''మంచి సాహిత్య విమర్శ లేనిదే మంచి సాహిత్యం రాదు'' అని కొడవటిగంటి కుటుంబరావు గారన్నట్లు .. విమర్శ ఉంటేనే సాహిత్య సృజన ప్రకాశిస్తుంది. మారుతున్న కాలంతో సాహిత్యం నూతన బాటలు పరుచుకుంటుంది. దాంతో పాటే విమర్శ కూడా సాగాలి. ఇటీవల బాధ్యతాయుతమైన సాహిత్య విమర్శ చేస్తున్న వారిలో పిల్లా తిరుపతిరావు ఒకరు. కథకునిగా, గేయకర్తగా, సమీక్షకునిగా, విమర్శకునిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర అధ్యయన శీలి. ఆయన సాహిత్య వ్యాసాలతో తాజాగా 'ఆజిరి' అనే పుస్తకం వెలువడింది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, జి.లక్ష్మీ నరసయ్య, గార రంగనాథం దీనికి ముందుమాటలు రాశారు. నిశితమైన పరిశీలన, నిష్పక్షపాతంగా అభిప్రాయాలను వెల్లడించడం ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. 'ఆజిరి'లో మొత్తం 30 వ్యాసాలున్నాయి. 'ఆజిరి' అంటే కుప్ప, రాశి అనే అర్థం ఉంది. ఈ వ్యాస సంపుటిలో కూడా కవిత్వం మీద, కథల మీద, నవల మీద, గేయ సాహిత్యం మీద, పద్య సాహిత్యం మీద వ్యాసాలు నడిచాయి. ఈ వ్యాస సంపుటి ఉత్తరాంధ్ర సాహిత్యాన్ని గురించి, ఆ ప్రాంత రచయితల ఆలోచనా దక్పథాన్ని గురించి తెలుసుకోవడానికి కరదీపిక వలె ఉపయోగపడుతుంది.
ఈ సంపుటిలో సుమారు 25 వ్యాసాలు ఉత్తరాంధ్ర సాహిత్యం మీదనే సాగాయి. ఉత్తరాంధ్ర సాహిత్యం మీద రచయితకు ఉన్న అవగాహన, ఆసక్తి ఇన్ని వ్యాసాలు రాయడానికి కారణం. ఈ వ్యాస సంపుటిలో తొలితరం ఉత్తరాంధ్ర రచయితలైన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి, రావిశాస్త్రి మొదలైన వారి నుంచి నేటి వర్తమాన రచయితలైన అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, లండ సాంబమూర్తి, సిరికి స్వామినాయుడు వరకు కనిపిస్తారు.
ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో గేయం సాధనంగా ఉపయోగపడుతుందని 'చైతన్య గీతిక గేయకవిత' అనే వ్యాసంలో తిరుపతిరావు సవివరంగా పేర్కొనడంతో పాటు ఉదాహరణ పూర్వకంగా నిరూపించారు. అన్నమయ్య, క్షేత్రయ్య, వీరబ్రహ్మం లాంటి ఉద్ధండుల కీర్తనలు సమాజోద్ధరణకు ఏ రీతిగా దోహదపడ్డాయో తెలియజేసారు. స్వాతంత్రోద్యమ కాలంలో పాట సాధించిన ఘన కీర్తికి ఆనవాలుగా గరిమెళ్ళ సత్యనారాయణ, సుద్దాల హనుమంతు గార్ల పాటలను పేర్కొన్నారు. నేటి సమాజంలో గద్దర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, గంటేడ గౌరునాయుడు మొదలైన వారి పాటలు ప్రజానీకాన్ని ఏ విధంగా జాగృతపరిచాయో ఈ వ్యాసంలో తెలియజేసారు. 'భారతదేశం నా మాతృభూమి' అనే ప్రతిజ్ఞ విశిష్టతని 'ప్రబోధ గీతిక పైడిమర్రి ప్రతిజ్ఞ' అనే వ్యాసంలో తెలియజెప్పారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి తెలియజేయడంతో పాటు జాతీయ ప్రతిజ్ఞ మూలాలను ఈ వ్యాసంలో చూపించారు. స్వాతంత్రోద్యమంలో అనేకమందిని చైతన్యవంతం చేసిన గేయం గరిమెళ్ళ రాసిన 'మా కొద్దీ తెల్లదొరతనం'. ఈ గేయానికి శత జయంతి సందర్భంగా 'గరిమెళ్ళ గేయానికి నూరేళ్ళు' అనే వ్యాసం రాసి పాట వైశిష్ట్యాన్ని, ఔచిత్యాన్ని కొనియాడారు.
చాగంటి సోమయాజులు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, రావిశాస్త్రి, గిడుగు రామ్మూర్తి, జాషువా వంటి ఉద్ధండుల సాహిత్యం మీద వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి. ఈ వ్యాసాలన్నీ వినూత్నమైన ఆలోచనలతో సాగిన పరంపరలా కనిపిస్తాయి. తిరుపతిరావు గారి సూక్ష్మ పరిశీలనకు ఉదాహరణగా 'ఊరి పేర్లతో జాతీయాలు, సామెతలు..' వ్యాసం నిలుస్తుంది. ఈ వ్యాసంలో జాతీయాలు, సామెతలతో కూడికొని ఉన్న గ్రామాల పేర్లను తెలియజేసారు. జాతీయాలు, సామెతల వల్ల తెలుగు భాషకు కలిగే ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని వివరించారు. 'వెల్చేరు నారాయణరావు ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను రెండింటిని ఒడిసిపట్టుకుని, విభిన్నరీతిలో అనువదించి ప్రపంచ సాహితీ యవనికపై రమణీయంగా నిలబెట్టారు' అని 'వైవిధ్య విమర్శకులు వెల్చేరు' వ్యాసంలో వెల్చేరు నారాయణరావు గారి జ్ఞాన పటిమను చాటిచెప్పారు.
దాసరి రామచంద్రరావు రాసిన 'అల్పపీడనం' కథా సంపుటి మీద తిరుపతిరావు మాష్టారు చేసిన విశ్లేషణ చాలా చక్కగా ఉంది. 'ఉత్తరాంధ్ర సామాజిక జీవనమే కనబడుతోంది. ఉత్తరాంధ్ర పల్లెలు, పట్టణాల్లో నివసిస్తున్న సామాన్య ప్రజల జీవన స్థితిగతులు అద్దంలోని ప్రతిబింబంలా మనముందు తిరుగాడతాయి' అని జనజీవన పోరాటాల అల్పపీడనం అనే వ్యాసంలో తెలియజెప్పారు. ప్రముఖ కథకులు, గేయకర్త గంటేడ గౌరునాయుడు రాసిన రైతు ఉద్యమ సంఘీభావం కవిత్వం మీద తిరుపతిరావు వివరణాత్మకమైన వ్యాసాన్ని రాశారు. గౌరునాయుడు మాష్టారు రాసిన 'పాడుదమా స్వేచ్ఛాగీతం' పాటను మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యాంశంగా పెట్టిన సందర్భంగా ఆ పాట విశిష్టతని వివరించే వ్యాసం రాశారు. విభిన్న శైలిలో సామాజిక కవిత్వాన్ని సృష్టిస్తున్న లండ సాంబమూర్తి రాసిన గాజు రెక్కల తూనీగ కవిత్వ విశేషాలను 'కవన వీధిలో ఊరేగిన గాజు రెక్కల తూనీగ' వ్యాసంలో వివరించారు. 'కథల కర్షకుడు సింగమనేని' వ్యాసంలో సింగమనేని నారాయణరావు గారిలో ఉన్న పలు పార్శ్వాలను చూపించడంతో పాటుగా తెలుగు కథా సాహిత్యంలో ఆయన కథల స్థానాన్ని తెలియజేసారు. పల్లిపట్టు నాగరాజు రాసిన 'యాలై పూడ్సింది' కవితా సంపుటి మీద సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశారు. 'తడియారని బతుకుల చిత్రం మట్టి రంగు బొమ్మలు' వ్యాసంలో కవి సిరికి స్వామినాయుడు కవిత్వాన్ని విశ్లేషించారు. అట్టాడ అప్పల్నాయుడు 'బహుళ' నవల మీద రాసిన వ్యాసం 'ఉత్తరాంధ్ర బడుగు జీవుల బతుకు కథ'. ఇందులో వందేళ్ళ ఉత్తరాంధ్ర జనజీవన విధానాన్ని నవలలో ఎలా వివరించారో, పాత్రలు ఏ రీతిగా చిత్రీకరించబడ్డాయో వివరణాత్మకంగా రాశారు.
మొత్తం మీద 'ఆజిరి' వ్యాస సంపుటి ఉత్తరాంధ్ర సాహిత్యాన్ని, ఉద్యమ జీవితాన్ని తెలియజేయడంతో పాటుగా తెలుగు సాహిత్యం పట్ల ఈ రచయితకు ఉన్న నిబద్ధతను, ఆసక్తిని తెలుపుతుంది. విమర్శకునిగా తిరుపతిరావు మాష్టారు ఎప్పటికప్పుడు సాహిత్యంలో వస్తున్న నూతన పోకడలను గమనిస్తూ తనను తాను అప్డేట్ చేసుకుంటున్న అధ్యయన శీలి. ఆయన ఇంకెన్నో విలువైన సాహిత్య వ్యాసాల్ని అందించాలని ఆశిద్దాం.
- సారిపల్లి నాగరాజు
80083 70326










