పుట్టుకతోనే పైత్యం నూరిపోయడానికి
రంగం సిద్ధమైనట్టుంది
విద్యావనాల్లోనూ విషబుద్ధుల సాగు
మొదలయ్యింది!
ఒక చిరునవ్వు కోపమై చెలరేగిన దృశ్యం
ఒకానొక ఆత్మగౌరవ బద్దెమీద
అల్లాహూ అక్బర్ అని నినదించిన గొంతూ
దిక్కులన్నీ పరుచుకున్నాక
మీ అరుపుల వెనకున్న పరమ రహస్యం
బద్దలైపోయింది!
ఒకే ఒక రంగు ఏకఛత్రాధిపత్యమై ఎగురుతున్నాక
మూడు రంగుల్ని కలిపి పేనిన కాలమంతా
కుళ్ళికుళ్ళి ఏడవడం ఎవరికీ కనిపించడం లేదు
కుంటుకుంటూ నడుస్తున్న కొద్దిపాటి లౌకికం
వర్తమానం దిబ్బ మీద పూడ్చబడింది
రేపటికి ఏ వెర్రితనమై మొలకెత్తుతుందో..!!
అదిగో ...
అప్పుడే పసిహృదయాలు
మసిపూసుకు తిరుగుతున్నాయి చూడు
అందరం ఒక్కటని అనుకున్నాక
నువ్వొక్కడివే ఎక్కువెలా అవుతావ్
అన్ని వేళ్ళతో బిగిసిన పిడికిట్లోంచి
వేరుపడి ఎవర్ని వెక్కిరిస్తావ్?
ఆ మాటపై నియంత్రణ
ఆ తిండిపై నియంత్రణ ఆ నడకపై నియంత్రణ
ఆ ఒంటినీ ఒంటిమీద వస్త్రాన్నీ నియంత్రిస్తుంటే...
తొక్కిపెట్టబడ్డ తెగింపొకటి ఆకాశాన్ని చీల్చకమానదు
ఎక్కుపెట్టబడ్డ నినాదం ఏళ్ళనాటి మౌఢ్యాన్నీ
పొడుం పొడుంగా కూల్చకా మానదు
ఈ నేల పేడపురుగుల సొత్తు కాదు
సీతాకోకచిలకల హక్కు కూడా ..!
- బంగార్రాజు
85003 50464










