నేస్తమా,
నా సమస్తమై నాతో అడుగులు వేస్తావు
నీ హస్త స్పర్శ తో
గడిపే క్షణాలకు స్వర్ణ కాంతులు పూస్తావు
అయినా ఒక్కోసారి నిన్ను మరుస్తాను
నీ చేయి విడుస్తాను
వృత్తి ధర్మాల వత్తిళ్లలోనో
నిత్య పోరాటాల పొత్తిళ్ళలోనో
ఉత్తి పరుగుల ఊరేగింపుల్లోనో
అరక్షణం పాటు ఏమరుపాటుగా
మరుక్షణమే గుర్తుకు వస్తుంది
యుగళ గీతాలన్నీ దిగులు మేఘాలైనప్పుడు
అంతటి వెలుగు క్షణాలపై
అంతలోనే అంధకారం అలముకున్నపుడు
వెన్నెలనై వెర్రి గాలినై
తిన్నెలపై ఇసుక ధూళినై వెదుకుతూ పోతాను
కాన రాక కలత చెందినపుడు
వేసట చెంది వెనుదిరిగినపుడు
ఫక్కున నవ్వి పలకరిస్తావు
దాక్కున్నది నా ఎదలోనేనంటావు
నా ఎదలోనే వుంటావు.. ఎప్పటికీ!
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931










