Aug 29,2022 07:29

ఇటీవల తెలుగునాట ప్రసిద్ధులైన రచయితల పేర్ల మీద సాహిత్య సంస్థలు ఏర్పడుతున్నాయి. ఈ పరిణామం ఆహ్వానించదగింది. అభినందించదగింది. ఆనందించదగింది కూడా. అందులోనూ ప్రజాదృక్పథంగల రచయితల పేరు మీద సాహిత్య సంస్థలు స్థాపించడం మరీ అభినందించదగింది. వేమన, గురజాడ, గుర్రం జాషువా, శ్రీశ్రీ వంటి ప్రజారచయితల పేరు మీద సాహిత్య సంస్థలు వెలిశాయి. ఈ సంస్థలు స్థాపించిన వాళ్ళ పట్ల సమాజానికి ఉన్నతమైన అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఈ సంస్థలు ఆ రచయితల ఆశయాలకు, భావజాలాలకు అనుగుణంగా పని చేస్తాయని, వారి అడుగుజాడల్లో నడుస్తాయని, వాళ్ళ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని జనం నమ్ముతారు. ఆ సంస్థల మీద గొప్ప ఆశలు పెట్టుకుంటారు. ఆ రచయితలను గౌరవించినట్లే వాళ్ళ పేరు మీద సాహిత్య సంస్థలు నెలకొల్పినవాళ్ళను కూడా గౌరవిస్తారు. అందువల్ల ఆ సంస్థల వ్యవస్థాపకులు జనం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఆ రచయితల ఆశయాలకు భిన్నంగా, వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. ఆ రచయితల ఆశయాలకు భిన్నంగా వ్యవహరించడం కన్నా ఆ సంస్థను స్థాపించ కుండా ఉండడమే మర్యాద. వేమన పేరు మీద సాహిత్య సంస్థను స్థాపిస్తే వేమన కుల అసమానతలను నిరసించాడు. అస్ప ృశ్యతను తీవ్రంగా ఖండించాడు. దళితులను అవమానించారని వ్యతిరేకించాడు. విగ్రహారాధనను గర్హించాడు. కులాధిపత్యాన్ని నిరసించాడు. శ్రమను గౌరవించాడు. ఆర్థిక కేంద్రీకరణను ఆమోదించలేదు. అజీర్ణవర్గాన్ని వదిలి, ఆకలివర్గం వైపు నిలిచాడు. వర్గహింసను వ్యతిరేకించాడు. పేదరికం వల్ల కలిగే ప్రమాదం పట్ల హెచ్చరిక చేశాడు.
                  మతమౌఢ్యాన్ని చీల్చి చెండాడాడు. సోమరితనాన్ని ఎద్దేవా చేశాడు. మంచిని సమర్థించాడు, చెడును వ్యతిరేకించాడు. అందువల్ల వేమన పేరుతో ఒక సాహిత్య సంస్థను స్థాపిస్తే ఆ సంస్థ ఈ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. వాళ్ళు నిర్వహించే సాహిత్య కార్యక్రమాలు వేమనను అవమానించే విధంగా ఉండకూడదు. ఆ సంస్థ ఇతర రచయితలను పురస్కారాలతోనో, సన్మానాలతోనో గౌరవించదలచుకుంటే వేమన సిద్ధాంతాలకు అనుగుణంగా రచనలు చేసే వాళ్ళనే గౌరవించాలి. వేమన భావజాలంతో సంబంధం లేని వాళ్ళను ఆయన పేరు గల సంస్థ గౌరవిస్తే అది వేమనను అవమానించడమే అవుతుంది.
                      గురజాడ అప్పారావు ఆధునిక రచయిత. సంస్కరణవాద రచయిత. ఇంకా చెప్పాలంటే సాంఘిక విప్లవ రచయిత. ఆయన వర్ణవ్యవస్థను తిరస్కరించాడు. అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్పాడు. ప్రజల్లో మంచి చెడులు మాత్రమే ఉంటాయి అని నమ్మాడు. భార్యాభర్తలు స్నేహితులు లాగా ఉండాలన్నాడు. వర్ణాంతర వివాహాన్ని సమర్థించాడు. మూఢనమ్మకాలను, మూఢాచారాలు ఉతికి ఆరవేశాడు. విగ్రహారాధనను విమర్శించాడు. బౌద్ధధర్మాన్ని గౌరవించాడు. వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో విప్లవాత్మకమార్పులు రావాలన్నాడు. వంటిళ్ళను ధ్వంసం చేయమన్నాడు. ప్రకృతి పరిణామాలను చూచి భయపడవద్దన్నాడు. దేశాన్ని ప్రేమించమన్నాడు. దేశమంటే మనుషులే నన్నాడు. చెమట చిందించమన్నాడు. అనేక మతాల వాళ్ళు అన్నదమ్ములు లాగా బతకాలన్నాడు. మతాలు నశించిపోయి జ్ఞానం విలసిల్లాలన్నాడు. శాస్త్రీయమైన విద్యను కోరుకున్నాడు. ప్రేమమయమైన సమాజం కోసం పరితపించాడు. గురజాడ పేరున ఒక సాహిత్య సంస్థను స్థాపించేవాళ్ళు ఆ గురజాడ ఆలోచనలతో ఏకీభవించాలి. లేకుంటే ఆయన జోలికి పోరాదు. ఆయన పేరు మీద నెలకొల్పిన సంస్థ నిర్వహించే కార్యక్రమాలు గురజాడ ఆశయాలకు అనుగుణంగా ఉండాలి. ఆ సంస్థ ఎవరికైనా పురస్కారం ఇవ్వాలన్నా, ఎవరినైనా సన్మానించాలన్నా గురజాడ అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే ఎన్నుకోవాలి. గురజాడ అభిప్రాయాలకు వ్యతిరేకమైన అభిప్రాయాలను ప్రచారం చేసే వాళ్ళను సన్మానించినా, వాళ్ళకు పురస్కారమిచ్చినా గురజాడను అవమానించడమే అవుతుంది.
             గుర్రం జాషువా కుల వ్యవస్థను నిరసించాడు. అస్ప ృశ్యతను అతి తీవ్రంగా వ్యతిరేకించాడు. స్వాతంత్య్రానంతర భారతదేశం లౌకిక దేశంగా ఎదగాలన్నాడు. ఆధిపత్య వ్యవస్థను వ్యతిరేకించాడు. మతమౌఢ్యాన్ని నిరసించాడు. మనుషులను నిరసించి, విగ్రహాలను పూజించడాన్ని ఎద్దేవా చేశాడు. రాజకీయ నాయకుల ఆడంబరాలను నిరసించాడు. ఎన్నికల్లో కులం, ధనం పాత్రను విమర్శించాడు. శాంతి, అహింసలను ప్రచారం చేశాడు. గాంధీజీ మార్గాన్ని కీర్తించాడు. గాంధీ హత్యను గర్హించాడు. సంపద కేంద్రీకరణను వ్యతిరేకించాడు. స్త్రీపురుష సమానవత్వాన్ని కోరుకున్నాడు. అవినీతిని వ్యతిరేకించాడు. సాహిత్యంలో అయోమయం ఉండరాదన్నాడు. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధిలోకి రావాలన్నాడు. సోమరితనాన్ని నిరసించాడు. దళితుల శ్రమసంస్కృతిని ఆవిష్కరించాడు. చరిత్రను గౌరవించాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపాడు. విశ్వ మానవతను ప్రచారం చేశాడు.
                   జాషువా పేరున సాహిత్య సంస్థను నెలకొల్పే వాళ్ళు జాషువా భావజాలాన్ని ఆమోదించాలి. ఆయన విమర్శనాత్మకతను ఒంటబట్టించుకోవాలి. ఆయన జీవన విధానాన్ని గమనించాలి. ఆయన భావజాలంతో ఏకీభవించేవాళ్ళనే సన్మానించాలి, వాళ్ళకే పురస్కారాలు ఇవ్వాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జాషువాను అవమానించినట్లే!
శ్రీశ్రీ సమసమాజాన్ని స్వప్నించాడు. దోపిడిని విమర్శించాడు. వర్గనిర్మూలనను కోరుకున్నాడు. మనిషిని మాత్రమే సత్యంగా గుర్తించాడు. మానవ శ్రమను కీర్తించాడు. పేదల పక్షం, శ్రామికుల పక్షం వహించాడు. వర్గపోరాటాన్ని ప్రబోధించాడు. అంతర్జాతీయ మానవుడిని వర్ణించాడు. శ్రామికుల తిరుగుబాటును కవిత్వీకరించాడు. కవిత్వవస్తువులో విధినిషేధాలు వద్దన్నాడు. భౌతికవాదాన్ని వినిపించాడు. ఆయన పేరు మీద ఒక సాహిత్యసంస్థను స్థాపించిన వాళ్ళు ఈమాత్రం శ్రీశ్రీని అవగాహన చేసుకోవాలి. ఆయన ఫిలాసఫీని ఆమోదించాలి. ఆయన సిద్ధాంతాలకు భిన్నమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు సంస్థను నడపడం, ఆయన సిద్ధాంతాలను నమ్మనివాళ్ళను గౌరవించడం ఆయనను అవమానించడమే! ప్రజాకవుల పేరుతో సాహిత్య సంస్థలు నెలకొల్పిన వాళ్ళు, వాళ్ళ ఆశయాలకు భిన్నంగా నడుచుకుంటే, చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకోవడమే అవుతుంది. అది ఉన్నతమైన సంస్కారం కాదు.
                     కాలం చెల్లిన భావాలను అత్యాధునిక ప్రచార సాధనాలను ఉపయోగించుకొని ప్రచారం చేసేవాళ్ళు, పైకి ఆధునికులుగా కనిపిస్తూ, సారంలో వెనుకటి బుద్ధులు కలవారు, సమాజాన్ని వెనక్కి నడిపించేవాళ్ళు, చెలామణి కోసం ఆధునిక వేషాల్లో తిరిగే వాళ్ళు వేమన, గురజాడ, జాషువా, శ్రీశ్రీ వంటి రచయితల పేర్ల మీద సంస్థలు నెలకొల్పడం గానీ, ఆ సంస్థల ద్వారా సన్మానాలు, పురస్కారాలు పొందడం గానీ అసంబద్ధమూ, అనౌచిత్యమూ అవుతాయి.
                                                                           రాచపాళెం చంద్రశేఖర రెడ్డి