Jul 25,2022 07:00

చిల్లుల పడ్డ దేశాన్ని
తక్కెడ చేసుకున్నదెవరో
అందరికీ తెలుసు
నువ్వూ నేనూ అందులో
తూకపు రాళ్లం

కొండగాలి దిశ మార్చుకుంది
రాళ్లు రప్పలతోనే ఫంక్తి భోజనాలు
ఐదేళ్లకోసారి
విస్తర్లు మారుతుంటాయంతే
రంగుని బట్టి బరువు
హంగుని బట్టి ఆదరణ

తోలుబొమ్మలాటల్లో
పీకలు తెగిపోతున్న వాళ్ళం
ఇప్పుడు రాజకీయం
నెత్తుర్లు పారే బొమ్మలాట
దాగుడు మూతలాటలో
మనిద్దరి కన్నీళ్లే గంతలు

పేదరికమంటే
బహుళ అంతస్తుల నుంచి
జారిపోతున్న చిక్కటి నెత్తురు
గుప్పెడు గింజలు గుక్కెడు దాహమూ
పిసరంత ఊపిరీ
వీటన్నింటినీ ఎవరో
జేబులో వేసుకుపోతున్నారు

నువ్వూ నేనూ
ఇంకా ఎన్నాళ్లనీ కావలి కాద్దాం?!

- వైష్ణవి శ్రీ