బో హాస్పటల్‌ వద్ద జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైద్య ప్రక్రియకు ఆదరణ పెరుగుతోందన్నారు. మొదటి సారిగా 1978 జులై 25న ఐవిఎఫ్‌ ప్రక్రియ ద్వారా ఇంగ్లండ్‌లో లూయిస్‌ బ్రౌన్‌ అనే బాలిక జన్మించిందని, అప్పటి నుంచి ప్రపంచ ఐవిఎఫ్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. రెయిన్‌బో చిల్ట్రన్స్‌ హాస్పిటల్‌కు అనుబంధంగా అత్యంత అధునాతన ఫెర్టిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ (జెఎసి) అక్రిడిటేషన్‌ పొందిన దేశంలోని ఏకైక, మొదటి ఫెర్టిలిటీ సెంటర్‌ తమ గ్రూప్‌లో భాగంగా ఉందన్నారు. తమ సెంటర్‌లో సంతాన సాఫల్యత శాతం సగటు కన్నా ఎక్కువగా ఉందని, దీనికి కారణం డాక్టర్‌ సృజన, డాక్టర్‌ మను జాస్తి, డాక్టర్‌ శ్రీదేవి వంటి నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండడమేనన్నారు. డాక్టర్‌ సృజన మాట్లాడుతూ రెయిన్‌బో ఐవిఎఫ్‌ సెంటర్‌లో ఐవిఎఫ్‌, ఇక్సీ, ఐయుఐతో పాటు ఇతర సంతాన సాఫల్యతా ప్రక్రియలు లభ్యమవుతున్నాయని ఆమె చెప్పారు. అత్యంత సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య ప్రక్రియలు నిర్వహించడం వల్ల సంతాన సాఫల్యతా శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రపంచ ఐవిఎఫ్‌ దినోత్సవం సందర్భంగా తమ ఆస్పత్రిలో సిమన్‌ ఎనాలసిస్‌, ఫోలిక్యులర్‌ ఎనాలసిస్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లినికల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌, జనరల్‌ మేనేజర్‌ (క్లస్టర్‌ హెడ్‌) డాక్టర్‌ రావి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.