ప్రజాశక్తి- నందిగామ
నందిగామ పట్టణం రైతుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించిన జాస్తి హరిత వర్షిని (17) ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఉన్నత చదువులు చదివేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోవటం, హరిత వర్షిణి తండ్రి బ్యాంక్‌లో అప్పు తీసుకొవడం సమయానికి రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానంగా మాట్లాడటంతో హరిత వర్షిణి... మనస్థాపానికి గురైనదని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మన పరువు పోయిందని హరిత వర్షిణి తనతో చెప్పి ఎంతో బాధ పడిందని, ఇంట్లో తాము ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిదని మృతిరాలి తల్లి తెలిపారు.
విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని జాస్తి హరిత వర్షిని కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారంగా 20లక్షల రూపాయలు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ డిమాండ్ చేశారు. నందిగామలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానాలని ఆయన ఆరోపించారు. జాతీయ విద్యా విధానం తీసుకురావడం వల్ల పేద విద్యార్థులకు విద్యా అందని ద్రాక్షగా మారడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్, జక్కులూరి రవి,శ్రీను, నాయకులు పాల్గొన్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని జాస్తి హరిత వర్షిని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందిగామ ప్రభుత్వాసుపత్రిలో బాలిక మృత దేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.










