May 27,2022 07:34

రెప్పల చాటున దాగిన కన్నీళ్లు
ఎప్పుడో ఆవిరైపోయాయి
ఏడవటానికి ఇప్పుడు ఒక్క
కన్నీటి చుక్క కూడా మిగలలేదు

ఏటేటా ఇదే తంతు
పంట చేతికి వచ్చే సరికి
ఏదోరూపంలో ఒక ఉపద్రవం
నేనున్నాను అంటూ తొంగి చూస్తుంది

విత్తు నాటిన క్షణం నుండి
పంట కోతకు వచ్చే వరకు
పసిపాప పొత్తిళ్ల నుండి
నడక వచ్చేవరకు సాకినట్టుగా సాకాలి

శ్రమసాగరంలో ఓలలాడుతూ
రెక్కల కష్టంతో తడారకుండా చూస్తూ
చీడపీడల, కల్తీ పురుగు మందుల మధ్య
నలిగిపోతు వెన్ను వంగిన పట్టించుకోడు

తెగిడిన నోళ్లే కానీ పొగిడిన నోళ్లు ఉండవు
ప్రగల్భాలు పలికే నేతలు కొందరు
సాయం చేసే దయామయులు కానరారు
రైతు ముఖ చిత్రం అబేధ్యాల కోట.
 

- గాదిరాజు రంగరాజు
సెల్‌ : 8790122275