Feb 28,2022 07:51

దాడికి తెగబడడానికి
మీ కారణాలు మీకుండొచ్చు
కన్నీటి కెరటాలతో నిత్యమూ
కల్లోలపడే ప్రపంచ ప్రజా సముద్రాన్ని
నల్ల సముద్రపు చమురు తెట్టులో ముంచేశారే!?
యుక్రేన్‌ పైనున్న చుక్కల ఆకాశాన్ని
రక్తపు చుక్కల ఆకాశంగా మార్చేశారే!?

నాటో నాటకాలో, పూతన పన్నాగాలో
మీ యుద్ధ హేతువులు మీకుండొచ్చు -
ప్రశాంత సూర్యోదయమే అకస్మాత్తుగా
మసి ముద్దల్లాంటి కిరణాలను విసిరినప్పుడు
నింగీ నేలా ఒకేసారి మెరుపు మోతలై
బీభత్సాన్ని కురిసినప్పుడు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
ఏ బంకర్లోకో కన్నీళ్లతో పరుగులు తీసే
భీతి చిప్పిల్లిన కళ్ళు..
దయలేని ప్రేక్షక ప్రపంచం మీద
దుమ్మెత్తి పోస్తాయి!

శత్రు వినాశనం పేరుతో
సొంత ప్రజలను బలి చేయడంలో
మీ రహస్య ప్రయోజనాలు మీకుండొచ్చు -
ప్రతి పొరుగు దేశాన్నీ
కంబళి కప్పిన ముళ్ళ పొదలా చూసేవాడికి
చుట్టున్నవన్నీ శత్రు దేశాలే!
పక్కనేల సార్వభౌమ రాజ్యాధికారం
పుచ్చుబుర్రకు పుండులా తోచేవాడికి
యుద్ధమే గత్యంతరం!

చిమ్నీ కళ్ళతో సెకలించి
శతఘ్ని నవ్వులతో చర్చలకని పిలవడానికి
మీ వ్యూహాలు మీకుండొచ్చు -
ఓడిపోతామని తెలిసినా
లొంగుబాటును అసహ్యించుకునే బాధితులు
స్వచ్ఛందంగా సైనిక జాబితాలో చేరుతారు
సాపేక్షంగా కురచ చేతులు కూడా
గైడెడ్‌ మిస్సైల్‌ను కూల్చే కొత్త వ్యూహాలౌతాయి
నిరాయుధులే యుద్ధాన్ని బంధించే
తెగువగల ఆయుధాలౌతారు!

నేతల యుద్ధోన్మాదానికి
నెత్తుటి ముద్దలై మిగిలేకన్నా
దేశమేదైనా ప్రజలెవరైనా
యుద్ధాన్ని నిరసించడమే
21వ శతాబ్దపు పౌరవిధి!

- కంచరాన భుజంగరావు
9441589602