ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో వన్‌టౌన్ బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద ఆలయ స్థానాచార్యులవారు, ప్రధానార్చకుల ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దుర్గమ్మకు పవిత్ర సారెను సమర్పించారు. గురువారం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద పూజలు నిర్వహించి ఊరేగింపుగా వివిధ రకాల పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్లు మరియు ఇతర వంటకాలతో మంగళ వాయిద్యాల నడుమ బయలుదేరి కాలినడకన శ్రీ అమ్మవారి ఆలయం చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం మహామండపం ఆరవ అంతస్తు చేరుకోగా శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ వార్లు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు, పర్యవేక్షకులు, సెక్యురిటీ, శానిటేషన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న కమలానంద భారతీ స్వామిజీ
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను గన్నవరంలోని శ్రీ భువనేశ్వరి పీఠం ఉత్తరపీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామిజీ గురువారం అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన స్వామికి ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామీజీ శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం ఆలయ వేద పండితులు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేశారు.
అన్నదానానికి దాతల విరాళాలు : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి ప్రజాశక్తి నగర్, విజయవాడకి చెందిన కె.అర్చన జమదగ్ని రూ.1,01,116లు, కానూరుకి చెందిన నాగసాయి ఐశ్వర్య మున్నంగి, కుటుంబ సభ్యులు నిత్య అన్నదానము పథకానికి రూ.1,10,000లు గురువారం ఆలయ అధికారులను కలిసి దేవస్థానానికి విరాళంగా అందజేశారు.










