గుక్కెడు నీళ్ళకీ కులముంటుందని
పిసరంత గాలికీ మతమంటుకుంటుందని
గుప్పెడు మెతుకులూ రకరకాల రంగుల్లో
మునిగి తేలుతుంటాయని
వాడికేం తెలుసు?!
ఇంద్రధనుస్సు రంగుల్లో
ఇమిడిపోయిన పసితనానికి వర్ణ భేదాలు
నెమలి పింఛాన్ని పదిలంగా దాచుకునే
పాలుగారే వయసుకి
వర్గ తారతమ్యాలూ ఉండవు కదా!
అందరి పసిపిల్లల్లాగే వాడూ
ఓ గాలిపటాన్ని ఎగరేశాడు
ముళ్ళ కంచెల్లో ఇరుక్కుపోయి
ఊపిరాడక విలవిలలాడుతుందని
లేలేత ప్రాయానికేం తెలుసు?!
చీల్చిన వెదురు బద్దల మధ్య
కాసింత మనిషితనం ఇంకితేనేగా
వేణుగానమవుతుంది
ఏ ఆధిపత్యాన్ని చూసుకోనందుకే
మరే అంధకారాన్ని పులుముకోనందుకే
దానికంత మాధుర్యం అంతటి పారవశ్యం!
ఆకాశం, భూమి నువ్వు గొప్ప, నేను గొప్పని
నిందించుకోవడం నీకు తెలుసా!?
ఒక్క నువ్వూ, నేనేగా దహించుకపోతున్నాం!
నెత్తిన ఆకాశాన్ని కాళ్ల కింద నేలని
ఆలింగనం చేసుకోని జీవజాతులుంటాయా?
మనిషి తప్ప!
నీరు నిప్పు గాలి భూమి ఆకాశం
కలగలిసి నిలబడితేనే
నిలువెత్తు దేహమైనా నిండు కుండైనా!
మట్టి ముద్ద కుమ్మరి చేతిలో నలిగీ
చక్రం మీద అనేక దశలుగా వొదిగీ
సలప దెబ్బలకు వోర్చుకుని
కణకణ మండే నిప్పుల
కొలిమిలో తననెంతగా కాల్చుకుంటేనో
కుండగా రూపాంతరం చెందుతుంది?
ఎన్ని పరిణామ క్రమాలు దాటుకుని వస్తేనో
మనిషిననే ఈ మానవ రూపం!
అప్పుడు బొటన వేలు ఇప్పుడో నిండు ప్రాణం
నిండు కుండ తొణకదు
కుండకున్న నిండుతనం మనిషికేది?
- వైష్ణవి శ్రీ
80742 10263










