Jul 28,2022 22:50

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌
ఈనెల 31వ తేదీన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించనున్న జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-4) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 31వ తేదీ ఆదివారం నిర్వహించే జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-4) పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గురువారం డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌వో మాట్లాడుతూ జిల్లాలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-4) పరీక్షలకు 18,195 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు.పరీక్షల నిర్వహ ణకు 41 కేంద్రాలను ఏర్పాటు చేశామని నగరంతోపాటు విజయవాడ రూరల్‌ నున్న, ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. పరీక్షలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయని అభ్యర్థులు ఉదయం 10:45 నిమిషాలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తమతో పాటు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటర్‌ కార్డు వంటి ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. పరీక్షల నిర్వహణకు 41 ఛీఫ్‌ సూపర్‌వైజర్లు, 41 అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు నియమించామన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని ప్రత్యేక మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి శానిటైజర్‌ చేసుకోవాలన్నారు. అధికారులు సమన్వ యంతో పరీక్షలను విజయవంతం చేయాలని డిఆర్‌వో కె. మోహన్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏపిపిఎస్‌సి, పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య ఆర్‌టిసి శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.
సూచన : సెంటర్‌ కోడ్‌ నెంబర్‌ 6066 కేంద్రంలో పరీక్షలు రాసే అభ్యర్థులకు హాల్‌టికెట్ల నందు శ్రీ విజ్ఞాయ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌కు బదులుగా విజ్ఞాన్‌ విహార్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌గాను డోర్‌ నెంబర్‌ 23-24-28ఏ నియర్‌ నౌలార్‌కు బదులుగా నియర్‌ నాడార్‌ గాను సరిచూసుకోవాలని,సెంటర్‌ కోడ్‌ నెంబర్‌ 6075 కేంద్రంలో పరీక్షలు రాసే అభ్యర్థులకు హాల్‌ టికెట్ల నందు జూడి కి బదులుగా జూపూడి ఇబ్రహీంపట్నంగా సరిచూసుకోవాలని డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ తెలిపారు.