Mar 28,2023 20:59

నినాదాలు చేస్తున్న నాయకులు, కార్మికులు

నినాదాలు చేస్తున్న నాయకులు, కార్మికులు
ఉద్యోగుల...కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
-కార్పోరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నెల్లూరు:నగరపాలక సంస్థలో పనిచేయుచున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ( సిఐటియు ) డిమాండ్‌ చేసింది. మంగళవారం నగరపాలక సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులు , కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ( సిఐటియు ) ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్పోరేషన్‌ మేనేజర్‌ ఇనాయతుల్లాను యూనియన్‌ నాయకులు కలిసి సమస్యలను వివరించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
అనంతరం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ నగర పాలక సంస్థలో పనిచేయుచున్న కార్మికులు ఉద్యోగులు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమస్యల పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్‌ కార్మిక చట్ట ప్రకారం అమలు కావలసిన క్యాజువల్‌ లీవులు, పండుగ సెలవులు, మెటర్నటీ లీవులు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల జీతాలలనుంచి ప్రావిడెంట్‌ ఫండ్‌, ఈఎస్‌ఐ పేరుతో కోట్ల రూపాయల డబ్బులు పట్టుకోవడం జరుగుతుందని, బెనిఫిట్స్‌ మాత్రం ఒక్క రూపాయి కూడా కార్మికులకు దక్కడం లేదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విధుల్లో చనిపోయిన కార్మికుడికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాగా మృతుల కుటుంబాలకు అందజేశారని, వైసిపి ప్రభుత్వం వచ్చాక గడిచిన మూడు సంవత్సరాల కాలంలో 9 మంది విధులు నిర్వహిస్తూ చనిపోతే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. చనిపోయిన కార్మికుల స్థానాలలో వారి వారసులకు ఇవ్వాల్సిన ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన బట్టలు,చెప్పులు,సబ్బులు, నూనెలు, గ్లౌజులు ఒక్కసారి కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిరంకుశ ధోరణి అవలంభిస్తుందన్నారు. పనిముట్లు కార్మికుల కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. మున్సిపల్‌ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని విభాగాల కార్మికులకి హెల్త్‌ అలవెన్స్‌ వర్తింప చేయాలన్నారు. నగరపాలక సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులు కార్మికుల శ్రమ వల్లే కోట్ల రూపాయల పన్నులు కార్పొరేషన్‌ ఖజానాకు చేరుతున్నాయన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా చిన్నచూపు చూడడం సరైన చర్య కాదని అన్నారు. అనేకసార్లు కమీషనర్‌, మేయర్‌, కలెక్టర్‌,ఎంఎల్‌ఎలు, పాలకవర్గ సభ్యులకు సమస్యలు విన్నవించినా ఫలితం శూన్యమన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన ఉదతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం అశోక్‌, వజ్రమ్మ, సునీల్‌, మారుతి, దేశ మూర్తి, కామాక్షమ్మ, లోకేష్‌,చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.