ప్రజాశక్తి-హిందూపురం : ప్రతి విద్యార్థి కాలం విలువ తెలుసుకుని, ఆ కాలంతో సమానంగా సాగితే విజయం వారి వెంటే ఉంటుందని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం పట్టణంలోని బాలయేసు జూనియర్ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్‌తో పాటు జెఈఈ, ఇతర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల పరిపాలన అధికారి శౌరిరెడ్డి అధ్యక్షతన ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్‌ఛైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ బలరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైందన్నారు. పేస్ బుక్ కన్నా క్లాస్ బుక్ వల్ల జ్ఞానం పెరుగుతుందన్నారు. అనంతరం సీనియర్ ఇంటర్ విభాగంలో 980 మార్కులు సాధించిన మానసకు ల్యాప్ ట్యాప్ అందించారు. ప్రతిభ కనపర్చిన మిగిలిన వారికి నగదు బహుమతులు, జ్ఞాపికలు, పతకాలు అందించారు. అనంతరం ఉత్తమ అధికారిగా ప్రశంశలు పొందిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావును కళాశాల తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ రెడ్డి, రామమోహన్ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు.










