- తిక్కన సోమయాజి సంతాప సభలో పలువురు వక్తలు
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ: పద్య సాహిత్యం ద్వారా అభ్యుదయాన్ని కాంక్షించిన కవి పువ్వాడ తిక్కన సోమయాజి అని ప్రముఖ సాహితీవేత్త, ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు అన్నారు. ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజాశక్తి నగర్‌లోని చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో ప్రముఖ పద్యకవి బహుముఖ ప్రజ్ఞాశాలి పువ్వాడ తిక్కన సోమయాజి సంతాప సభ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్యవక్తగా పాల్గొన్న గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగులో అద్భుతమైన పద్య కావ్యాలను రచించి సాహితీ ప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్నారు. పద్య రచనలో లోతైన భావాన్నివ్యక్త పరచడంలో పువ్వాడ తిక్కన సోమయాజి దిట్ట అన్నారు. తన రచనల ద్వారా పలు అవార్డులు, ప్రశంశలు అందుకున్నారన్నారు. ఎక్స్‌రే అధ్యక్షులు కొల్లూరి మాట్లాడుతూ దుందుభి, జిగష, సువర్ణసౌరభం, అక్షరదామం, ఆమ్రపాలి, అమృతవర్షిణి, కవనలేఖిని పద్యకావ్యాలు బహుళ ప్రాచుర్యం పొందిన పువ్వాడ తిక్కన సోమయాజి రచనలు అన్నారు. శ్రీ శ్రీ సాహిత్య నిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్‌కుమార్ మాట్లాడుతూ సాహిత్యరూపం ఏదైనా ప్రజోపయోగంగా ఉండాలని రచనలు చేసే వ్యక్తి పువ్వాడ తిక్కన సోమయాజి అన్నారు. కవయిత్రి కావూరి సత్యవతి మాట్లాడుతూ పువ్వాడ తిక్కన సోమయాజి రచనలలో లోతైన సామాజిక అవగాహన గల కవి అన్నారు. ఎక్స్‌రే కార్యదర్శి బి.ఆంజనేయరాజు మాట్లాడుతూ కఠిన పద్యాన్ని కూడా అందరికీ అర్థమయ్యేరీతిలో గానం చేయగల గొప్ప వ్యక్తి పువ్వాడ అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ జల్లా గవర్నర్ తల్లం గంగాధరన్, కొల్లా జయశ్రీ, మాచిరాజు మీనాకుమారి, గంటేడు సుజాత, గుర్రం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.










