Jul 25,2022 22:10

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు వికలాంగుల జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు ఎపి దివ్యాంగ క్రికెట్‌ సంఘం కార్యదర్శి వై.వసంతకుమార్‌ తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో టోర్నమెంట్‌కు సంబంధించిన జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈసందర్భంగా వసంతకుమార్‌ మాట్లాడుతూ మూడవ సారి జాతీయ స్థాయి టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్‌ మూలపాడు ఎసిఎ క్రికెట్‌ గ్రౌండ్స్‌, సింగ్‌నగర్‌ ఎంబి స్టేడియం, కె.ఎల్‌. యూనివర్శిటీ క్రికెట్‌ స్టేడియం నందు పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీలలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 24 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ట్రోఫీని శాసన సభ్యులు మల్లాది విష్ణు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో జాతీయ స్థాయి ప్రతిభావంతుల క్రికెట్‌ టోర్నమెంట్‌ జరగడం సంతోషకరమని తెలిపారు. పోటీలకు సంబంధించి తగిన విధంగా సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుధాకర్‌, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.