- ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సిఇఒ శ్రీధర్‌రెడ్డి
ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: ప్రతిఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సిఇఒ శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదన్నారు. రోటరీ మిడ్‌టౌన్ విజయవాడ, హాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ అనుబంధంతో నోవాటెల్ హోటల్‌లో శాకాహారి పౌష్టికాహారం పేరిట వంటల పోటీలను సోమవారం నిర్వహించారు. పాకశాస్త్రంలో నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించి మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా కోవే పౌష్టిక్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా వంటల పోటీలను నిర్వహిస్తోంది. మహిళలు శాకాహార వంటకాలను ఇంటిలోనే వండి, పోటీల్లో ప్రదర్శనకు ఉంచారు. చెఫ్‌లు వంటలను పరిశీలించి ఉత్తమ వంటలను ఎంపిక చేసారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఆహార పదార్ధాల గురించి అవగాహన ఉన్నవారు చిన్న పరిశ్రమలు స్థాపించవచ్చని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎంఎఫ్‌ఎంఇ స్కీంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ స్కీంలో 35 శాతం సబ్సిడీ ఇస్తారని, 55 శాతం బ్యాంకు లింకేజీ ఉంటుందని, మహిళలు 10 శాతం పెట్టుబడి పెట్టాలని తెలిపారు. కోవే ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ రాధికా చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వంటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ చూపిన మహిళలు చెఫ్స్ అసోసియేషన్ తరఫున ఫుడ్ ఇండిస్టీ వైపు మౌల్డ్ చేయడానికి శిక్షణ ఇస్తారన్నారు. కోవే తరఫున వారికి కావాల్సిన రుణాలు, ప్రాజెక్ట్ రిపోర్టులు ఇవ్వడంలో గైడెన్స్ ఇచ్చి వ్యాపారవేతలుగా తయారు చేసేందుకు కషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ మిడ్ టౌన్ అధ్యక్షులు కృష్ణప్రభు మాగంటి తదితరులు పాల్గొన్నారు.










