Jul 24,2022 22:21

మాట్లాడుతున్న అప్పాజోస్యుల సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయవాడ: గుర్రం జాషువా సాహిత్యం ఈనాటి సమాజానికి కూడా ఎంతో అవసరమని, ఆయన సాహిత్యాన్ని, పద్యాలను ఆకళింపు చేసుకొని సమాజ మార్పు కోసం సాహితీవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక, పుష్పాంజలి రిథమ్స్‌, సాహితీ స్రవంతి, అరసం ఆధ్వర్యంలో స్థానిక బాలోత్సవ్‌ భవన్‌లో నిర్వహించిన గుర్రం జాషువా స్మృతులు కార్యక్రమంలో భాగంగా పద్యాలు, గీతాలాపన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రస్థానం అధ్యక్షులు సత్యాజీ అధ్యక్షత వహించగా ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ మాట్లాడుతూ జాషువా రాసిన ప్రతి పద్యం, సాహిత్యం ఈనాటి సమాజానికి కూడా ఎంతో అవసరముందన్నారు. జాషువా పద్యాలు, వాటి అర్ధాలను వివరించారు. పిరదౌసి, గబ్బిళం, క్రీస్తు చరిత్ర తదితర ఆయా కాలాలకు సంబంధించి వర్ణనగా వివరించారు. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ గబ్బిళం అనే కండకావ్యంతో శివుడికి పేద వాడి బాధలు చూడమన్న గొప్ప కవి అని పేర్కొన్నారు. అనిల్‌ డ్యాని మాట్లాడుతూ...నేడు దేశంలో మతోన్మాదులు పెచ్చురిల్లిపోతున్న తరుణంలో అందరినీ ఐక్యం చేసేందుకు ఇటువంటి సాంస్కృతిక సభలు, సమావేశాలు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో జాషువా సాంస్కృతిక వేదిక మరిన్ని విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తుందని, దానికి మీ అందరి సహకారం అవసరమన్నారు. సత్యాజి మాట్లాడుతూ...జాషువా గొప్ప కవి అని, ఆయన సాహిత్యాన్ని , కవిత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలన్నారు. జాషువా సాహిత్యం ఈ నాటికి కూడా అజరామరం, ఆచరణీయమని అని పేర్కొన్నారు. ఆర్‌ఎల్‌ బాలాజి కుమార్‌ నేతృత్వంలో గుర్రంజాషువా పద్యాలు, 35 దేశభక్తి గీతాలాపన జరిగింది. అనంతరం ఆధ్రా ఆర్ట్స్‌ అకాడమి కార్యదర్శి గోళ్ల నారాయణరావు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, అరసం జిల్లా అధ్యక్షులు కొండపల్లి మాధవరావు చేతుల మీదుగా మెడల్స్‌, మెమెంటోలు, సర్టిఫికెట్స్‌ను పంపిణీ చేశారు.తొలుత వక్తలను జాషువా సాంస్కృతిక వేదిక కార్యదర్శి జి నారాయణరావు వేదికపైకి పిలిచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ వేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. ముందుగా జాషువా చిత్రపటానికి సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.