ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌కుమార్ ఆదేశించారు. కలెక్టర్‌ట్ డిఆర్‌వో చాంబర్‌లో గురువారం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపిఓఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 520 మంది పదవ తరగతి 428 మంది ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను రాయనున్నారని అన్నారు. పదవ తరగతి పరీక్షలు ఆగస్టు 3వ తేది నుంచి 11వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3వ తేది నుంచి 11వ తేదీ వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని డిఆర్‌వో అన్నారు. ఈ సమావేశంలో ఏపిఓఎస్‌ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్. బాబురావు పాల్గొన్నారు.










