Jul 04,2022 06:46

నది ఎన్నడూ వెనక్కి నడవదు
తలలెత్తే కెరటాలది నిరంతరం ముందు చూపే
ఇవాళ భుజాలు తడుముకుంటున్న సర్పజాతి మనుషులు
వెన్నెముక లేని ధ్వజస్తంభాలే
వీస్తున్న గాలివైపే వొరుగుతాయి
గాలి మాటలే వదరుతాయి
పాటకు మకుటం పల్లవే అని తెలిసినా
మకుటానికి రాగభంగం ఆపాదిస్తాయి
అంటరాని మాటల జాతరలో
గులకరాళ్ల డబ్బాలు గలగల్లాడిస్తూ
కర్ణపేయమైన పల్లవిని జలదరింపుల వాన చేస్తాయి
చెట్టును చెట్టు అన్నందుకు
పుట్టను పుట్ట అన్నందుకు
హత్యను హత్య అన్నందుకు
వాగ్హింసకు పూనుకొంటున్న దేశభక్తులంతా
ఏటికి ఎదురీదే నీటి బుడగలే
గోరక్షణ కోసం మనషుల్ని తినే నరభక్షకులే
మతాలని తూచేరాళ్లు జేబుల్లో పెట్టుకొని
రాష్ట్రాల సరిహద్దుల్లో నిప్పుగీతలు గీసుకొంటూ
కత్తులు అమ్ముకొనే బేహారులు
కశ్మీరైనా, కన్యాకుమారి అయినా
కలివిడిగా వుండే కావడి కుండల్లో
బురద తొక్కిన కాళ్లని కడుక్కొనే అనిజాయితీపరులు
రాళ్లని తవ్వుకుంటూ దేవుళ్లని వెలికితీసే చారిత్రకులు
తలలేని మస్తిష్కాల్లా పల్లవి లేని పాటలే వీళ్లంతా!
(సినీ నటి సాయిపల్లవి కి చప్పట్లతో...)
- ఈతకోట సుబ్బారావు
94405 29785