వ్యవసాయ సంక్షోభంతో చితికిపోతున్న రైతుకు మద్దతుగా అనంతపురంలో కవులు కవనసేద్యంతో గళాలిప్పారు. మే 28, 29, 30 తేదీల్లో అనంతపురంలో తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర మహాసభల నేపథ్యంలో- సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మే 21వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైతు కవనం జరిగింది. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షురాలు ప్రగతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితలు వినిపించారు. ప్రారంభ సభలో ముఖ్య అతిథి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కు.వీరభద్రప్ప కవిత్వ సృజనతో సరిపెట్టుకోక, పాలకుల ప్రజాకంటక విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనాలని కవులు, రచయితలకు పిలుపునిచ్చారు. సాధారణ జనానికి అర్థంకాని కవిత్వం రాయడం వ్యర్థమని అన్నారు. కీలకోపన్యాసం చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ... ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో రైతు జీవితాన్ని చిత్రీకరించిన కవులను, వారి కావ్యాలను సవివరంగా ప్రస్తావించారు. రైతు కవనాన్ని మహిళా రైతు అలివేలమ్మ ప్రారంభించారు. సాహిత్య ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో వచ్చిన, వస్తున్న మార్పులను కవులూ రచయితలూ నిశితంగా అధ్యయనం చేయాలని అన్నారు.
అనంతరం సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ సమన్వయంతో సాగిన రైతుకవనంలో వివిధ జిల్లాల నుంచి హాజరైన కవులు తమ కవితలు వినిపించారు. రైతుల గొప్పనో, కన్నీటి వ్యథలనో ప్రతిబింబించే కవితలతో ఆగిపోకుండా, పాలకులను తూర్పారబడుతూ రాసిన కవితలు; ఉద్యమాల ద్వారానే రైతును నిలబెట్టగలమని చైతన్యం నింపిన కవితలు కూడా వినిపించారు. రాయలసీమ రైతు ప్రకృతి చేతిలోనూ, పాలకుల చేతిలోనూ, దళారుల చేతిలోనూ మోసపోతున్న వైనాన్ని కవితల్లో హృద్యంగా పలికించారు.
'నీవు హిమగిరియై ద్రవిస్తుంటే / పంట భాగీరథియై ప్రవహిస్తుంది;
నీవు హలాన్ని శ్రుతి చేస్తుంటే/ బీడు నేల సామగానం వినిపిస్తుందం'టూ రైతు శ్రమను కీర్తించారు డా. సక్కిరి భాస్కర్. జిరసం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సురేష్ తన్మయత్వంతో ఊరిని, తన వాళ్ళను గుర్తుచేసుకున్నారిలా :
''కాడెద్దులు హలం పట్టి / చేను కావ్యం రాశాయి /
చేనుతలనిండా శనగపూల జాజర!/
వూడలకలలు నేలంతా దిగి / నాలోనంతా విస్తరించాయి/
బుడ్డలు బిడ్డలుగా ఎదుగుతుంటే / నాలోనూ చేను పున్నమి పంట!''
''రైతు మీద కవిత ఏమని రాయాలి... ఎంతని రాయాలి? రైతు ఒక మహాభారతం'' అంటూ అనంతపురానికి చెందిన కె.వెంకట రంగయ్య మట్టిమనిషిని గట్టి మనిషిగా చేయాలన్నారు. ''నీ ఉడుకు రక్తాన్ని ధారగా చేసి సేద్యకాలువలకు స్వేదపు నీటిచుక్కలుగా మార్చిన సేద్యగాడ''ని రైతును కీర్తించారు నెల్లూరు జిల్లాకు చెందిన సయ్యద్ హయ్యూల్ హయ్యూం. ''తొంగున్న సూరీడు కళ్ళు తెరవకనే / కళ్ళు నులుముకొని పొలానికి / పయనం సాగించే రైతు / పస్తులున్నా పనివీడని కష్టజీవి'' అంటూ కీర్తించారు పోకూరి చంద్రశేఖర్. ''పట్టిన కాగితము పొలమై / అందున్న గీతాలు దున్నిన సాలలవ్వ / కలము నుండి జారిన నీలిసిరా నీరవ్వగ / కలము మొన నుండి జారిన అక్షరములు / గింజలైనవి కాగిత భువిన నిలిచి'' కవిని రైతుతో పోల్చుతూ కవిత చదివారు లక్ష్మణస్వామి.
''చుక్క దాహం కోసం / వేల మైళ్ళ పిడచగట్టిన నడక మాది/ మట్టిని నమ్ముకుని/ బతుకుసేద్యం చేస్తున్న/ కాలం నుంచి అదే వెత మాది'' అంటూ రాయలసీమలో సేద్యపు వెతలను ప్రస్తావించారు ఆది ఆంధ్ర తిప్పేస్వామి. ''పంట కోసం భూమిలో బోరు వేస్తే అప్పులు పడుతున్నారు!'' అంటూ శీర్పి చంద్రశేఖర్ రాయలసీమలో రైతు దుస్థితిని వర్ణించారు. ''ఊరి ఊరిలో వాడ వాడలో మా గళం వినిపిస్తాము రైతే రాజని నిరుపిస్తాము'' అంటూ మద్దతు పలికారు పురుషోత్తముడు. ''అదనులో వానబడెనని ఆశతోడ/ ఎరువులను విత్తనంబులనరువు దెచ్చి/ భూమిలోజల్ల వర్షాలు మోసపుచ్చు/ మెట్టరైతుకు కన్నీరు తెట్టువగును'' అంటూ ప్రకృతి, పాలకులు రైతును దగా చేస్తున్న తీరును పద్యంగా వినిపించారు ఒంటెద్దు రామలింగారెడ్డి. ''మంచికాలమ్ము మిమ్ము వరించగలదు/ బ్రతుకవలెనంత వరకెన్ని బాధలైన'' అంటూ ధైర్యం చెప్పారు. ''రైతును ఆకాశానికెత్తే ఉపన్యాసాలు /కవుల వర్ణనలు / విశ్లేషకుల లెక్కలు /రైతుకు సేదతీరుస్తాయా?'' అంటూ ప్రశ్నించారు కోటిగారి వన్నప్ప. ''ఆరుగాలం శ్రమించి పండించిన /పంటంతా దళారుల చెంత చేరింది/ ముడివిప్పిన పెళ్ళాం పుస్తెలు మాత్రమే మళ్ళీ ఇంట చేరాయి'' అంటూ యం.కొండప్ప దళారుల మోసాలకు బలవుతున్న రైతు వ్యథను విన్పించారు.
''ప్రతి విత్తనాన్ని/ పొలంలో విత్తుతుంటే/ పొలాన్ని శ్మశానం చేసి/ రైతుని పాతిపెట్టడమవుతుంది'' ''ప్యూపా సీతకోకచిలుకై/ ఎగరలేకపోవడం చూస్తే/ వేరుశనగ పువ్వై నవ్వాల్సినవాడు/ పురుగుల మందు తాగిన గొంగళి పురుగైపోతాడు'' అని సేద్యమెంత వికృతంగా మారిపోయిందో చెప్పారు అంకె శ్రీనివాస్. ''సేద్యగానికి పెద్ద నేస్తగాడు రైతు కూలీ / మర యంత్రాల నూర్పిడి కింద రైతుకూలీలు నలిగిపోతున్నారు'' అంటూ రైతులు, వ్యవసాయ కార్మికుల మధ్య సత్సంబంధాల గురించి చదివారు రామకొండ రామకృష్ణ. ''పురాతన వస్తు ప్రదర్శనశాలలో /మున్ముందు చూస్తామేమో /మమ్మల్ని మేము మట్టిబొమ్మల రూపంలో'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆదోనికి చెందిన స్వయంప్రభ. ''ఉద్యోగులకు వేతన సంఘలున్నట్లే/ మాకూ ఆదాయ కమిషన్ ఏర్పరచండి'' అని ఆకుల రఘురామయ్య రైతుల తరఫున ఓ వైపు డిమాండ్ చేశారు.
''పరోపకార పరాయణుడికి/ పంటనష్టమే పురుగుమందుల/ పెరుగన్నం అవుతోంది; వ్యయప్రయాసలతో కూర్చిన సంపదను/ వరుణదేవుడి ప్రకోపానికి వాయనమిచ్చి/ ఉరితాడునే వరమాలగా వేలాడతాడు'' అన్న లక్ష్మీ సుధీర్ ''మన ఆయువుకు/ ఆధారమైన వాడికి/ చేయూత అవుదాం/ తన ఉనికికి మనమే ఊపిరవుదాం'' అంటూ పిలుపునిచ్చారు. ''పేరుకే రాజైన రైతన్న కనుమరుగైతే/ రాజ్యాలు రాజ్యాలే పస్తుండాల్సి వస్తుందంటూ'' హెచ్చరించారు పూజారి ఈరన్న. ''అక్షరాల విత్తనాలను/ దేశమంతా నాటుతా/ రైతుకు రచయిత తోడంటూ /మాటల యుద్ధమే సాగిస్తా''నని ప్రకటించారు జి.అశోక్ కుమార్. ''రైతు మానవ సమూహ అస్తిత్వానికి భూమిక కావాలంటూ'' ప్రజ్ఞా సురేష్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
''రైతు నేడు విలువలేని పాతనోట్ల రోత/ రైతు నేడు అణువణువునా/ నెత్తురు కారుతున్న గాయాల పూత'' అంటూ దుర్భరమైన రైతు జీవితాన్ని అద్భుతంగా వర్ణించారు ఎం.రమేష్. ''నాకు విద్యుత్ శక్తిని ఇవ్వండి/ దేశపు జీవనాడినై వెలుగులు విరబూస్తాను/ నాకు సాంకేతికతను ఇవ్వండి/ స్రష్టనై కొత్త సంస్కృతిని సృజిస్తాను/ నాకు కనీస మద్దతు ఇవ్వండి'' అంటూ రైతు తరఫున అడిగారు అమళ్ళదిన్నె భరద్వాజ. అనంతలో వాన పడిన దృశ్యం ఆహ్లాదంగా వివరించారు చిలుకూరి దీవెన చిత్రించిన వాన కవితలో. వాన కోసం పరితపించిపోతున్న వైనాన్ని డాక్టర్ ఎ.ఎ.నాగేంద్ర కూడా నానీలుగా వినిపించారు. సోలార్ పరిశ్రమ అనంత రైతుల గుండెల మీద గుచ్చిన గునపాల్ని ఈ.రాఘవేంద్ర హృద్యంగా కవిత్వం చేశారు. ''సౌరఫలకాల పాదాలకింద నేల/ ఊపిరాడని పసికందై/ చితికిపోతుందన్న దిగులు దు:ఖం/ గునపమై గుండెలంతా/ గుదిగుచ్చి తవ్వుతున్నట్లుంది/ ఎన్ని పరిహారాలైతే ఆ మమకారాన్ని/ మా బతుకుల్ని సవరించగలవు?'' అని నిలదీశారు. అనంతపురం జిల్లా పొలాల్లో వయ్యరిభామలా విస్తరించిన గాలిమరల గురించి ప్రగతి ఇలా అన్నారు : ''పంట చేల నడిబొడ్డున/ నిట్టనిలువున దిగబడ్డ గునపాలు/ రైతన్న గుండెల్లో దిగబడి/ ఉసురు తీయనీకేనని/ ఎరికయ్యే నాటికి/ అంతా ముగిసిపోయింది/ పంటచేలన్నీ మున్నూరడుగుల కలుపు మొక్కలతో నిండిపోయినాయి''.
''న్యాలకు కలలుంటాయి/ యిత్తనాలు మొలుస్తాయి జన సెయితన్య కెరటాలై'' అంటూ రాయలసీమ మాండలికంలో 'నాగలి కైత' వినిపించారు మడకశిరకు చెందిన డా.సి.శివన్న. సడ్లపల్లి చిదంబరరెడ్డి భరోసా లేని రైతు బతుకుల గురించి చెబుతూ రైతు బతుకును చిన్నాభిన్నం చేస్తున్న అందరినీ దుయ్యబట్టారు. వ్యవసాయంపై కార్పొరేట్ పెత్తనాన్ని విషాదంగా, వ్యంగ్యంగా పలికించిన కెంగార మోహన్. ''విత్తు కొత్తగా/ మొలకెత్తుతుంది/ అందమైన అస్థిపంజరమై విరబూస్తుంది/ కలలన్నీ కళేబరాలై/ పచ్చటి పంటలౌతున్నాయి/ మోదీషాలాంటి పాలక కూలీలున్నంతకాలం/ దేశం నిండా ఎన్ని కన్నీళ్ళైనా కాలువలై ప్రవహిస్తాయి'' అని ఎద్దేవా చేశారు.
తరిమెల అమరనాథరెడ్డి తన కవితలో.. ''పిరికిగా చావకోయ్ / చేవతో పోరాడవోయ్ / పల్లెను బతికించవోయ్ / ఢిల్లీని బతికించవోయ్ '' అని రైతుకు ధైర్యం చెప్పారు. ''చట్టాలు ఉరితాళ్ళవుతున్నప్పుడు/ అతడు తిరుగుబాటు చేస్తాడు... అతడి పిడికిలే దేశానికి ఆశాకిరణం...'' అని కుమారస్వామి రైతు స్ఫూర్తిని చాటారు. ''అతడిని మాట్లాడనివ్వండి/ ఇప్పుడిప్పుడే కాస్త ప్రశ్నించడం/ నేర్చుకున్న ఆ లేత గళానికి/ అలా ఉరితాడును బిగించకుండా అతడిని మాట్లాడనివ్వండి'' అంటూ రైతు పక్షాన మాట్లాడారు యువ కవయిత్రి కొండా శిరీష. ''కంప్యూటర్ల కాలమే అయినా/ రోబోలు రాజ్యమేలినా/ గుట్టలుగుట్టలుగా/ కట్టలు పేర్చినా/ అన్నదాత హలం కదలని నాడు/ జగతికి హాలాహలమే గతి'' అంటూ జి.నరేంద్ర హెచ్చరించారు. ''పాలకుల క్యాసినోలో/ వ్యవసాయం జూదంగా మారిందని'' చింతిస్తూ ఉదయించే పిడికిళ్ల కోసం జీవించాలని పిలుపునిచ్చారు టి.వి.రెడ్డి. ''రైతు పిల్లకు పెళ్లి చెయ్యలేడు/ కొడుక్కు సంబంధం లేదు'' అంటూ రైతు జీవితం ఎంత దుర్భరమైందో లీలామనోహర్ బాధపడ్డారు. ''ఇన్కంటాక్స్ కోసం మాటలు లేని భూమమ్మను కొంటున్న'' దగాను పట్టుకున్నారు గంగిరెడ్డి అశ్వర్థరెడ్డి. ''ఇప్పుడు కావాల్సింది/ క్రాప్ లోన్లు కాదు, కాన్ఫిడెన్స్ కోటా'' అంటూ మార్పుకోసం పోరాడాలన్నారు. ''రైతు కూలీగా/ అసంఘటితరంగ కార్మికుడుగా/ మారిపోయి రైతు చిరునామా చిరిగిపోతోందం''టూ జూటూరు షరీఫ్ సహారా, ఆసరా, భరోసాతో అతడి కంటిలో కోటి కాంతులు నింపాలని కోరారు. ''ప్రపంచ రైతుల ప్రజోత్సవానికి/ నవశక వ్యవసాయ నిర్మాణానికి/ నాందీ ప్రస్థావనలకు కదలండి!'' అంటూ పిలుపునిచ్చారు డా.అంకె రామలింగమయ్య. ''కార్పొరేట్ కాకాసురుల దాహానికి/ హరిత క్షేత్రాలు యుద్ధక్షేత్రాలైనవేళ/ ధర్మాగ్రహం సత్యాగ్రహమై/ ఎర్రకోటను చుట్టేసింది/ సాయుధ దళాలకు/ సవాల్ విసురుతోంది; చేతి కందిన పంట/ నోటి కందాలని/ సాగు చట్టాలపై సమరం/ సాగించే ఈ బల రాముళ్లకి/ మనం బాసటగా నిలుద్దాం రండి!'' అంటూ కవులకు పిలుపునిచ్చారు సీనియర్ డా. రాధేయ.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ కవులే కాదు; ఇప్పుడిప్పుడే రాస్తున్న యువ కవులూ, విద్యార్థి కవులూ పాల్గొన్నారు. వారంతా రైతుల తరఫున ఆర్తిగా కవిత్వం వినిపించారు. కార్పొరేట్ మోసాలను, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతుకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామని ప్రతిన పూనారు.
- ప్రగతి










