''ఇప్పుడంతా దు:ఖం/ ఎవరిని కదిపినా దేన్ని కదిపినా/ అనంతమైన దు:ఖం/ చెట్టు పుట్ట నదీ../ దేన్ని తాకిన దు:ఖం/ ఆకాశం నుంచి సముద్రంలా కురుస్తున్న దు:ఖం (నిశ్చల ప్రయాణం) అంటున్నారు వైష్ణవిశ్రీ. నిజమే.. ఇదొక ఒడవని దు:ఖం. అప్పుడూ, ఇప్పుడూ ఈ దు:ఖం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ఎవరిని కదిలించినా, మాట్లాడినా ఏదో ఒక దు:ఖ గీతం వినిపిస్తూనే ఉంది. ఇంతకూ ఈ దు:ఖం ఎక్కడిది? ఎక్కడ నుంచి మొదలైంది? తెలుసుకోవాలంటే వైష్ణవి శ్రీ ఇటీవల వెలువరించిన 'దేశమంతా వాళ్ళ ఊరు' చదవాలి.
సహజంగా మనిషి కల్లోల కాలంలో పయనించినప్పుడో, అంతులేని ఆవేదనలు చుట్టుముట్టినప్పుడో, బతికే కష్టమైపోయినప్పుడో దు:ఖం ఊపిరాడకుండా చేస్తుంది. 'కరోనా వైరస్' విపత్తు వల్ల ఈ దేశ వలస కార్మికులకు సరిగ్గా అదే జరిగింది. వారు నిలబడ్డ నేల హఠాత్తుగా పరాయిదైపోయి వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు సరైన ముందస్తు వ్యూహం లేకుండా లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల వలస కార్మికులంతా అర్ధాకలితో అలమటించారు. చివరికి బతుకే గగనమైన చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకొని సొంత కాళ్ళను నమ్ముకొని పుట్టిన ఊరికి పయనమయ్యారు. పాదాలు నెర్రలు బారుతున్నా, ఆకలి, చీకటి చుట్టుముట్టినా వారు నడక ఆపలేదు. దారి పొడవునా ఎన్నో హృదయ విదారక సంఘటనలు గుండెల్ని పిండేసాయి. మరీ.. కవిహృదయం సున్నితం కదా? అందుకే స్పందించింది.
'ఏమని.. ఎలా.. వ్రాయను?/ నెత్తుటి పాదాల వ్యధలపై చిన్నచూపును ఎంతని ఇక్కడ నిలబెట్టను!/ కోట్లాది దు:ఖ కావ్యాల్ని ఇంత చిన్న అక్షరాల్లో ఎలా కూర్పు చేయను? (సముద్రమంతటి నడక) అంటూ వలస కార్మికుల వెతలపై కవయిత్రి తన బాధాతప్త హృదయాన్ని ఆవిష్కరించారు. విదేశాల నుంచి స్వరాష్ట్రాలకు వస్తున్న వాళ్లను విమానం దిగగానే అన్ని వసతులతో పెయిడ్ క్వారంటైన్ పంపిన ప్రభుత్వాలు ఏమీ లేనోళ్ళను మాత్రం కనీసం పట్టించుకోకపోవడం చాలా విషాదకరమైన విషయం. 'వాళ్లు విమానాల్లో తిరిగింది లేదు/ ఏ దేశానికి వెళ్ళింది లేదు/ ఏ క్రిమిని మోసుకొచ్చింది లేదు/ ఎవరి డబ్బు సూట్కేసుల మీదనో పాక్కుంటూ వచ్చిన పురుగేదో/ వారి బతుకులను కొరుక్కుతిన్నది' (పల్లె పిట్టలు) వైరస్ మనదేశంలో ఎలా ప్రవేశించింది? దీనికి కారకులు ఎవరు? ఇప్పుడు బలైపోతున్న వారెవరు? అంటూ వైష్ణవి పాలక వర్గాన్ని స్పష్టంగా ప్రశ్నించారు. 'పట్నం మెరుపుల్లో వాళ్ళు/ మలుపు మలుపులో వెలుగు దీపమై/ వీధివీధికో అద్దమై/ దేశాన్ని అంత ఎత్తున నిలబెట్టి/ ఆకలి పేగుళ్ళా విలవిలలాడుతూ వాళ్లే' (పునాదిరాళ్ల స్వాగతం) అంటూ ఆర్తిగా పలవరించారు.
కష్టజీవులు తలదాచుకుని జాగా లేని చోట వాళ్ళ నడక అనివార్యమై పోయింది. విశ్వాసం లేని నాగరిక సమాజాలు తలుపులు మూసేసినప్పుడు నడకే వారికి ప్రాణాధారం, జీవ బలమైంది. 'అవును.. వాళ్ళు నడవాలి/ తల ఒకచోట/ మొండెం మరొకచోట విసిరేసినా/ జానెడు పొట్టకోసం రెండు కాళ్లను అతికించుకుని/ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ/ వాళ్ళు నడవాలి (దేశమంతా వాళ్ళ ఊరు). ఆకలి, దాహాన్ని తట్టుకోలేక ఎందరో వలస కార్మికులు మార్గమధ్యలో ప్రాణాల్ని వదిలేశారు. చత్తీస్‌గడ్ వలస కూలీలు సొంత ఊరికి బయలుదేరే క్రమంలో పట్టాలపై నిద్రపోతున్న వారిపై గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో 16 మంది మరణించారు. బీహార్లోని 'ముజఫర్ నగర్' సంఘటన ప్రపంచాన్ని కదిలించింది. కన్నతల్లి చనిపోయిందని తెలియక తన రెండేళ్ల కుమారుడు ప్లాట్‌ఫారం మీద తిరుగుతూ ఆడుకోవడం హృదయాల్ని కలచివేసింది. అందుకే వైష్ణవి 'ఈ నడక మన నాగరిక వైఫల్యాన్ని విప్పి చెబుతున్నట్లుగా ఉందనే' సత్యాన్ని చెప్పింది. 'ఆ చిట్టి పాదాలు/ ఇప్పుడేదో రహస్యాన్ని చెబుతున్నట్లుగా లేదు/ ఆకలి మర్మాన్ని చెబుతున్నట్లుగా లేదు/ నాగరిక వైఫల్యాన్ని విప్పి చెబుతున్నట్లుగా లేదు (చిట్టి పాదాలు). అంతేకాదు బతకడం, చావడం రెండు సమానమైన చోట ఆకలి చావు దూత అని, ఆ పసి పాదాలు రహదారులను నిండా రాస్తూ వెళ్తున్నాయని గమనించారా? అంటూ ఈ సమాజ వైఫల్యాన్ని ప్రశ్నించారు కవయిత్రి. ఈ క్రమంలో నాగరీకులను హెచ్చరిస్తూ, 'మీరు మీ పునాది రాళ్లు పగలకొట్టుకుంటున్నారని' హితవు పలికారు.
ఈ సందర్భంలోంచే వైష్ణవి ఒక పిలుపునిచ్చారు. 'వాళ్ళు నడుస్తున్నప్పుడు మీకు ఎవరైనా ఎదురుపడితే కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి/ నులక మంచం వేసి సేద తీర్చండి/ కాసింత గంజి అయినా పోసి ఆకలి తీర్చండి../ పగిలిన పాదాలకు చెప్పుల తొడిగి మేమున్నామంటూ ఓ భరోసా ఇచ్చి మానవత్వం బతికే ఉందని చాటి చెప్పండి' అని సూచించారు. 'వూసుపోని వంటావార్పులు/ ఒక్కరోజు ఇల్లు ఊడ్వటాలు/ దోశలు వేసే చాలెంజ్‌లు కాదు/ దళారీల ఖజానా పగలగొట్టి/ రైతన్న ఆకలిదప్పులు, అప్పులు తీర్చే/ ఈ దేశ దారిద్య్రాన్ని గుండెలకు హత్తుకున్న/ పేదరికం దాహం తీర్చే/ చాలెంజ్ కావాలని తన కవిత్వంతో గొంతెత్తారు. 'వలస పక్షులు తమ గూడుకు చేర్చే/ ఛాలెంజ్ ఒకటి విసురుదామిప్పుడు/ ఆకలి చావులకు తావు లేని దేశమని/ సముద్రమంతా మనసున్న చేతులు మనవని/ చాలెంజ్ లు విసురుదాం/ రెఢ?' (ద చాలెంజ్ )
కరోనా సమయంలో వలస కార్మికులు కాలే కడుపును భుజానేసుకుని, కాళ్ళకు ఊపిర్లద్దుకుని నడకను మాత్రమే నమ్ముకున్నారు. వాళ్ళంతా మన వాళ్లు. మన దేశ ముఖచిత్రాన్ని అందంగా నిలబెట్టినవారు. అటువంటి వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలిసిన బాధ్యత ఈ సమాజానిదేనని వైష్ణవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజంగానే తను అన్నట్టు 'మనుషులంతా/ మనసుకు కట్టుకు తిరుగుతున్న అంతస్తుల హద్దులను చెరిపేస్తే/ దేశమంతా వాళ్ళ ఊరు అయిపోగలదు'. ఈ దు:ఖం ఇప్పుడే అంతం కాలేదు. ఏ క్రీమి ఎప్పుడు విజంభిస్తోందో భవిష్యత్తుకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. అందుకే మనిషి గడిచిన కాలాన్ని గుణపాఠంగా తీసుకోని భవిష్యత్తు వైపు అడుగు వేయాలని, సాటి జీవచరాలకు, ప్రకృతికి తలొగ్గి నడవాలని, మనిషి 'సామూహికం' అయినప్పుడే ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చని కవయిత్రి ఈ సంపుటి ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా కల్లోల కాలంలో రాసుకున్న కవితలన్నింటిని కలిపి 'దేశమంతా వాళ్ళ ఊరు' పేరుతో కవిత్వ సంపుటి తేవడం మంచి విషయం. కాస్త ఆలస్యంగా వెలువరించినప్పటికీ భవిష్యత్తు తరానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంపుటి మొత్తం వలస కార్మికుల జీవన సరళిని, కష్టాలను, దు:ఖాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. తన తొలి కవితా సంపుటి 'ఏడవ ఋతువు'తో మంచి కవయిత్రిగా పేరును నిలబెట్టుకున్న వైష్ణవి శ్రీ ఇలాంటి సామాజిక విలువలను పెంపొందించే కవిత్వాన్ని వెలువరించడం చాలా అభినందనీయం. 'దేహమిప్పుడు ఆకలి జెండాను కప్పుకొని/ మరింత నగంగా కనిపిస్తుంది.. ఆకలి పొట్టల్ని భుజానేసుకుని/ నగరంలో దించుకున్నారు.. దేశమిప్పుడో పగిలిన పల్లేరు కాయ/ పచ్చటి నెత్తుటి వాసనేస్తూ..' లాంటి ఎన్నో కవితా పాదాలు ఈ పుస్తకాన్ని బలంగా నిలబెట్టాయి. ఈ సందర్భంగా కవయిత్రిని అభినందనందిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంపుటాలెన్నో వెలువరించాలని ఆశిద్దాం. ప్రతులకు 8074210263 నెంబర్లో సంప్రదించొచ్చు.
- బిల్ల మహేందర్










