రండి - ఈ దారిలోకి రండి
అల్లూరి నడయాడిన దారి
అల్లూరి ఆవేశం అల్లుకున్న దారి
మన్యం మండించే దారి
అడవిని ఆదుకునే దారి
ఇది అల్లూరి దారి
రామరాజు నెత్తురుతో తడిసిన దారి
రండి - ఈ దారిలోకి రండి.
ఇక్కడ
బ్రిటిష్ తూటాలు రాల్చిన
తురాయి పూల తివాసీలు పర్చున్నాయి
సామ్రాజ్యవాద సైన్యాలను
తిప్పికొట్టే యుద్ధ రహస్యాలు పూసున్నాయి
మన్యం పోరాట దివిటీల కాంతులు
వెలుగులై వ్యాపించున్నాయి
రామరాజు ఆశయాలు
అడవి ఆకులపై
చెట్లకొమ్మలపై రాసున్నాయి
రండి - ఇది పోరాటాల దారి
తెల్లదొరల్ని వణికించిన దారి
స్వతంత్య్రోద్యమాలు మండించిన దారి
పరపాలన ద్వేషించిన పితూరీ దారి
భారత జాతి హక్కులకై
ఉద్యమించిన మన్యం దారి
రండి - ఈ దారిలోకి రండి
ఈ అల్లూరి దారిలో రండి
ఇప్పుడీ దారిన అల్లూరి లేకున్నా
అల్లూరి నెత్తురుతో తడిసిన నేలుంది
అల్లూరి ఆశయాలు చల్లిన బాటుంది
అల్లూరి పోరాట చరితల మైలురాయుంది
అల్లూరి ఆశయ సిద్ధి
అసంపూర్ణంగానే ఉంది-
రాజులు మారినా, తెల్లోడ్ని తరిమినా
రాజ్యాధికారం చేజిక్కినా
రాజ్యాంగం రాసుకున్నా
ఇక్కడ తుపాకుల మోత ఆగలేదు
నల్ల చట్టాలు రాక ఆగలేదు
రైతులపై లాఠీల నృత్యం
ప్రశ్నించే గొంతులపై ఖాకీల పాదం
కార్మికుల బతుకుల్లో కల్లోల గీతం
మన్యం మసిబారుతోంది
అడవి వాడిపోతుంది
కొండలు కరిగి పోతున్నాయి
జన సంపద ఆవిరౌతోంది
జన న్యాయం శిథిలమౌతోంది
జన హక్కులు గాలిలో ఎగురుతున్నాయి
అల్లూరి ఆశయం తూట్లు పడుతోంది
అల్లూరిని కాల్చిన తుపాకీ
చేతులు మారింది
అల్లురిని కీర్తించిన కంఠాలు
స్వరాలు మార్చాయి
గాడ్సే వంశాంకురాలు
సావర్కర్ జాతి గెద్దలు
అల్లూరి ముసుగులో
ఆశయాలు వల్లిస్తున్నాయి-
ప్రజాస్వామ్య భుజాలపై
తుపాకీలు ఉంచబడ్డాయి
పౌరహక్కులుపై గురిపెట్ట బడ్డాయి
తుపాకీ ట్రిగ్గర్
సామ్రాజ్యవాద చేతుల్లో ఇరుక్కుంది
రండి - ఆ వేళ్ళని విదిలించాలి
గురిపెట్టిన తుపాకీలు నేల వాల్చాలి
పౌరహక్కులు పరిరక్షించాలి
మరో స్వాతంత్య్ర పోరాట జెండా ఎగిరించాలి
రండి - ఈ దారిలోకి రండి
అల్లూరి బాటలోకి రండి
స్వేచ్ఛ సమానతల కోసం
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం
మరో స్వాతంత్య్ర పోరాటం కోసం
అల్లూరిని తలచుకుంటూ....
అల్లూరి ఆశయాలు భుజాలకెత్తుకుంటూ...
రండి - ఈ దారిలోకి రండి
అల్లూరి బాటలోకి రండి!
- బొడ్డ కూర్మారావు










