Feb 07,2023 09:37

శ్రీసత్యసాయి కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళనలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌.వెంకటేష్‌

            అనంతపురం కలెక్టరేట్‌ : సమస్యల పరిష్కారంపై అంగన్‌వాడీలు కదంతొక్కారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సిఐటియు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నాడు మహాధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మబూన్నీషా అధ్యక్షత నిర్వహించిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని మండిపడ్డారు. అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కోత విధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను తక్కువ కాదన్నట్లు అనేక నిబంధనలు అమలు చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ అరెస్టులు, గృహ నిర్భందాలకు పాల్పడటం దుర్మార్గంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో వాటి ఊసే ఎత్తకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీరుప్రకారం గ్రాట్యూటి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ వేధింపులు, తొలగింపులను ఆపాలన్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలుకు సంబంధించి కొన్ని ప్రాజెక్టుల్లో గత 6నెలల నుంచి మెనూ బిల్లులు ఇవ్వలేదన్నారు. అంగన్వాడీ సెంటర్లో మౌలిక వసతులు లేవన్నారు. గత 8 సంవత్సరాలుగా టీఏ బిల్లులు చెల్లించడంలేదన్నారు. రకరకాల యాప్‌లు తీసుకొచ్చి పనిభారం పెంచారు తప్పా, వేతనాలు పెంచలేదన్నారు. అంగన్‌వాడీలను ఇబ్బందులకు గురి చేసేలా తీసుకొచ్చిన పేస్‌యాప్‌ను రద్దు చేయాలన్నారు. అంగన్వాడీల మీద పనిభారం తగ్గించాలన్నారు. సమస్యల పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీల ఆందోళన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ వారివద్దకొచ్చి మాట్లాడారు. అంగన్‌వాడీలకు జిల్లా పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ దిల్‌షాద్‌, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జిల్లా కోశాధికారి శ్రీదేవి, చంద్రకళ, లావణ్య, లక్ష్మీదేవి, రమణమ్మ, బావమ్మ, పైపల్లి గంగాధర్‌, గౌస్‌లాజిమ్‌, నరసింహులు, వెంకటేష్‌, రామచంద్ర పాల్గొన్నారు.