ప్రజాశక్తి కదిరి అర్బన్ : ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి టిడిపిలోకి వెళ్లడానికే ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నాడని, వైసిపి ప్రభుత్వానికి ఫోన్లు ట్యాపింగ్ చేసే అవసరం లేదని రాష్ట్ర కార్మికశాఖామంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కదిరి పట్టణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయగిరిజమ్మ, కలెక్టర్ బసంత్‌కుమార్, ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్, ఎఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగిపోయిన నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభిస్తోందన్నారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ప్రస్తావన తీసుకురాగా ఫోన్ ట్యాపింగ్ చేయడం వైసిపికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదన్నారు. పార్టీ మారడం కోసం ఆయనే ట్యాపింగ్ డ్రామా ఆడుతూ సొంత పార్టీపై బురద జల్లుతున్నాడని విమర్శించారు. లోకేష్ యువగళం పాదయాత్ర రోజు రోజుకు ప్రజా ప్రజాదరణ కోల్పోతుందని, పాదయాత్ర కొనసాగించలేక మధ్యలోనే ఆగిపోతుందని జోష్యం చెప్పారు.










