నేను
విద్వత్తులోంచి ప్రశ్నల ముడులు విప్పి
ఉదయాలని ముస్తాబు చేస్తూ
ఒక నిర్లిప్త నిశీధిలో నుంచి
ఒక నిశ్శబ్ద విప్లవాన్ని జనింప చేశాను .
కాలానికి కళ్లెం వేసి ఆపటం ఎవడి వశం
సూర్యుణ్ణి చేతుల్లో బంధించటం
అజ్ఞాన వారధికి అంకురం వేయడమే .
నిత్యం కాలాన్ని కాగుతున్నపుడు
శ్రమ ఓ పక్క వాడిపోతున్నపుడు
ఫలితం ముక్కలవుతున్నపుడు
కన్నీళ్లు రెక్కలు తొడుక్కున్నప్పుడు
ఎర్రని సూర్యోదయాలు రెపరెపలాడుతాయి .
కాళ్ళ కింద
కూసింత నేల కూడా పరాయిదైనపుడు
తెలియని గాలానికి చేపలైనపుడు
ఒక ప్రశ్న పదునెక్కుతుంది
ఒక ఉద్యమం తలకెక్కుతుంది
జాత్యహంకారాల అంధకారానికి
చరమగీతం వినబడుతుంది
నిప్పుల్లో కాగిన బతుకులు ఎర్రబడి
ఎరుపు రంగుల్ని ఎగరేస్తాయి
అస్తిత్వపు బాటలు దండోరా మోగిస్తాయి
బతుకున అలసిన క్షణాలు
విద్వత్తులోంచి ధ్వనిస్తాయి
ఒక నిశ్శబ్ద విప్లవంగా యుద్ధం చేస్తాయి
- గవిడి శ్రీనివాస్
70192 78368










