ప్రపంచీకరణ వలలో, ప్రచారాల హోరులో కొట్టుకుపోతున్న మనిషి .. తనదైన సొంత చరిత్ర, సంసృతీ, సామాజిక, సామరస్య పూర్వక జీవనం గురించి తెలుసుకోవాలి. ఈ దేశంలోని భిన్నత్వం, ఆ భిన్నత్వంలోని ఏకత్వం తెలియాలంటే- మనల్ని మనం అధ్యయనం చేయాలి. మన మూలాల్లో ఉన్న మంచిచెడ్డలను నిష్పక్షపాతంగా సమీక్ష చేసుకోవాలి. పెద్దాపురం పట్టణానికి సంబంధించి ఇలాంటి చారిత్రిక, సామాజిక ఇతివృత్తాలను సేకరించి ఓ పుస్తకంగా వెలువరించాడు ఓ యువకుడు. పెద్దాపురం కత్తుల వంతెనలను, యుద్ధ తంత్రాలను, సాహిత్య పరంపరలను, ఆత్మ బలిదానాలను, నమ్మక ద్రోహాలను, త్యాగాల వారసత్వాన్ని, మత సామరస్య ప్రతీకలను గుద్దిగుచ్చి ఒక్కచోట సాహితీ స్రవంతి ప్రచురణలో చారిత్రక పెద్దాపురం కథలు - గాథలు పుస్తకంగా మన ముందు ఉంచాడు. ఆ పరిశోధక రచయిత వంగలపూడి శివకృష్ణ. తనకు వచ్చిన జీతంలో సగం డబ్బులు విషయ సేకరణకు ఏళ్ల తరబడి ఖర్చు చేసేవాడంటే- చరిత్ర సేకరణ పట్ల అతనికున్న శ్రద్ధ, ఊరు పట్ల అతనికున్న ప్రేమ మనకు కనపడతాయి. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది అని శ్రీశ్రీ అన్నట్టు... ఏలేరు పరివాహకంలో పెద్దాపురం జీవనమెట్టిదో వెతికి చూసాడు, అందరికీ చూపించాడు.
దాదాపు 62 గ్రంథాల పరిశీలన, వివిధ వార, మాస పత్రికల అన్వేషణ, అనేకానేక ఆంగ్ల పత్రికలలో వెతుకులాట, ఎంతో మంది పెద్దాపురం చరిత్ర తెలిసిన పెద్దల నుంచి సేకరణ వెరసి 310 పేజీలు నలుపు తెలుపు, 24 రంగుల పేజీలతో 334 పేజీల గ్రంథాన్ని మన ముందు ఉంచాడు. సహజంగా ఏ ఊరి వారికైనా తమ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసు కోవాలని ఆసక్తి ఉంటుంది. పెద్దాపురానికి సంబంధించి పథాపురం దగ్గర మొదలై, పార్థాపురం, కిరాత రాజ్యం కిమ్మూరు, బౌద్ధ గిరి తమిరె, ఏలేరు పేర పొర్లునాడు, పద్మనాయకుల పద్మాపురం, పెద్దాపాత్రుడి పెద్దాపురం ... ఇలా ఎన్ని రకాల పేర్లు మారాయి. వాటి వెనక ఉన్న కథలేంటో పుస్తకంలో సవివరంగా వివరించారు రచయిత.
పెద్దాపురం సంస్థానం 585 పైచిలుకు గ్రామాలు, పట్టణాలు కలిపి ఉండేది. 1803 నాటికి రూ.10 లక్షల ఆదాయం, రూ.6 లక్షల వరకూ కప్పం రూపంలోనే వచ్చేది. అంటే రాజ్యం ఎంత విస్తారంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రాజ్యం పరిపాలన, దాని విస్తరణ ఎలా ఉండేదో ఆ రాజ్యం కోట ఎలా ఉండేది అన్నదాన్ని బట్టే చెప్పేవారు. పెద్దాపురం సంస్థానం కోట 18 బురుజులతో 3 మెట్టలను తనలో కలుపుకుంటూ, చుట్టూ కందకాలతో శత్రు దుర్భేద్యంగా ఉండేదని అనేక మంది కవుల రచనల నుంచి వివరించారు రచయిత. కోట నిర్మాణం, ఆ తరువాత విస్తరణ, బ్రిటిషువారి స్వాధీనంలో వేలం వెయ్యడం, కలప తరలించుకుపోగా శిథిలమై మొండి గోడలుగా మిగిలిన కోట వరకూ ప్రతి సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు రచయిత.
ఏ పాలకులు ముందు, ఏ పాలకులు తరువాత, ఎవరెవరు గొప్ప అనే విషయాలపై చారిత్రక పరిశోధకుల్లో భిన్న వాదనలు ఉన్నా, రచయిత సేకరించిన దానిని బట్టి పెద్దాపురాన్ని పెద్దాపాత్రుడు 1450 నుంచి 1475 వరకూ పరిపాలించాడని, ఆ తరువాత ఆయన వంశస్థులు 1555 వరకూ పరిపాలన చేశారని ఈ గ్రంధంలో వివరించారు. 1555 నుంచి 1847 వరకూ వత్సవాయి వారి పరిపాలన సాగిందని నాటి ఆస్థాన కవి ఏనుగు లక్ష్మణ కవి రచనల ద్వారా తెలియజేసారు.
మొదటి స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే పెద్దాపురం సంస్థానాన్ని బ్రిటిషు వారు ఆక్రమించుకున్నారు. పెద్దాపురంలో మహారాణి బుచ్చి సీతయ్యమ్మ గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. అశోకుడు చెట్లు నాటించెను, బాటసారులకు సత్రములు కట్టించెను అని పాఠాలు చదువుకున్నాం. నాటి చెట్లు, సత్రాలు ఎన్ని మిగిలాయె తెలియదు గాని, పెద్దాపురంలో బుచ్చి సీతయ్యమ్మ రాజేసిన సత్రం పొయ్యి నేటికీ వెలుగుతూ అన్నార్తుల ఆకలి తీర్చుతూనే ఉంది. ఇలాంటి స్ఫూర్తి వంతమైన అంశాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.
తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, మరో రాజ్యాన్ని ఆక్రమించడానికి, మిత్ర రాజులకు తోడుగా అనేక యుద్ధాలు జరిగాయి. పల్నాటి యుద్ధం, చేబ్రోలు యుద్ధం, బొబ్బిలి యుద్ధం, ఉండూరు యుద్ధాలలో పెద్దాపురం సంస్థానం రాజులు, సైనికులు పాల్గొన్నారు. వారి యుద్ధ ప్రావీణ్యం, పెద్దాపురం పందెం పుంజుల యుద్ధ కథలు చదువుతుంటే మనమే నేరుగా పాల్గొన్న అనుభూతికి లోనవుతాము.
పెద్దాపురం ముట్టడిలో తమకి తాముగా అంత్ణపుర స్త్రీలతో కలసి మహారాణులు చేసుకున్న ఆత్మబలిదానం గురించి, ఆ ముట్టడి ఉదంతం గురించి చదువుతుంటే ఆనాటి కాలం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. పెద్దాపురం పేరంటాళ్ళు కావమ్మ, దాసరి పల్లమ్మల బలిదానాలు కంటతడి పెట్టిస్తాయి.
ఏ చారిత్రక అంశమైనా నాటి చరిత్రకారుల రచనలు, నాటి జానపదుల సాహిత్యం ద్వారా తెలుస్తుంది. పెద్దాపురం చరిత్ర గురించి అనేకమంది ఆస్థాన కవులు రచనలు చేశారు. ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళి తెలుగు సాహిత్యానికి సుపరిచితమే. ఆయనే రచించిన రామవిలాసం గురించి ఈ పుస్తకంలో రచయిత పలుచోట్ల ఉదహరించారు. దివానులు కర్కశంగా ప్రజలపై పన్నులు వేస్తున్నప్పుడు దానిపైన చేసిన తిరుగుబాటుగా నర్లజర్ల గంగరాజ కవి పెట్టిన తిట్ల ఏకరువు తీరు తప్పనిసరిగా చదవాల్సిందే! ఇప్పటివరకూ తిట్ల దండకం ఒకటి ఉండేదట అని చాలా పుస్తకాల్లో రాసారు గానీ అది ఎక్కడా ముద్రణ కాలేదు. ఈ రచయిత ఆ కుటుంబ వివరాలు సేకరించి, వారిని స్వయంగా కలిసి మాట్లాడి, ఆ దండకాన్ని వెతికించి సేకరించి మరీ తీసుకున్నారు. దానిని విస్సన్న దండకం పేరుతో ఈ పుస్తకంలో అందించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వడ్లగింజలు, గులాబి అత్తరు కథ్లో, కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రలో పెద్దాపురానికి సంబంధించి చేసిన ప్రస్తావనలను ఈ గ్రంధంలో ఏర్చి కూర్చారు. పనిలో దిగితే వెనకా ముందు చూడవేంట్రా అంటారు పెద్దలు. అలాగే పనిలో పడి రాజుగారి నెత్తిమీదనే పిడితో కొడితే ఏం జరుగుద్ది మీరే ఊహించుకోండి. పెద్దాపురం క్షురకుడి నిర్వాకం గురించి ఈ పుస్తకంలో చదివి తెలుసుకోవాలి. ఏదైనా మేలు చేస్తే, సాహసం ప్రదర్శిస్తే రాజ్యాల్లో కొంత భాగం రాసిచ్చేవారని చందమామ కథల్లో చదువుతాము. పెద్దాపురం చుట్టుపక్కల ఏర్పాటైన అగ్రహారాల వెనక ఇలాంటి ఉదంతాలే ఉన్నాయని రచయిత వివరించారు. మహిళలనే దేవతలుగా కొలిచిన కాలంలో ఏర్పాటైన గ్రామ దేవతల విశేషాలు ఇందులో కనపడతాయి. పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మ, కోట సత్తెమ్మ, పరదేశమ్మ, బంగారమ్మ, గొంతేలమ్మ అమ్మవార్ల చరిత్ర వివరంగా అందించారు.
పెద్దాపురం సంస్థానంలో సైన్యాధ్యక్షునిగా పనిచేసిన తొమ్మిది మూరల సాయిబు ప్రాణత్యాగం, ఆయన మరణానంతరం రాజులు ఇచ్చిన స్థానం చదివితే... పోరాట పటిమకు, త్యాగనిరతికి అందే నీరాజనం గురించి అర్థమవుతుంది. ఇప్పటికీ అక్కడ మత సామరస్యం వెల్లివిరిసేలా జరిగే ఉరుసు గంధోత్సవం మన కళ్ళ ఎదుట కదలాడుతుంది. నాటి స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు, అల్లూరి సీతారామరాజు పోరాట ప్రాంతానికి ముఖద్వారం, రెవెన్యూ డివిజన్ కేంద్రం, కోర్టు వంటి గురించి వివరంగా రాశారు. ఇంగ్లాండ్ పత్రికల్లో వచ్చిన వార్తలతో సహా చారిత్రక ఆధారాలను మన ముందు ఉంచారు. మహాత్మా గాంధీ పెద్దాపురం రాక, ఆనాడు జరిగిన సభ, ఆయన బస చేసిన విశేషాలు వివరించారు. అప్పట్లో రూ.1406లు పెద్దాపురంలో, రూ.381లు సామర్లకోటలో ప్రజలు గాంధీకి విరాళంగా అందించడం ఈ ప్రాంత ప్రజల్లో స్వాంతంత్రోద్యమం పట్ల ఉన్న ఆకాంక్షకు నిదర్శనం.
పెద్దాపురం పట్టు, ఇక్కడి చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతైన విధానం, చేనేత కేంద్రాలు అందుకున్న అవార్డులు, కార్మిక కుటుంబాలకు అండగా కార్మిక సంఘాల కృషి, స్వాతంత్య్రానికి ముందే వేతనాల పెంపు కోసం పెద్దాపురం కేంద్రంగా చేసిన పోరాటం ... ఈ పుస్తకంలో దర్శనమిస్తాయి. చిన్న చిన్న ముంతల్లో గ్రామాల నుంచి పెరుగుతెచ్చి అమ్మకుంటుంటే దానిపైన మున్సిపల్ అధికారులు విధించిన పన్నుకు వ్యతిరేకంగా సాగిన సమ్మె పెద్దాపురం చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ఇలాంటి వాటిని చాలా ఆసక్తికరంగా అక్షరబద్ధం చేసారు రచయిత. పెద్దాపురం చుట్టుపక్కల ఉన్న ఊరి పేర్ల మార్పులు, వాటి వెనుక కారణాలు ఆధారాలతో సహా వివరించారు.
మానవ జీవన విధానం, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, భాష ఇవన్నీ కలిపితేనే చరిత్ర. ఒక ఊరి చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఆ ఊరి పునాదులు తెలుసుకోవడానికి, మూలాలు వెతుక్కోవడానికి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోడానికి ఉపయోగపడతాయి. ఈ ఊరి చరిత్రను చదవండి. మీ ఊరి చరిత్రను వెలికి తీయండి. పెద్దాపురం చరిత్ర గాధలు కోసం రచయితను 95532 81222ను సంప్రదించవొచ్చు.
- అరుణక్రాంతి










