ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ కళాశాల సైతం ఏర్పాటు చేయలేదని, వెంటనే ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈ విషయంపై సోమవారం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను ఆయన నివాసంలో కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బాబావలి మాట్లాడుతు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రి కళాశాల లేక పోవడంతో పేద మధ్య తరగతి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసిందని దీంతో పట్టణంలో శ్రీకంఠాపురంలో ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి ప్రభుత్వ పాఠశాలలో నాలుగు గదులలో లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. ఆ సమయంలో త్వరలో స్థల సేకరణ చేసి, అన్ని సౌకర్యాలతో నూతన కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇంత వరకు ప్రారంభం కాలేదన్నారు. అసలు కళాశాల మంజూరు అయిందా...లేదా అన్న అనుమానాలు ఉన్నాయన్నారు. రూరల్ మండలం చర్లపల్లి వద్ద 9 .44 ఎకరాల్లో స్థలాన్ని కళాశాల కోసం సేకరించామని తెలిపారనిఅయితే ఇప్పటి వరకు సేకరించిన స్థలంలో భవన నిర్మాణ పనులు చేపట్టలేదని విమర్శించారు. దీనిపై స్పందించి రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి స్థలంతో పాటు నిర్మాణానికి అవసరమైన నిధులు, పోస్టుల భర్తీకి కృషి చేసి, వచ్చే విద్యాసంవత్సరం నుంచి కళాశాల ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్, హర్షకుమార్, భగత్, మహేష్, అభి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.










