1990వ దశకం మొదలు 2000ల వరకు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో దళిత చైతన్యం వెల్లివిరిసింది. అనంతర కాలంలో దళితోద్యమాలు తగ్గుముఖం పట్టడంతో ఆ సాహిత్యమూ తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో జోతిబా పూలే చైతన్య స్ఫూర్తి దేశమంతటా ప్రబలుతూ ఉండడంతో బిసిల అస్తిత్వానికి, ఉద్యమానికి సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో 'వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు' కవితా సంకలనం వెలువడింది. అంతకుముందు సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో 'బహువచనం' వెలువడినప్పటికీ అందులో దళిత - బహుజన ఇద్దరి కవిత్వమూ ఉంది. గౌరీశంకర్ సంకలనంలో తొలి, మలితరం బీసీల అస్తిత్వగానం రికార్డయింది. అనంతర కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కవులు తమ కవితా సంపుటాల్లో స్వీయ కుల అస్తిత్వాన్ని ప్రకటిస్తూ రాసిన కవితలనూ జోడించారు. నల్లగొండ నుంచే 'మేమే', 'మొగి' కవిత్వ పుస్తకాలు వెలువడ్డాయి. 2016లో చింతం వ్రవీణ్ 'సమూహం', 2019లో జయప్రకాశ్ సంపాదకత్వంలో 'బిసి కవిత' వెలువడ్డాయి.
2005లో మొదటిసారిగా జూలూరు గౌరీశంకర్ 'నాలుగో కన్ను' పేరిట బీసి దీర్ఘకావ్యాన్ని రాశాడు. అనంతపురం నుంచి రాధేయ 'మగ్గం బతుకు' పేరిట చేనేత కళాకారుల బతుకు చిత్రాలను దీర్ఘకవితలో పడుగు పేకలుగా అల్లాడు. భూసురపల్లి వెంకటేశ్వర్లు 'నాన్న కోసం' పేరిట భజంత్రీల బతుకులను కైతగా మలిచాడు. 2019లో కరీంనగర్‌కు చెందిన అన్నవరం దేవేందర్ 'బువ్వకుండ' పేరిట కుమ్మరి వాండ్ల జీవితాలను కైగట్టాడు. వనపట్ల సుబ్బయ్య 'అసిపె' పేరిట మంగలి వారి జీవితాలను కవిత్వీకరించాడు. ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న దీర్ఘకవిత అనంతపురం జిల్లాకు చెందిన ఈ.రాఘవేంద్ర రాసిన 'కల్లంచుల బువ్వ'.
రాఘవేంద్ర తన కవిత్వంలో ప్రపంచీకరణానంతరం గౌడ్‌ల వృత్తిజీవితం ఎట్లా దిగజారిందో చెప్పాడు. ఏండ్ల నుంచి తాటి, ఈత చెట్లను నమ్ముకొని బతికిన గౌడన్నలు ఎట్లా ఉపాధి కోల్పోయి, ఆకలికి అలమటించినారో ఈ దీర్ఘ కవితలో రాశాడు. కల్లుతో పాటు ఈత, తాటి చెట్లు అందించే ఉప ఉపాధి అంశాల్ని చిత్రించాడు. ఈ దీర్ఘ కవితలో వాళ్ల 'నాయిన'ను 'ఆత్మ'గా ప్రవేశపెట్టి కవిత్వమల్లాడు. తాత, తల్లిని కూడా యాద్జేసుకున్నాడు. అక్షరానికి నోచుకోని బాల్యం, లైంగిక వేధింపులకు గురయ్యే స్త్రీలు, ఆధిపత్య కులాల జులుం, స్వీయ వృత్తిపరమైన సాధక, బాధకాలతోపాటు అందులో ఉండే ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనే తీరు, చెట్టుని కోతులు, విషప్పురుగుల నుంచి కాపాడుకునే వైద్య విద్య, చెట్లల్లోని రకాలు, అదే సమయంలో భూమి యజమాని చెట్టుపై పెంచే సుంకం, పెంచలేని కల్లు రేటు, వృత్తిలో నైపుణ్యంగా ఉపయోగించే అతారలు, గౌడ స్త్రీల తోడ్పాటు, కస్టమర్ల కామపు చూపులు, వృత్తితో సంబంధంలేని వారి చేతిలో సహకార సంఘాలు, రాజకీయ రచ్చబండగా మారే కల్లు మండువ ఇట్లా అనేక అంశాలను బహుజన కోణంలో కవిత్వంలోకి తెచ్చాడు రాఘవేంద్ర.
నీళ్లకు అంటు ఉంటది గాని కల్లుకు అంటు ఉండదు. ఒకే లొట్టి నుంచి దళితుడికి - రెడ్డి దొరకు కల్లు ఒంపుతాడు గౌడ్. నిజానికి పురాణ కాలంలో బ్రాహ్మణులు సైతం కల్లు తాగేవారని వేటూరి ప్రభాకర శాస్త్రి ఒక దగ్గర రాశాడు. ఆయన తాటిచెట్టుని 'ఆంధ్రుల కల్పవృక్షము' అన్నాడు. 'మున్యాశ్రమములో మనులు తాటిపండ్లను ఫలాహారముగా నుపయోగించువారనుటను కాదంబరిలోని యీ క్రిందివాక్యము నిరూపించుచున్నది. జాబాలి మహర్షి యాశ్రమమున 'ఉటజాజిర ప్రకీర్ణశుష్యచ్ఛ్యా మాక ముపసంగృహీతామలక, లవలీ, లవంగ, కర్కంధూ, కదళీ, లికుచ, చూత, పనస, తాళఫల, మధ్యయన ముఖరవటుజన' తదితర పండ్లు జాబాలి తోటలో ఉన్నాయని పేర్కొన్నాడు. (తెలుగు మెఱుగులు : వేటూరి ప్రభాకరశాస్త్రి) ముని ఆశ్రమంలో ఆ చెట్లు ఉన్నాయంటే వాటిని తిని, తాగేవారనేది రూఢ్యర్థం.
ఏ వృత్తి చేసుకునే వారికైనా ఆ వృత్తిలో ఉండే ప్రమాదాలను భరించాల్సి ఉంటుంది. దీన్నే ప్రొఫెషనల్ హజార్డ్‌గా చెప్పవచ్చు. ఇట్లా గౌడ్‌లకు సంబంధించిన ప్రమాదాలను రాఘవేంద్ర వివరించాడు.
'గెడం గట్లపై నడుస్తున్నప్పుడు/ గంజి బంధం లేపిన
కాళ్ళ పుండును పచ్చికపుల్లలు/ కొరుకుడు పెడుతుంటాయి
నడుము చుట్టూ ముత్తజు రాపిడి
వీపు పై మోకు రాకిన వాతలు
చెట్టుకున్న బరకులు/ తొడలపై రంపపు కోతలు' అంటూ గౌడ్‌ల వృత్తిలోని బాధలను లెక్కగట్టాడు. వృత్తిపని చేయని వారి చెప్పుచేతుల్లో కల్లుగీత సహకార సంఘాలు ఉండడంతో నిరసన వ్యక్తం జేశాడు.
''ఇప్పుడు నా వృత్తి/ఖద్దరు, ఖాకీ, కార్పొరేట్ దళారీ మనువుల
కొక్కేనికి వేలాడుతున్న/బానిస విధేయతకు విచారిస్తున్నా' అన్నాడు.
నిజానికి ఇటీవలి కాలం వరకు గౌడ్‌లు మాత్రమే వివిధ రకాల పన్నులను కట్టేవారు. చెట్టు ఎవరి భూమిలో ఉంటుందో అతనికి భూమి పన్ను, కల్లు గీసినందుకు ప్రభుత్వానికి ఆబ్కారీ పన్ను, వాటిని అమ్మినందుకు అడ్డా పన్ను ఇట్లా వివిధ పన్నులను చెల్లించిన గౌడన్న ఆఖరికి అర్ధాకలితో పడుకునే పరిస్థితి ఉండింది.
ఇందులోని కవితా పాదాలు గౌడ జీవితంలోని గోసను గీస కత్తి పదునుతో రికార్డు చేస్తాయి.
'అకస్మాత్తుగా చెట్టెక్కిన కాడ/ పురుగులు చీమలు
తేనెటీగలు/ పసర పాముల రూపంలో
పెను ప్రమాదం మోసుకొచ్చినప్పుడల్లా
చావు అంచుల శ్వాసను ముట్టేస్తాడు' అంటూ రోజూ ఆకాశంలో చావు అంచుల వరకూ వెళ్ళే వచ్చే నాన్నని చిత్రిక పట్టాడు. అట్లానే కల్లు మండువ అంటేనే సేదతేరే ఒడిగా తడిమి చెప్పాడు.
''మండువ అంటే/ లోలోతు మూలాల్ని తడిమి
తవ్విపోసుకునే పూల పడవ
అలసిన తనవులు సేదతీరే/ పరవశ క్షేత్రం''
గౌడ వృత్తి బహుజన బంధాలను పటిష్టపరిచిందని రాఘవేంద్ర రాశాడు. కుమ్మరి కుండలే లొట్టి, తొట్టిగా ఉపయోగ పడతాయని, మాదిగల తోలు తిత్తి కల్లు నిలువ, రవాణాకు, కమ్మరి కొలిమిలో కత్తులు సానబెట్టడం, నేతన్నలు బట్టలు ఇవ్వడం ఇట్లా వృత్తిపరమైన ఇచ్చిపుచ్చుకోవడాలను కైగట్లాడు.
తన కవిత్వంలో ఇప్పటి తరానికి చదువే దారి చూపిస్తుందని చెబుతూ వృత్తి కన్నా ఉపాధి ముఖ్యమని చెప్పాడు. ఈ ఉపాధి కులం నుంచి లభించే దాని కన్నా చదువుకుంటే లభించే అవకాశాల నుంచి ఎక్కువగా దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. అంతిమంగా చదువుకుంటే గౌడన్నలు బాగుపడుతారు అని ఇందులో చెప్పాడు. నిజానికి వర్తమాన సమాజంలో కుల వృత్తుల్ని ఇడిసి పెట్టినవారి బతుకులే బాగున్నాయి. వృత్తితో సంబంధం లేని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, హౌటళ్ల నిర్వహణ, రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ పనులు చేసే వారి జీవితాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. అందులో వివక్ష, దోపిడీ, దుర్మార్గం కుల వృత్తిలో ఉన్నతంగా లేదు కూడా. కులం వాసన లేని ఉద్యోగాల్లో గౌరవమున్నది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గౌరవం, గుర్తింపు కూడా. ఇట్లా కుల వృత్తులు మానుకున్న బహుజనులంతా కుల వివక్ష లేని ఉపాధి మార్గాలను వెతుక్కోవాలనీ, అందుకు చదువు ఒక్కటే మార్గమని రాఘవేంద్ర చెప్పాడు. ఇది బహుజన సాహిత్యానికి అవసరమైన. మేలైన చేర్పు.
- సంగిశెట్టి శ్రీనివాస్










