Aug 29,2022 07:23

తనేదో ఆరాధ్య దేవతని
నిన్నేదో ఉద్ధరించేస్తుందని నమ్మావు
ఇన్నాళ్లూ గుడ్డిగా కొలిచావు
కళ్ళుంటే ఇప్పటికైనా చూడు
అది దాని వికృతరూపం బయల్పరుస్తోంది
గొర్రెని మింగిన కొండ చిలువలా పొర్లుతోంది
తన కడుపున దాచిన విషం
అలలు అలలుగా తెరలుతోంది చూడు
తన కంఠంలోని గరళం
తెరతెరలుగా ఉబికివస్తోంది చూడు
మువ్వన్నెల జెండా రెపరెపల సాక్షిగా
ఇంక ఎన్ని భానూదయాలు ఆరిపోతాయో
తను కక్కిన విషం స్పష్టంగానే కనబడ్డది
నీకే కళ్ళు లేవు చూడ్డానికి
తన ధృతరాష్ట్ర కౌగిలిలో
నిన్ను పక్కటెముకలతో సహా
పటపట నలిపెయ్యడానికే అది సిద్ధమైంది
కానీ నువ్వు కళ్ళులేని కబోదివి
అది మాయావి మోహిని
కాసిన్ని నడుమొంపులు ఎరవేసి
నీ కంచంతోనే నీ కడుపు కొడుతుంది
గుప్పెడు ఒయ్యారాలు ఒలకబోసి
నీ వేలితోనే నీ కన్ను పొడుస్తుంది
అది కసాయి
చెరువుగట్టుపై కాషాయ దుస్తుల్లో పెద్దపులి
నకిలీ బంగారు కడియం చూపించి నిన్ను పిలుస్తోంది
నువ్వు మళ్ళీ నమ్మి పోతున్నావు
ఈసారి అది నిన్ను స్వాహా చెయ్యడం ఖాయం
అది మారి మహమ్మారి
బోల్తా కొట్టించను నీ వద్ద ఆరుకాళ్ళ జంతువు లేదు
నీరంతా సారా ఔతుందనుకోవడం నీ అమాయకత్వం
గుడ్డిగా దాని వలలో పడిపోతున్నావు
ఈ మారు అది నిన్ను సఫా చెయ్యడం తథ్యం
అది మాత్రం ఏం చేస్తుంది?
దాని నరనరాల్లో తరతరాల జాతివైరం దాగుంది
నివురుగప్పిన నిప్పులాగ
దానికి హరప్పా నాటి అజెండా అలాగే ఉంది
మహెంజదారో మృతుల దిబ్బలపై
ఒకనాడు అది చేసిన కరాళ నృత్యం
మళ్ళీ దాని నవనాడుల్లో నాల్కలు కోస్తూ
పురులు తిరుగుతూ కలియబెడుతోంది!
- కవితశ్రీ
94946 96990