Jul 26,2022 23:09

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: భారతరత్న, పద్మశ్రీ, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఎపిజె అబ్ధుల్‌ కలాం సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటరావు ఆధ్వర్యంలో చిట్టినగర్‌ నగరాల సీతారామస్వామి కళ్యాణ మండపంలో మంగళవారం అబ్దుల్‌ కలాం 8వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి వెలంపల్లి, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వేముల హరజత్తయ్య గుప్తా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం ఓ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని కొనియాడారు. ప్రతి సంవత్సరం అబ్ధుల్‌ కలాం వర్థంతి సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, అలాగే పారిశుధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ, ప్రజలకు అవసరమైన మందులను పంపిణీ చేసిన వ్యక్తి వేముల వెంకట్రావు అని కొనియాడారు. ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్‌ కలాం చనిపోయేవరకూ విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించేవారని తెలిపారు. ఎపిసిఆర్‌డిఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రాముడు మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి ఏరోనాటికల్‌ ఇంజనీర్‌గా పనిచేసి ఇస్రో గొప్ప శాస్త్రవేత్తగా ప్రపంచానికి దేశం యొక్క విలువను చాటి చెప్పారన్నారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని ప్రతి ఒక్కరూ బాగా చదవాలని విద్యార్థులకు సూచించారు. 350 మంది విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్ల కోటయ్య, మాజీ సైనికుడు తూతుపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ శనీశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు నరసింహారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి.సి. ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి బాయన శేఖర్‌బాబు, రాకేష్‌, గౌతమ్‌ విద్యాసంస్థల అధినేతలు ఎన్‌.వి. రావు, ఎన్‌. సూర్యారావు, నాగమల్లేశ్వరరావు, 48, 51 డివిజన్ల కార్పొరేటర్లు అత్తులూరి ఆదిలక్ష్మి, మరుపిళ్ళ రాజేష్‌, బలివాడ శివకుమార్‌ పట్నాయక్‌, ఈశ్వరరావు, అప్పారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.