ప్రజాశక్తి-నందిగామ(ఎన్‌టిఆర్‌జిల్లా) : నందిగామ రైతు పేటలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని జాస్తి హరిత వర్షిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరిత వర్షిని మృతదేహాన్ని ఆసుపత్రిలో సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ.. నందిగామలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానాలని ఆయన ఆరోపించారు. ఇలాంటి సంఘటన నందిగామలో జరగటం చాలా దురదృష్టకరమన్నారు మరో విద్యార్థికి ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వాలు తగిన రక్షణ కల్పించాలని కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఒకపక్క విద్యార్థులు, మరోపక్క విద్యార్థులు తల్లిదండ్రులు అనేక ఆర్థిక ప్రయాసలు గురై చదువు చెప్పించుకోలేక ఎంతో మనోవేదన గురై ఎవరికి చెప్పుకోలేక మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబానికి 20 లక్షలు ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్, జక్కులూరి రవి,శ్రీను, నాయకులు పాల్గొన్నారు.










