కవి అనేవాడు ఏ దృక్పథాల్ని కలిగుండాలి? ఎలాంటి భావజాలాల్ని కలిగుండాలి? అతడు ఎవరి పక్షాన నిలబడాలి? అన్న విషయంలో స్పష్టమైన ఎరుక ఉండి కవిత్వం రాస్తున్నవాళ్ళలో మువ్వా శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. పూర్వం 'నాటకాంతం హి సాహిత్యం' అని అన్నారు. అంటే సాహిత్యంలో నాటకం శిఖరస్థాయి ప్రక్రియ అని, సాహిత్యకారులు ఇతర ప్రక్రియల్లో పండిపోయాక మాత్రమే నాటకం జోలికి వెళ్లాలని అభిప్రాయం. వాక్యానికి సంబంధించి ఐతే విశ్వనాథుడు 'వాక్యం రసాత్మకం కావ్యం' అని అన్నాడు. ఇప్పుడు మువ్వా శ్రీనివాసరావు 'వాక్యాంతం' అని అర్ధోక్తిలో వదిలివేసి ఆ పేరుతో ఒక వచన కావ్యం తెచ్చారు. వాక్యాంతం ఏమిటి? అన్నది ఆలోచించుకునే పని పాఠకుడికే వదిలివేశారు. వాక్యాంతం కదిలించేదిగా, ఆలోచనలు రేకెత్తించేదిగా, ప్రశ్నలు పుట్టించేదిగా, సమాధానాలు అందించేదిగా, సమస్యల్ని గుర్తించి విశ్లేషించేదిగా, ఆ సమస్యలకు పరిష్కారాలు సూచించేదిగా మొత్తం మీద అది జీవితాన్ని వ్యాఖ్యానించి దాని సారాన్ని సారాంశాన్ని విడమర్చి చెప్పేదిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. పాఠకుడు దీన్ని పట్టుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
మువ్వా శ్రీనివాసరావు తమ 'వాక్యాంతం'లో అనేకమైన జీవిత సందర్భాల్ని ప్రస్తావించి వాటికి చక్కని అభివ్యక్తితో వచన పద్యాల రూపం ఇచ్చారు. అందులో ఉన్న పద్యాల్లో దేనికదే మేలిముత్యం. వాటిలో 79వ పేజీలో 'వాక్యం ఉంది జాగ్రత్త' అని ఒక పద్యం ఉంది. దాని గురించి మాత్రమే నేను ఈ వ్యాసం రాస్తున్నాను. వాక్యాంతం ఏమిటి? అన్నదాన్ని గురించి హైరానా పడిపోకుండా ఉండడానికి కాబోలు ఆయన ఈ పద్యం రాసి తద్వారా సమాధానం చెప్పారు. ఈ పద్యం గురించి ఆలోచించాల్సింది, విశ్లేషించుకోవాల్సింది, ఒక నిర్ణయానికి రావాల్సింది, తాము ఏ పక్షమో తేల్చుకోవాల్సింది చాలా ఉంది. కవులకు, రచయితలకు అది చాలా చాలా అవసరం కూడా. ఎందుకంటే... ఫ్యూడలిస్టు భావజాలంలో పుట్టి, అందులోనే పెరిగి, దాన్నే చదువుకుని, దాన్నే వంటబట్టించుకుని, దేవుళ్ళు (?) అవతార పురుషులు (?) రాజులు రాణులు ధనికవర్గ రంగప్పలవే అనుభవాలు, వాళ్ళ జీవితాలే జనజీవితాలు అన్న భ్రమల్లో కూరుకుపోయి నేటికీ అదే మూసలో రచనలు చేస్తున్న కవులు రచయితలు మెజారిటీలో (గుణం లేనప్పటికీ, గణనలోకి రానప్పటికీ) కొనసాగుతున్న పరిస్థితుల్లో వాళ్ళని హెచ్చరించే బాధ్యతని తాను తీసుకుని మువ్వా వారు ఈ పద్యం రాశారు. ఒక వ్యాసంలో చెయ్యాల్సిన హితబోధని ఈ పద్యంలో చేశారు. ఒక వ్యాసంలోనో, ఒక కథనంలోనో చెప్పగలిగిన విషయాన్ని పద్యంలో చెప్పడం వల్లా, అంత ప్రభావంతంగా చెప్పడం వల్లా ఈ పద్యం చర్చనీయం అయ్యింది.
కవి ఐనా రచయిత ఐనా ముందుగా అతడు మనిషి. అతనికి పుట్టుకతో ఒక వర్గం ఉంటుంది. ఒక వర్గ దృక్పథం అనుకోకుండా అబ్బుతుంది. అతడు పుట్టి పెరిగిన పరిసరాలతో ప్రభావితుడై ఎంతో అనుభవం గడించి, ఎన్నో విద్యలు నేర్చి, ఎన్నో రచనలు చేసి సమాజానికి అందిస్తాడు. అతని రాతల్లో అణువణువునా అతన్ని, అతని వర్గ దృక్పథాన్ని మనం పట్టుకోవచ్చు. ఐతే అసాధారణుడైన కవి తనకు పుట్టుకతో వచ్చిన వర్గం ఏదో చూసుకోడు. దాని లాభనష్టాలు బేరీజు వేసుకోడు. సమాజంలోని పీడన, అణచివేత, దోపిడీలకు ఎదురొడ్డి నిలబడతాడు. వాటిని చేస్తున్న బలవంతులను కాదంటాడు. వాటికి గురవుతున్న బాధితుల పక్షాన నిలబడతాడు. నువ్వు బలవంతుడై లేదా వాళ్ళ పక్షాన నిలబడి ఎంత చిక్కని రాతలు రాసినా కథానాయకుడు కావు. కాలేవు. నువ్వు బలవంతుడైనా, బడుగువైనా పీడితులు, అణచివేయబడ్డవాళ్ళు, దోపిడీకి గురైనవాళ్ళ పక్షాన నిలబడ్డప్పుడే కథానాయకుడు కాగలవు. బాధితుల పక్షాన నిలబడ్డం నీ కర్తవ్యం. నువ్వు ఆ న్యాయం తప్పి కొందరిని తిష్టజీవులుగా కొందరిని కష్టజీవులుగా అట్టిపెట్టే వ్యవస్థకి గండిపడకుండా కొనసాగించడానికి పథకం ప్రకారం రచనలు చేస్తుంటే... వాక్యాలు రాస్తుంటే... 'వాక్యం వానపాము కాదు/ వాక్యం పడగెత్తిన పౌరుషం/ అది నీ మీదే బుసకొడుతుంది' అంటారు మువ్వా. అంటే నీ వాక్యమే నిన్ను పట్టిస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. నువ్వు వాక్యాన్ని రాసి వదిలివెయ్యడం లేదు. దానికి భాష్యాలను నువ్వే చెప్తూ దాన్ని పట్టుకు వెళ్ళాడుతున్నావు. నువ్వు ఎలాంటి వాడివో నోరెత్తి చెప్పజూస్తున్నావు. అవసరం లేదు. నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు ఏ జాతి పక్షివో, నువ్వు రాసిన నీ వాక్యమే చెబుతుంది. నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలని నీకుంటే, అందుకు తగ్గట్లు నీలో నిజాయితీ ఉంటే నువ్వు వాక్యాన్ని రాసి వదిలెరు. ఓపికతో ఎదురుచూడు. నీ వాక్యమే నీ గురించి మాట్లాడం మెదలుపెడుతుంది అంటారు మువ్వా శ్రీనివాసరావు.
నువ్వు తెలివైనవాడివే. మేధావివే. అందువల్ల నీ నక్క జిత్తులతనంతో నువ్వు నీదైన వర్గప్రయోజనాలను కాపాడుకోడానికి చూస్తావు. దానికోసం భాషని భాషా చమత్కారాలని, ఆలంకారిక శైలినీ ఉపయోగించుకుంటావు. నీ కుటిలత్వం బయటపడకుండా పాఠకుడిని బోల్తా కొట్టించానని తబ్బిబ్బైపోతావు. నిజమే అప్పటికి నువ్వు విజయం సాధించొచ్చు. నీ పలుకుబడితో నీ రాతలకి నువ్వే భాష్యాలు చెప్పుకోవచ్చు. నీ అసలురంగు బయటకు పొక్కకుండా నువ్వు అందగాడివనీ, నీది అందమైన మనసని చాటుకోవచ్చు. పాఠకుడు నీ పలుకుబడికో నీ రాతల్లోని చిక్కదనానికో పడిపోయి నిన్ను మన్ననతో స్వీకరించవచ్చు. కానీ 'నీ నిష్క్రమణ తర్వాత/ ఆ వాక్యాలే కుంచెలై నీ బమ్మ గీస్తాయి/ పాఠకుల హృదయాల ముందు పెడతారు' అని కనువిప్పు కలిగిస్తునారు మువ్వా. అప్పటికి కాకపోయినా ఎప్పటికైనా నీ వాక్యాల్లో నువ్వు బయటపడతావు. ఎవడో ఒకడు పుడతాడు. నీ వాక్యాల తోలు ఒలిచి నీ అసలుగుట్టు బట్టబయలు చేస్తాడు. నీ నిజస్వరూపం బమ్మకట్టిస్తాడు. తస్మాత్ జాగ్రత్త. మించిపోయింది లేదు. ఇప్పటికైనా నీ జిత్తులమారితనం మాని ప్రజాపక్షం వహించు అని చెప్పకనే చెబుతున్నారు మువ్వా. నీ వాక్యం నీ బమ్మ గీస్తుంది అన్న మాటని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే... నువ్వు నీదైన, నీ వర్గానిదైన ప్రయోజనం కోసం అనుకూలమైన విలువల్ని స్థాపించడానికి కంకణం కట్టుకుని రాతలు రాస్తావు. నీ సమయం దగ్గరపడగానే నువ్వెళ్ళిపోతావు. కానీ నువ్వు రాసిన నీ వాక్యం నీతో రాదు. అది కలకాలం ఈ భూమిపై నిలబడుతుంది. అది ఎప్పటికైనా నీ బమ్మ గీస్తుంది. నీ స్వభావాన్ని పాఠకుడికి పట్టిస్తుంది. నీ వాక్యం ప్రగతిశీలమైనది ఐతే, నీ వాక్యం ప్రజలపక్షం వహిస్తే ఒక పోతన లాగా, ఒక ధూర్జటి లాగా, ఒక అన్నమయ్య లాగా, ఒక వీరబ్రహ్మం లాగా, ఒక జాషువా లాగా జనం మధ్య నిలబడతావు. అలా కాని నాడు అనేకుల లాగే నువ్వూ అనాదరణకు గురై అనామకుడిగా మిగిలిపోతావు.
నువ్వు ఫ్యూడలిస్టువు అయినప్పుడు, దాని ఆనవాళ్ళు ఇంకా నీలో చావనప్పుడు ఒకపక్క నిన్ను నీవు ప్రగతిశీలిగా చెప్పుకుంటూనే మరోపక్క ఫ్యూడలిస్టు భావజాలాన్ని సమాజంలో పెంచిపోషించడానికి నీ శాయశక్తులా ప్రయత్నిస్తుంటావు. నువ్వు బయటపడకుండా అలా చెయ్యడానికి ఎన్నో గారడీలు చేస్తుంటావు. దానికోసం మార్మికత్వం లాంటి జిమ్మిక్కుల్ని ఆశ్రయిస్తుంటావు. ఐతే 'జర జాగ్రత్త/ వాక్యాలను రాయడమంటే/ గుండె గుడ్డలిప్పి/ నడి బజారులో/ నిలబడటమే/ ఎంత మార్మికత అద్దినా/ కాలానికి/ మన వాక్యాలను ఒలిచే/ గోళ్ళుంటారు' అని నువ్వు రాస్తున్నప్పుడు ఆ సోయి కలిగి ఉండి రాయమని ఆయన చైతన్యపరుస్తున్నాడు. నీ వాక్యాలు నిన్ను అడ్డంగా పట్టిస్తాయి. నువ్వు తొడుక్కున్న ముసుగులని విసిరికొట్టి, నీ గుండె గుడ్డలు విప్పేసి నీ బండారం బయటపెడతాయి అన్నదాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. నువ్వు నీ రాతల్ని నీ చేతిలో ఉన్నంతవరకే నియంత్రించగలవు. అందువల్ల నీ రాతల్లో కోతలు ఏమైనా ఉంటే అవి నీవద్ద ఉన్నప్పుడే చూసుకో. నీ చేతిలో నుండి జారి లోకం మీద పడ్డాక అరరే అని నాలుక్కరుచుకోవద్దు. 'వాక్యం రారు/ తర్వాత వదిలెరు' నీ రంగునీ, నీ రుచినీ, నీ అభిరుచినీ నీ వాక్యాలు బయటపెడతాయి. నీ బమ్మని అవి గీస్తాయి. అంతేగాని వాటిచేత నీ బమ్మని నీకు ఇష్టమైనట్లు గీయించాలని వృథా ప్రయత్నాలు చెయ్యక చూస్తుండమని ఆయన అంటారు. ఈ మాటలు మువ్వా శ్రీనివాసరావు జీవితాన్ని, సమాజాన్ని, మానవ ప్రకృతుల్ని ఎంత అధ్యయనం చేశారో తెలియజేస్తాయి. ఆయనలో ఎంత పరిపక్వత ఉందో చూపిస్తాయి.
నువ్వు ఉబుసుపోక కోసం రాస్తున్నావా? జీవితాన్ని విశ్లేషించడానికి రాస్తున్నావా? సమాజాన్ని చైతన్యపరచడానికి రాస్తున్నావా? అన్నవి తెలుసుకొని, నీ భుజాలు నువ్వు ఒక్కసారి తడుమి చూసుకుని రాయాలి. నువ్వు ఉద్దేశించింది, ఉద్దేశించి రాసింది ఒకటి. కానీ తద్వారా రావాలని ఆశించినది వేరొకటి? ఎలా కుదురుతుంది? నువ్వు పెదపాపర విత్తులు విత్తి, తియ్య మామిడిపళ్ళు పండమంటే ఎలా పండుతాయి? అందువల్ల నువ్వు నీళ్ళు పోసి, పాలుపోసిన పేరు రావాలని ఆశించడం ప్రతి నాయకత్వం అవుతుందే గాని నాయక లక్షణం కాదు. నీ వర్గప్రయోజనం మాత్రమే ఆశించి, చాదస్తం అంతా రాసి మహాకవి అనిపించుకోవడం ఇప్పటికే నీదైన భావజాలం వ్యవస్థీకృతమై ఉండడం వల్లా, నీ భజనపరుల మూలానా ఇన్నాళ్ళూ కుదిరింది. కానీ నీది, నీ భజనపరులదైన కుట్రని బద్దలు కొట్టే శక్తి కాలానికి ఉంది. నీ వాక్యానికే ఉంది. అందువల్ల కలం పట్టుకున్న నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. నిజంగానే నువ్వు ప్రగతిశీలిగా ఉండాలి. హృదయపూర్వకంగానే నువ్వు ప్రజలపక్షం వహించాలి. చక్కని చిక్కని కవిత్వాన్ని ఎంతమందైనా రాయొచ్చు. జీవితాన్ని, జీవిత సందర్భాల్ని అక్షరాల్లో చిత్రాలుగా చిత్రించే ప్రతిభ, నేర్పరితనం ఎంతమందికైనా ఉండొచ్చు. కానీ ఆ ప్రతిభని, ఆ నేర్పరితనాన్ని ఎవరిని ఉద్ధరించడానికి ఉపయోగించాలో, ఎవరి హక్కుల్ని కాపాడడానికి ఖర్చు చెయ్యాలో, ఏ అశాస్త్రీయ భావజాలాల్ని రూపుమాపడానికి వ్యయించాలో, ఏ శాస్త్రీయ ప్రగతిశీల భావజాలాన్ని పెపొందించడానికి ముడిసరుగ్గా వాడుకోవాలో తెలిసి ముందుకు పోవడం అనేది చాలా ప్రధానమైనది. అది తెలియక పాటుపడుతున్నవాళ్ళు లోకం నిండా ఉన్నారు. న్యాయమంతా చెప్పి తుదకు బలవంతుడి భజనచేసేవాళ్ళు, తత్వమంతా చెప్పి చివరికి దేవునిపైన భారం మోపేవాళ్ళు ఐన కవులు, రచయితలు భూగోళం నిండా ఇబ్బడిముబ్బడిగా ఉన్నారు. వాళ్ళు విచక్షణా జ్ఞానం లేనివాళ్ళ ముందు గొప్పవాళ్ళుగా చలామణి అయిపోవచ్చు. చప్పట్లు కొట్టించుకోవచ్చు. కానీ పండితుల చేత, విమర్శకుల చేత, ఉద్యమకారుల చేత సెహభాష్ అనిపించుకోవడం అనేది కావాలి. అప్పుడే అది నిజమైన ప్రశంస అవుతుంది. కాబట్టి కవులు రచయితలు ఆ సోయి కలిగుండి రాతకోతలు చెయ్యాల్సిందిగా పిలుపునిస్తున్న మువ్వా శ్రీనివాసరావు ఉన్నతశ్రేణి కవి. సమకాలీన కవులకు నాయకత్వం వహిస్తున్న కొద్దిమంది కవుల్లో ఆయనకు తప్పకుండా స్థానం ఉంది. కవులు తాము ఎందుకు కలం పట్టామో, ఏమి రాస్తున్నామోనన్న ఒక స్పష్టమైన ఎరుక కలిగి ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందరికీ అట్టే పట్టుబడే గుణమూ కాదు. అది ఉన్న కవుల్లో శ్రీనివాసరావు గారి రూపంలో మరొక్క కవి మనకు ఉన్నారు. అది సంతోషాన్ని కలిగించే అంశం. వాక్యాంతం కావ్యం ఆసాంతం కూడా శ్రీనివాసరావు గారిది సారం సారాంశం ఉన్న కవిత్వం.
- కవితశ్రీ
94946 96990










