ఇప్పుడు శవాలు శ్మశానాల్లో కాదు
రోడ్ల మీదనే సంచరిస్తున్నాయి
రైల్వేస్టేషన్లలోనూ నిర్లజ్జగా పచార్లు చేస్తున్నాయి
కళాశాలలు.. బస్టాండ్లు
పక్కిండ్లు.. ఎదురిండ్లు
వీటి పునరావాస కేంద్రాలు
ఇవి ప్రాణమున్న శవాలు
కామంతో కళ్లు మూసుకొని
వొళ్లు మరిచి విరుచుకుపడే శవాలు
తాము పుట్టిన స్థానాన్ని
తమ ఆకలి తీర్చుకున్న వైనాన్ని విస్మరించి
మాంసపు ముద్దల కోసం ఎగబాకే శవాలు
ఈ శవాలు
పువ్వుల కొలనులో కత్తులు నాటుతున్నాయి
రెండు మనసుల రహస్య ప్రణయ క్రీడను
రచ్చకీడ్చి.. రాద్ధాంతం చేస్తున్నాయి
ఇకనైనా
శవాలను సమాజంలో తిరగనీయకండి
ఆడపిల్లల దేహాలు భయంతో
ముడుచుకుంటున్నాయి
నాలుగ్గోడల మధ్య నుంచి
భద్రత లేని వ్యవస్థ వైపు
ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి
అంతా అయ్యాక
పరుగులు తీయడం కాదు
కాకుండా వుండేందుకు లొసుగుల్ని పూడ్చాలి
ఆడబిడ్డలు ఆకాశానికి ఎగరాలంటే
ఈ శవాలను వెతికి.. ఏరి
శ్మశానానికి యీడ్చి పారెయ్యాలి
(మహిళలపై జరుగుతున్నఅకృత్యాలకు నిరసనగా...)
- సునీత గంగవరపు
94940 84576










