ఒట్టావా : ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజార్‌ను కెనడాలో గురుద్వారా వెలుపల కాల్చి చంపారని అధికారులు సోమవారం తెలిపారు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల్లో ఒకడైన హర్‌దీప్ సింగ్‌ను పట్టుకుంటే రూ.10 లక్షల నగదు అవార్డును కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్‌లోని జలంధర్‌కి సమీపంలో భర్‌సింగ్‌పూర్ గ్రామానికి చెందిన హర్‌దీప్ సింగ్ గురుద్వారా వెలుపల పార్క్ చేసి వుంచిన కారుల్లో బుల్లెట్ గాయాలతో చనిపోయి వుండగా కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గురుద్వారాకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిజార్‌పై కాల్పులు జరిపారని, ఆయన అక్కడికక్కడే మరణించారని అధికారులు తెలిపారు. కెనడా పోలీసులు ఆయన మృతదేహానిు తరలిస్తుండగా, కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ అనుకూల, భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. 2021లో జలంధర్‌లో హిందూ పూజారిపై దాడి కేసులో నిజార్‌పై రూ.10 లక్షల బహుమతిని ఎన్‌ఐఎ ప్రకటించింది. ఖలిస్తాన్ అనుకూల గ్రూపునకు చెందిన వేర్పాటువాద, హింసాత్మక ఎజెండాను నిజార్ ప్రోత్సహిస్తున్నారని ఎన్‌ఐఎ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.










