ప్రముఖ రచయిత ప్రేమ్‌చంద్ 'కర్మభూమి' నవల బహుశా 1930లో రాశారు. కానీ, ఇప్పటి దేశ కాలమాన పరిస్థితుల్ని కళ్లారా చూసి, తర అక్షరాల్లో తూర్పార పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ నవల ప్రారంభమే స్కూళ్ళు, కాలేజీల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులు, స్కూళ్ళ యాజమాన్యాల నిరంకుశ విధానాలు, విద్యార్థుల్ని పీడించడం ఇప్పటికీ సమాజంలో జరుగుతుండటంతో ఈ నవల ఇప్పుడు రాసిందే అన్న భావన కలుగుతుంది. పేదల ఇళ్ల సమస్య, గోమాంస భక్షణ, దేవాలయాల్లో దళితులపై దాడి, రైతుల ఆందోళనలు.. ఈ నవలలో ఉన్నాయి. దేశంలోని సమస్యలని, కుటుంబంలోని బాంధవ్యాల సంఘర్షణ మేళవించి అద్భుతమైన చిత్రీకరణలతో, పాత్రల సమయోచిత, సందర్భోచిత సంభాషణలతో, వారి మధ్య మానసిక సంఘర్షణలను కూడా బలంగా, హృద్యంగా ఈ నవల సాగింది.
ఈ నవలలో ముఖ్య పాత్రలు మూడు : 1. అమర్‌కాంత్ 2. సుఖద 3. నైనా. కథానాయకుడు 'అమర్‌కాంత్' పాత్ర కన్నా 'సుఖద' పాత్రని రచయిత ఎంతో ఉన్నతంగా, ఆదర్శంగా తీర్చిదిద్దాడు. అమర్‌కాంత్.. కాశీలోని ధనవంతుడైన వడ్డీ వ్యాపారి లాలా సమర్‌కాంత్ కొడుకు. సమర్‌కాంత్ రెండో భార్య కూతురు నైనా. వీరిద్దరూ ప్రేమ ఆప్యాయతలతో ఎంతో అన్యోన్యంగా ఉండడం ప్రేమ్‌చంద్ చేతిలో బాగా పండింది. అమర్‌కాంత్... తన భార్య ధనవంతుల బిడ్డ, అహంభావి, ప్రేమగా ఉండదు అనే భావనలతో సతమతమవుతాడు. నిరంతర సంఘర్షణతో వేదన పడే ఆయన అర్ధాంగి పాత్ర - సుఖద. ప్రేమ్‌చంద్ ఈ నవలలోని చాలా ప్రధాన పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దినా... ఆయన ఆత్మ మాత్రం సుఖద పాత్రలోనే ఉందా? అనిపిస్తుంది. సుఖద - ధనవంతురాలైన తల్లికి ఒక్కతే కూతురు. తండ్రి లేడు. విద్యాధికురాలు. సౌందర్యవతి. ముక్కసూటి మనస్తత్వం. భర్తని, మరదలుని, మామగారిని గౌరవంగా, ప్రేమగా చూస్తుంది. కానీ భర్త అమర్‌కాంత్ ఆమెకి దగ్గర కాలేడు. అమర్‌కాంత్ కూడా ఉన్నత భావాలు కలవాడు. పేదల పట్ల మమకారం, ఎవర్నీ నొప్పించని మృదుత్వం ఉన్నవాడు. ప్రేమ్‌చంద్ ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ, మానసిక పరిస్థితుల్ని, ఇద్దరి వైపు నుంచీ ఎవరి వాదన వారిది కరెక్టే అని మనల్ని ఒప్పించేలా నడిపిస్తాడు.
సుఖద - తన భర్త, మామయ్యల మధ్య అభిప్రాయ బేధం వచ్చినప్పుడు ఎక్కువగా మామయ్యనే సమర్ధించినట్లు కనబడుతుంది. ఇది అమర్‌కాంత్‌కు నచ్చదు. ఆమెకు తండ్రి లేకపోవడం వల్లనేమో.. మామయ్యపై ఎక్కువ ప్రేమ, సానుభూతి కనబరుస్తుంది. తల్లి లేని అమర్‌కాంత్ తన అత్త గారైన రేణుకాదేవికి దగ్గర అవ్వడాన్ని కూడా రచయిత చిత్రీకరిస్తాడు. కానీ సఖద... తన భర్త, మామయ్య విడిపోయి వేరుగా ఉండాల్సివచ్చినప్పుడు భర్తకు అండగా కట్టుబట్టలతో భర్త కన్నా ఎక్కువ ధైర్యంతో బైటకి వస్తుంది. అప్పుడు తల్లి ధన సహాయం చేస్తానన్నా తిరస్కరించడం ఆమె వ్యక్తిత్వానికి తార్కాణం. తాము విడిపోయాక మామ గారు ఒకసారి జబ్బుపడితే సహజ వాత్సల్యంతో ఆయనకి సేవలు చెయ్యడానికి వెళుతుంది. దీనిని భర్త అమర్‌కాంత్ అర్థం చేసుకోలేక... తండ్రి ధనాన్ని చూసే తన సంపన్న మనస్తత్వాన్ని వదలలేక వెళ్ళిందని భావిస్తాడు.
'మానవ జీవితం అంటే స్త్రీ పురుషుల ప్రేమ సంబంధమైంది మాత్రమే కాదు కదా! శృంగారం, విరహతాపాలు, అందులోని నిరాశకే పరిమితమైపోయే సాహిత్యం ప్రపంచంలోని వాస్తవిక అనుభవాల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది' అని 9-4-1936న లక్నోలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలో.. తన అధ్యక్షోపన్యాసంలో.. ప్రేంచంద్ చెప్పిన మాటలన్నీ తు.చ. తప్పకుండా ఈ నవలలో, సుఖద పాత్రలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. మాలమాదిగలను దేవాలయంలోకి రానివ్వకపోవడానికి వ్యతిరేకంగా జరిగిన ఒక సంఘటనలో నాయకుడు శాంతకుమార్‌కి దెబ్బలు తగిలి కిందపడిపోయినప్పుడు ప్రజలు భయభ్రాంతులకు లోనై పరిగెత్తి పారిపోతుంటే.. తరుముతున్న పోలీసులకు ఎదురుగా నిలబడుతుంది సుఖద. ఆ సంఘటనతో 'గాలిలో ఆకుల్లాగా ఎగిరిపోతున్న ప్రజలు ఒక్క క్షణంలో గోడకట్టినట్టుగా నిలబడిపోయారు'. ఆమె అడ్డురాగానే పోలీసులు బాయెనెట్లు తీసి భద్రపరచుకొని, అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సుఖద ఆ విజయం సాధించిన వీర వనిత అని ఈ సంఘటనలో ప్రేమ్‌చంద్ వ్యాఖ్యానిస్తాడు. సుఖద పాత్రలో ఆయన ఆత్మ నిబిడీకృతమై ఉంది అనడానికి ఇదే నిదర్శనం. నిరాశ అన్నది ఆమె మనసు, మాటలు, చేతల్లో వీసమెత్తైనా కనబడనివ్వడు ప్రేమ్‌చంద్. అమర్‌కాంత్‌లో అప్పుడప్పుడు కనబడే నిరాశ... ఎన్ని అవమానాలకు గురైనా, సమస్యలు ఎదుర్కొన్నా సుఖదలో కనపడదు. పైగా ఎవరి మోజులో పడ్డ తర్వాత సమాజానికి తెలుస్తుందని భయపడి భర్త తనని వదిలి పారిపోయాడో.. ఆ సకీనా బాగా జబ్బు పడిందని తెలుసుకున్న సుఖద ఆమెని పరామర్శించడానికి ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళుతుంది. ఆమెను కౌగిలించుకుని మరీ ఓదారుస్తుంది. మరదలు నైనాని ఆమె భర్త ప్రేమగా చూసుకోవడం లేదనీ, నిర్లక్ష్యం చేస్తున్నాడనీ తెలుసుకొని మనీరామ్ ఇంటికి వెళ్ళి అతన్ని చెడామడా తిట్టి వస్తుంది. మాదకద్రవ్యాల బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటుంది. బలహీనవర్గాల వారికి గృహవసతి కల్పించే విషయంలో హర్తాళ్ళు, బంద్‌లు చేయించి జైలుకి వెళుతుంది. జైలులో ఉన్న భర్త మరో అమ్మాయి మున్నీని ప్రేమించాడని తెలుసుకొని ఆమెను కూడా 'చెల్లారు...' అని ప్రేమగా పలకరిస్తుంది. ఇలా ప్రేమ్‌చంద్ శైలిలో సుఖదా... సాహసం అణువణువునా నింపుకొని సమాజంపై పాజిటివ్ దృక్పధంతో సాగిపోతుంది.
'భౌతికంగా మనిషి నిర్మాణంలో రక్తమాంసాలు, ఎముకలు, కండరాలు ఎలాంటివో... వాస్తవికత.. సజీవత, భావ వ్యంజత, మానవ పరిశీలన, మానసికశాస్త్ర అధ్యయనం వంటివి ప్రతి పాత్ర నిర్మాణంలో రచయితకు ఆధారం కావాలి.' అని ప్రేమ్‌చంద్ అరసం మొదటి మహాసభలో అన్న మాటలు తన 'కర్మభూమి' నవలలో నుంచి తీసుకొన్నవే. 'నువ్వు జీవితంలో రహస్యాల్ని తెలుసుకోవాలంటే.. సంఘర్షణలో తప్ప మరెక్కడా లభించవు. సముద్రంలో విశ్రాంతి తీసుకోవడం నది సిగ్గుపడాల్సిన విషయం' అని ఇక్బాల్ మాటల్ని ఉటంకించింది కూడా. 'కర్మభూమి' నవలలో ప్రధాన పాత్రలు - సుఖదాకు, అమర్‌కాంత్‌తో మామ సమర్‌కాంత్‌తో, మరదలు నైనాతో, ఉద్యమ నాయకుడు శాంతకుమార్‌తో, తల్లి రేణుకాదేవి, భర్త స్నేహితుడు సలీమ్, భర్త ప్రియురాళ్ళు సకీనా, మున్నీలతో, మరదలు భర్త మునీరామ్‌తో జరిగే సంఘర్షణ, వారి మానసిక విశ్లేషణ, ప్రేమ్‌చంద్ ప్రతిభకు పదును పెట్టాయి.
'గట్టుమీద పిల్లల్ని నిద్రపుచ్చి పొలంలో చెమటోడ్చే స్త్రీలోని ఉదాత్త సౌందర్యాన్ని కళాకారులు చూడాలి' అన్న ప్రేమ్‌చంద్ సుఖదా.. జైలులో ఉంటూ కూడా తన రెండున్నర, మూడు ఏళ్ల కుమారుడు మున్నాని వదలకుండా ఆలన, పాలన ద్వారా ఆమె ఉదాత్త సౌందర్యాన్ని ఇనుమడింపచేసాడు. 'విప్లవాలకు దూరంగా ఉండేది అసలు సాహిత్యమే కాదు' అన్న ప్రేమ్‌చంద్ ఈ 'కర్మభూమి' నవలలో కథానాయకుడు అమర్‌కాంత్ అజ్ఞాతవాసం నేపథ్యంలో రైతులు ఉద్యమాన్ని ఉద్రేకంగా, ఉద్వేగంగా అంతం లేనిదిగా సృష్టించాడు. ఆయన ఈ నవలలో అంతా సుఖాంతం చేస్తాడు కానీ... రైతుల ఉద్యమం మాత్రం నిరంతరంగా జరుగుతుంది. దానికి అంతం లేదన్నట్టు సంకేతంగా నవలని ముగిస్తాడు. బహుశా ప్రేమచంద్.. ఆంగ్లేయుల పాలన అంతమయ్యేవరకు రైతులకు న్యాయం జరగదని భావించి ఉంటాడు. కానీ ఆయన నవల ముగించిన తొంభై ఏళ్ళకు కూడా.. స్వపరిపాలనలో కూడా రైతుల కష్టాలు తీరకపోవడం ఆయన ఊహలో కూడా అంగీకరించడు అనేది నిజం. 'కర్మభూమి'లో రాసిన గూదడ్, చౌదరి, పయాగ్, భూరా లాంటి సామాన్యరైతు పాత్రలు, జమిందారు మహంతు.. వాళ్ళ చెవులు పిండి శిస్తుగానీ, కౌలు పైకం గానీ వసూలుచేయడం... 'పొలంలో పండిన పంటంతా ఊడ్చినా కూడా కౌలు పైకం చెల్లించడానికి కూడా సరిపోవడం లేదు' 'నా ఇంట్లో చటాకు ధాన్యం కూడా మిగలలేదు' అని రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడాన్ని చూపించింది. నేడు ఢిల్లీలో జరుగుతున్న సాగు చట్టాల వ్యతిరేకపోరాటం రూపంలో ఇంకా జరుగుతూనే ఉంది.
'విలాస మందిరాల్ని సృష్టించడం, మనోరంజక సామగ్రిని పోగుచేయడం సాహిత్యకారుడి లక్ష్యం కాదు. సాహిత్య స్థితిగతుల్ని ఆ దుర్గతికి దిగజార్చకూడదు. దేశభక్తి, రాజనీతిని అనుసరించడంతో పాటు సాహిత్యం వాటి ముందు నిల్చి వాస్తవికతా కరదీపిక చేపట్టాల్సిన మార్గదర్శి కూడా కావాలి.' అని ప్రేమ్‌చంద్ తన మాటల్ని 'కర్మభూమి' నవలలోని పాత్రల ద్వారా ఆచరణలో చూపించాడు.
నవల ప్రారంభమే 'మన పాఠశాలల్లోను, కళాశాలల్లోనూ ఫీజులు చాలా కఠినంగా వసూలు చేస్తుంటారు' అనే వాక్యాలతో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన 'అమర్‌కాంత్' తన స్కూలు ఫీజు కట్టుడానికి పడే నానా అవస్థల్నీ చిత్రీకరించడం ఉంటుంది. ఇటీవల విజయవాడలోని ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఒక సంవత్సరానికి ఒక విద్యార్థి ఫీజు లక్ష రూపాయలు ఎలా కట్టాలా? అని ఒక తండ్రి మధనపడడం చూశాను. ఒక కార్పొరేట్ కాలేజీ యజమాని తన ఒక్కగానొక్క కొడుకు అర్ధంతరంగా చనిపోయిన రెండోరోజే కాలేజీకి వచ్చి విద్యార్థుల నుంచి బలవంతంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసాడని నేను ఇటీవల విన్నాను. మరి ఇది నేటి పాలకులు పట్టించుకుంటున్నారా? ప్రేమ్‌చంద్ నవల నేటికీ ఇదే ప్రశ్నిస్తోంది.
'కర్మభూమి' నవలా నేపథ్యంలో అంతా కాశీ, వారణాసి ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ఈ నాటి ఢిల్లీ ప్రభువులు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. వారి చేత ఎలాగైనా ఈ 'కర్మభూమి' నవల చదివించగలిగితే.. అప్పటికీ ఇప్పటికీ వారు సాధించిన ప్రగతి ఏంటో వాళ్ళే తెలుసుకునే అవకాశం ఉంది. కానీ అది సాధ్యమా! ఇంకా నయం... ఆయన్ని కూడా దేశద్రోహుల పట్టికలో చేర్చకుండా ఉంటే చాలు. కనీసం మనమైనా ఈ నవల మళ్ళీ చదివి ఆ క్రాంతదర్శి ప్రేమ్‌చంద్‌కు మనసారా నమస్కరించాలి.
- కె. ఆంజనేయకుమార్ 94940 53019










