Jul 24,2022 22:22

  • చీమలపాడులో సిపిఎం నాయకుల పర్యటన

ప్రజాశక్తి-ఎ.కొండూరు: మూడు సంవత్సరాల క్రితం కిడ్నీ వ్యాధి సోకి మందులు వాడుతున్నాను... ఇప్పటివరకు 73 సార్లు డయాలసిస్‌ చేశారు... అనేకసార్లు పెన్షన్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను... ఇప్పటివరకు మంజూరు కాలేదు... వైద్యానికి డబ్బుల్లేక డయాలసిస్‌ చేయించుకోవడం మానేశాను అంటూ పెద్దతండాకు చెందిన జరబల రాంబాబు సిపిఎం నాయకుల ఎదుట వాపోయాడు. ఇలా ప్రతి ఇంట్లోని కిడ్నీ బాధితులు తమ సమస్యలను నాయకులకు చెప్పి ప్రభుత్వం నుంచి సాయమందేలా చూడాలని కోరారు. ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, ఇతన నాయకులు ఎ.కొండూరు మండలంలోని చీమలపాడు హరిజనవాడ పెద్దతండ, చైతన్యనగర్‌ తండాలలో పర్యటించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ మండలంలో కిడ్నీ వ్యాధుల వల్ల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయని, అందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. కిడ్నీ వ్యాధుల వల్ల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయని, దీనిపై సిపిఎం ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది మృతిచెందారని, అంతకుముందు లెక్కకు మించి మరణించారని అన్నారు. సిఎం జగన్‌ కిడ్నీ వ్యాధుల విషయమై ఆరోగ్య శాఖ అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదన్నారు. కిడ్నీ వ్యాధులతో మంచంలో డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు తమకు ఉన్న ఆస్తులను అమ్ముకొని సర్వం కోల్పోయారని, ప్రభుత్వం నుండి కనీసం పెన్షన్‌ కూడా రాకపోవడంతో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు కిడ్నీ వ్యాధులతో మరణించిన వారి వివరాలను ప్రభుత్వం సేకరించి, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా డివి కృష్ణ మాట్లాడుతూ పెద్దతండాకు చెందిన రాంబాబు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 73 సార్లు డయాలసిస్‌ చేయించుకున్నాడని తెలిపారు. ఇప్పటివరకు ఆయనకు పెన్షన్‌ మంజూరు కాలేదని, ఈ విషయాన్ని మండల పరిషత్‌, ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నారన్నారు. ప్రజలకు తాగునీటి కోసం ఇప్పటివరకు కృష్ణాజలాలను సరఫరా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎస్‌.రామకృష్ణారెడ్డి మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు ఆళ్ల అమ్మిరెడ్డి, సోమా మోహన్‌రావు, ఎస్‌.సోములు, పంబి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు