మరీ అలా
కనుగుడ్లు చిట్లించుకుని చూడొద్దు
రహస్య స్వప్నాన్ని అతికించుకున్న
నీ కనురెప్పల భాష
నాకేం కొత్త కాదు
కాళ్ళు మొలిచిన బట్టముక్కలు
నీ ముందుకొచ్చి జెండాలై నిలబడతాయి
మరీ ఇంత ఉక్కపోత ఏంటని
దేశం గొంతుతో నిలదీస్తాయి
ఇలా ప్రతి దాన్నీ
చీకటి గదిలో పెట్టి తాళం వేయాలనుకోవద్దు
వ్యక్తిగత ఇష్టాల ముఖద్వారం వద్ద
కత్తెరలు పట్టుకొని నిలబడొద్దు
చీకటిగది
మంత్రసానవుతుంది
దేశం పులుల్ని ప్రసవిస్తుంది
మణికట్టుకో మెడకో
కోట్ల నమ్మకాలు వేలాడుతున్నప్పుడు
నా తలచుట్టూ
గుప్పెడు స్వేచ్ఛను చుట్టుకుంటే తప్పేంటి?
మరీ ఇలా
నా సొంత లోతుల్లోకి చొచ్చుకొని రావొద్దు
తలను తీసి సంచిలో వేసుకుని
మొండేనికి యూనిఫామ్ తొడుక్కొని రమ్మనొద్దు
అయినా
మనం ఒక్కటిగా ఉండాల్సింది
మనుషులుగా!
కేవలం గుడ్డముక్కల్లో కాదు కదా!
- సాంబమూర్తి లండ
96427 32008










