Jun 06,2022 06:34

పరిశోధన, జనం జీవితం, ఆచారాలు, సంప్రదాయాలు, స్థలం, కాలం, భాష, కళ - వాటిని రికార్డు చెయ్యాలనే ఎనలేని అభిమానం - ఇవి మనకు రాసాని వి.ఆర్‌. రచనల్లో సాధారణంగా కనబడేవి. ఆ విధంగా ఆయన తన అసంఖ్యాకమైన రచనలతో జన్మభూమి రుణం తీర్చుకున్నారు. విమర్శకులు అన్నట్టు.. రాసాని జీవితాన్ని మిషగా చేసుకుని మిగిలిన వాటిని వర్ణిస్తాడు అంటే అది అంత న్యాయం కాబోదు. ఎందుకంటే అవన్నీ కూడా జీవితం చుట్టూ పెనవేసుకున్నవి, జీవితం నుంచి విడదీయరానివి కాబట్టి. ఆయన ఇటీవలి రచన వక్రగీత. వక్రం, గీత - రెండూ శుద్ధ సంస్క ృత పదాలు. సిద్ధ సమాసం. దానికి వక్రీకరించబడ్డ పాట, వ్యంగ్య ప్రధానమైన రచన అని అర్థాలు. ఒకవేళ గీతకు జీవితం అనే అర్థాన్ని ఆపాదించుకుంటే వక్రీకరణకు గురైన జీవితం, చెరపబడ్డ జీవితం అని అర్థాలు వస్తాయి. ఐతే రచయిత గీతని తెలుగు పదంగా వాడాడు. అంటే శీర్షికని వక్రరేఖ, వంకరగీత అనే అర్థంలో అంటే... సొట్టగీత, చేతులారా చెరుచుకున్న జీవితం అనే అర్థాల్లో వాడాడు. ఇది రచయితకు ఈ నవల్లోని వస్తువు పట్లా, దానికి ఆలంబనమైన తిమ్మక్క జీవితం పట్లా ఉన్న దృష్టి, దృక్పథం అని ఈ నవలలోని ముందుమాట చదివితే అర్థమవుతుంది. కానీ లోపల దానికి పూర్తి భిన్నంగా కథనం జరిగింది. కథ పొడవునా రచయితకు తిమ్మక్క పట్ల ఎనలేని సానుభూతి, ఆత్మీయత కనబడుతుంది.
రాసాని లాంటి రచయితల రచనల్ని చదివి, 'ఏందిబా ఇట్లా రాసేసినావు. కళ కళకోసమే కదా. ఈ రాజకీయాలెందుకు?' అని అడిగే మగానుభావులు మస్తుగా కనబడతారు. అలా అనేవాళ్ళకి కళాత్మక దృష్టి లేదు. అసలు వాళ్ళకు కళ అంటే ఏమిటో కూడా తెలీదు. వాళ్ళు మానసికంగా ఫ్యూడలిస్టులు అని వేరే చెప్పక్కర్లేదు. కళ కళకోసం ఎంత మాత్రమూ కాదు. కళ జీవితం కోసం. కళ జీవితాన్ని అధ్యయనం చేసి వ్యాఖ్యానించడం కోసం. కళ జీవితాన్ని అర్థం చేసుకుని సుఖవంతంగా తీర్చిదిద్దుకోడం కోసం. కళ జీవిత సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారాల్ని కనుక్కొని బయటపడ్డం కోసం. కళ జీవితార్థం ఏమిటో తెలుసుకుని ఆ అర్థసాధన కోసం ఇతరుల జీవితాలకు ఇబ్బంది కలక్కుండా జీవించండం ఎలాగో నేర్పడం కోసం. కళ దోపిడీని గుర్తించడం కోసం. గుర్తించి దాని నుండి చాకచక్యంగా బయటపడ్డం కోసం. వీలుకానప్పుడు ఆ దోపిడీని ఎదిరించండం ఎలాగో నేర్పడం కోసం. ఆ బాధ్యతల నుంచి కళ తప్పించుకోలేదు. అలా తప్పించుకున్న నాడు అది కళ కాబోదు.
జీవితాన్ని మనం అధ్యయనం చేశామా? అర్థం చేసుకున్నామా? జీవితం పట్ల స్పష్టత సాధించామా? అసలు మనం జీవితాన్ని ప్రేమించామా? మనం జీవితాన్ని ప్రేమించి ఉంటే పై పనులన్నీ చేసుండేవాళ్ళం. కనీసం చెయ్యడానికి సుముఖంగా ఉండేవాళ్ళం. ఒకవేళ మనం ఈ పనులు చేస్తున్నా సైద్ధాంతికంగా చెయ్యడం లేదు. దానికి కారణం మనకు ఆ జీవిత సారాంశం అర్థం కాలేదు. అందుకే జీవితం మనకు అర్థం కాలేదు. అందుకే మనం ఫ్యూడలిస్టు భావజాలం నుంచి, కర్మసిద్ధాంత ప్రభావం నుంచి బయటపడలేదు. అందుకే మనం ఇప్పటికీ 'తిమ్మక్కని విధివంచిత' అని అంటున్నాం. నిజమే జీవితం విస్తారమైనదే. అర్థం చేసుకోలేనంత విస్తృతి కలిగినదే. ఐనప్పటికీ దాన్ని అర్థం చేసుకోడానికి మన ప్రయత్నాలు మానకూడదు. ఇంతకీ చెప్పవచ్చేది ఏమిటంటే తిమ్మక్క, తిమ్మక్క లాంటి ఎంతోమంది అక్కలు ఎంతమాత్రం విధివంచితలు కాదు. వాళ్ళు సమాజ సంస్క ృతి వంచితలు. సోకాల్డు నాగరికతల వంచితలు. అందునా మధ్య తరగతి అందులోనా దిగువ మధ్యతరగతి సంస్క ృతి వంచితలు. మనుషుల చేత, మానవ మగమృగరాజుల చేత వంచితలు. ఆ వంచిస్తున్న మనుషులు ఎవరో కాదు. వాళ్ళు మనలో ఒకళ్ళు. ఒక స్త్రీ జీవితంలో ఇలా జరిగినప్పుడు దాన్ని వక్రీకరించడం, వెలివేతకు గురిచెయ్యడం ఇటు ఉన్నత కుటుంబాల్లో లేదు. అటు అట్టడుగు వర్గాల్లో కూడా లేదు. ఈ రుగ్మత ఒక్క మధ్య తరగతిలో మాత్రమే ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే తిమ్మక్కలా జీవితాలు బుగ్గిపాలు కావడం ఉండదు.
ఆ మధ్య సీమలో ప్రేమకథలు, ప్రేమ నవలలు రాలేదని కొంచెం చర్చ జరిగింది. సంపన్న ప్రాంతాల్లో ప్రేమ అందమైన కాలేజీల్లో పురుడు పోసుకుని, పార్కుల్లో బీచుల్లో సినిమాహాల్లో రాసుకుపూసుకు తిరిగి, వెన్నెలలో చంద్రశాలల్లో విహరించి వేడెక్కి, కాస్ట్లీ బెడ్రూముల్లో సెగలు కక్కి చల్లబడుతుంది. మరి ఆ ప్రేమ సీమ లాంటి కరువు గడ్డల్లో ఎలా ఉంటుంది? శ్రమించే దేహంలా ఉంటుంది. స్వేదించే కణతల్లా ఉంటుంది. చెమర్చే కనురెప్పల్లా ఉంటుంది. అచ్చం మనిషిలా, మనిషి బతుకులా ఉంటుంది. అది కొందరికి మొరటుగా అనిపించవచ్చు. వట్టి శారీరకమైన యావగా అనిపించవచ్చు. ప్రేమ మొరటుదైనా నాజూకుదైనా దాని చివరి పరిణామం దైహికదాహం తీర్చుకోవడమే. సీమ బతుకుల్లో నాయికలు అభిజాత్య సంజాతలు కాకపోయిరి. ఇక సీమ రచయితలు కాలక్షేప ప్రేమకథలు ఎలా రాయగలరు? వాళ్ళు తిమ్మక్కల్ని, బతుకుల్లోని వంకరగీతల్నే రాయగలరు.
వెంకటస్వామి తిమ్మక్కల సంగమం యాదృచ్చికం కాదు. వెంకటస్వామికి అదివరకే తిమ్మక్క భావజాలం తెలిసింది. తిమ్మక్క ట్రైబల్‌ ఐనా, అక్షర సంస్కారం లేని మొరటు మనిషి ఐనా ఆమెలో స్వచ్ఛమైన భౌతికవాద తాత్వికత ఉంది. వెంకటస్వామి దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. అలాగే తిమ్మక్కకు వెంకటస్వామి మీద సదభిప్రాయం ఉంది. వాళ్ళు బహుశా అదివరకే ఒకరికొకరు ఇష్టపడి ఉండొచ్చు. వెంకటస్వామి ఆడంగివాడు కదా? మరి తిమ్మక్క అతన్ని ఎలా ఇష్టపడుతుంది? అని మనకు కంప్లైంట్‌ ఉండొచ్చు. ఏ చెట్టూ లేనిచోట ఆముదంచెట్టే మహావృక్షం. ఒకవేళ వాళ్ళు అదివరకే ఇష్టపడి ఉండకపోయుంటే అడవిలో కట్టెపుల్లలకు జనాలు జంటలు జంటలుగా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరే ఒక జంటగా ఎందుకు విడిపోయారు? ఇది మనం ఆలోచించాలి. జీవితం యాదృచ్ఛికం, ఆకస్మికం, గాలివాటంగా ప్రవాహవేగానికి కొట్టుకపోతుంది అనే ఒక తత్వం ఉంది. ఇలాంటి ఫిలాసఫీతో అల్బర్ట్‌ కామూ 'ది స్ట్రేంజర్‌' లాంటి రచనలు వచ్చాయి. కానీ హేతువాదం ముందూ, మార్కి ్సస్ట్‌ ఫిలాసఫీ ముందూ అది నిలబడలేదు. ఎందుకంటే జీవితానికి కార్యకారణ సంబంధం ఉంది. తిమ్మక్క వెంకటస్వామిని పెళ్లి కాకనే కలిసినా, ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నా, బిడ్డతో సహా అతన్ని వదిలి సుంకనితో పోయి కాపురం పెట్టినా, అతన్ని కూడా వదిలిపోయి కదిరప్ప చాటున చేరినా, అక్కులప్పకు శరీరం అప్పగించినా, చివరకు శంకరయ్యతో సహజీవనం చేసినా అవి క్షణికావేశాలు కావు. వాటికి స్పష్టమైన పునాదులున్నాయి. వాటి వెనుక మనం చూడని అనివార్యమైన తతంగాలు ఉన్నాయి. సామాజిక, ఆర్థికాంశాలు ఉన్నాయి. జీవితానికి ఇష్టమైన, విశ్వసనీయమైన, భరోసా ఇవ్వగలిగిన ఒకతోడు ఉండాలనే మానసికమైన సహజాతాలు ఉన్నాయి.
రాసాని హేతువాది, భౌతికవాది, మార్క్సిస్టు. వీళ్లకు ఉండే గుణం లింగభేదాలు లేకుండా మనిషిని మనిషిగా చూడడం. ఇన్నాళ్ళూ దోపిడీకి పీడనకు గురైన బడుగుజీవుల పట్లా, స్త్రీల పట్లా వీళ్లకు ఒకింత పక్షపాతం సహజంగా ఉంటుంది. తిమ్మక్క జీవితం వంకరగీత ఎలా అవుతుంది? గర్హనీయం ఎలా అవుతుంది? కాదు? అది రాసానికి బాగా తెలుసు. అందుకే ఆమె పట్ల అతనికి అభిమానం. అందుకే చివర్లో తన అభిప్రాయాన్ని కండక్టర్‌ మునస్వామి మాటల్లో చెప్పాడు. తిమ్మక్కని పూర్తిగా సమర్థించాడు. ఒకవేళ అలాంటి సానుభూతి తనకు లేకుంటే అసలు ఈ రచన చేసేవాడు కాదు. మరి అలాంటి శీర్షిక ఎందుకు పెట్టాడు? అలాంటి ముందుమాట ఎందుకు రాశాడు? అంటే కేవలం జనరంజన కోసం మాత్రమే అలా చేశాడు. మనం కూడా మన రక్తంలో ఇంకిపోయిన ఫ్యూడలిస్టు భావజాలం నుండి పూర్తిగా బయటపడలేదు. అందుకే తిమ్మక్క విధివంచిత అని రచయిత అంటాడు. సాహిత్యం చదువుకున్న మునస్వామి కూడా అదే మాట అంటాడు.
తిమ్మక్క కథ సాహిత్యానికి కొత్తది కావచ్చు. మనకేమి కొత్తది కాదు. కానీ పట్టణ ప్రాంత బ్రాహ్మణీయ సమాజం నుంచి బయటపడి మధ్య తరగతి జీవితాల్లోకి, అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రయాణం చేసిన సాహిత్యాన్ని అట్టడుగు బహుజనుల జీవితాల్లోకి, ఆటవికతెగల జీవితాల్లోకి రాసాని లాంటి వాళ్ళు తీసుకుపోయారు. అక్కడ ఉంది ఈ నవల ప్రత్యేకత. పరిశోధకుడు వ్యాసం రాస్తాడు. కథకుడు కథనం చేస్తాడు. రాసానిలో ఆ ఇద్దరూ ఉన్నారు. అందుకే ఆయన పరిశోధనని కథనం చేస్తాడు. అంటే... కథగా, నవలగా మారుస్తాడు. అది ఒక కళ. సరిగ్గా చెప్పాలంటే ఆయన అలెక్స్‌ హేలీ లాంటి అన్వేషి. ఆయన స్థలకాలాలను సంస్క ృతిని నమోదు చేస్తాడు. జాండ్రపేట, పులిచెర్ల పరిసరాలు, మంగళంపేట అడవులు, బట్టలు నేయడం, సంగటి ముద్ద చెయ్యడం, కుండలు చెయ్యడం, దొంతులు, అప్పుటి డబ్బులు, చిలకశాస్త్రం, దాని కార్డులు, తాళపత్రాలు, సోదె ఇలాంటి వాటి సూక్ష్మ వర్ణన వక్రగీతలో మనం చూడొచ్చు.
రాసాని పుస్తకావిష్కరణ సందర్భంలో 'పల్లెకు పోయినప్పుడు తిమ్మక్క చేతిలో వందో రెండు వందలో పెట్టి వస్తాను. అంతకంటే మనం ఏం చేయలేం' అన్నాడు. అది వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్ని సూచిస్తుంది. వ్యవస్థ తనకు బాధ్యత ఉన్నచోట ఫెయిల్యూర్‌ అవుతోంది. ఆ ఫెయిల్యూర్లో కొంత బాధ్యత మనకు కూడా ఉంది. బహుశా నార్వే లాంటి సంపన్న దేశాల్లో, కమ్యూనిస్టు దేశాల్లో ఇలాంటి బాధ్యతారాహిత్యం ఉంటుందని అనుకోడానికి వీళ్ళేదు. రాసాని ముద్ర, పరస, వక్రగీత లాంటి రచనలతో ఇన్నాళ్ళూ సామాజికంగా, సాహిత్యపరంగా నిరాదరణకు గురైన అట్టడుగు బహుజనులు, బహుజన స్త్రీల జీవితాలను చర్చకు పెట్టారు. దీనిపై చర్చించాల్సింది చాలా ఉంది. తిమ్మక్క ఇంకా అలాంటి వాళ్ళని మనం ఎందుకు చెడిపోయిన వాళ్ళుగా చూస్తున్నాం? ఎందుకంటే మనం మన బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోవడానికి, ఒక పలాయనం చిత్తగించడానికి వాళ్లని చెడిపోయినవాళ్ళుగా, పతితులుగా ముద్ర వేస్తున్నాం. అందువల్ల తిమ్మక్క విధివంచిత కాదు. ఆమె సమాజ వంచిత. సమాజం యొక్క సంస్క ృతి వంచిత అని గుర్తించి మనల్ని మనం దిద్దుకోవాల్సింది చిరకాలంగా బాకీ ఉంది.

- కవితశ్రీ
94946 96990