Apr 01,2023 19:59

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయం
నెల్లూరు:అన్ని ప్రభుత్వశాఖల్లోకెల్లా రెవెన్యూ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని, జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని కలెక్టర్‌ కె వి ఎన్‌ చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. శనివారం నగరంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఆవరణలోని పాత జూబ్లీ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, తన తండ్రి రెవెన్యూ శాఖలో తహసీల్దారుగా విధులు నిర్వర్తించి రిటైర్‌ అయ్యారని, చిన్నప్పటి నుంచి రెవెన్యూ శాఖతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తాను కూడా రెవెన్యూ శాఖలో వివిధ హౌదాల్లో పనిచేసి కలెక్టరు స్థాయికి ఎదిగానని, రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో ఎక్కడా లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించగలుగుతున్నానని పేర్కొన్నారు.
రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులు తమ అనుభవాలను ప్రస్తుతం పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులతో పంచుకుని, విధి నిర్వహణలో వారికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రజలకు దగ్గరగా ఉండి మెరుగైన సేవలు అందించిన రెవెన్యూ ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం మంచి ఆరోగ్యంతో ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. రిటైర్డ్‌ ఉద్యోగులందరూ కలసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషమని, ఉద్యోగులకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. చివరగా కలెక్టర్‌ ను రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ రెవెన్యూ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు పెంచలరెడ్డి, అధ్యక్షులు ముత్యం నరసింహులు, కార్యదర్శి జి వేణుగోపాల్‌, కోశాధికారి సుధాకర్‌, రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.