Aug 30,2022 15:07

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ గాంధీ సెంటర్ లో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సి రమణారెడ్డి  చేతులమీదుగా 2,300 మట్టి వినాయకుల ప్రతిమలను మంగళవారం పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా జడ్జి రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని అన్నారు. నీరు,గాలి వాతావరణం కాలుష్యం అవ్వకుండా కాపాడగలమని, దీనిని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా భావించి భావితరాలను రక్షించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ సమితి నుంచి హృదయ పూర్వకంగా అభినందిస్తున్నామని ఆయన అన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ తుర్లపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమలను చేస్తున్న పర్యావరణ సమితి శ్రీధర్ రామిరెడ్డి ని అభినందించారు. అనంతరం శ్రీధర్ రామిరెడ్డి మాట్లాడుతూ వినాయకచవితి పండుగ మట్టిగణపతితోనే ప్రారంభమైనదని దానిని గ్రహించి మట్టి బొమ్మల విశిష్టతను తెలుసుకొని మట్టి వినాయకుల తోనే వినాయకుని పండగ జరుపుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ గోపు సుబ్రహ్మణ్యం, అడ్వకేట్ అంబడిపూడి పూర్ణేష్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.