ఆధునిక జీవితం
ఊరిని పరాయిని చేస్తుంది
అందుకే,
ఎప్పుడోగాని వూరు గుర్తురాదు !
ఎప్పుడో ఓసారి ఊరెళ్తే..
నాన్న బీడు మొహంతో కనిపించేవాడు
అమ్మ బంజరు చూపులతో బదులిచ్చేది
అక్కడి మనుషులు
ముళ్ళచెట్ల ముఖాలతో
సస్యరాహిత్యపు దుక్కులుగా ఎదురయ్యే వాళ్లు..
ఊరు వెకిలిగా నవ్వినట్టూ
పొలం మూగగా ఏడ్చినట్టు
నల్లని కలలు!
కానీ, ఏదీ ఇంకేది కాదు నాలోపలికి..
మనం గమనించం గానీ,
నేల, ఆశల శిలాజమై
ఒక స్పర్శ కోసం
ఎదురు చూస్తూ ఉంటుంది..
దదద
బతుకు తెరిపిచ్చి
కుప్పలుగా ఖాళీకాలం పండుతుంటే
చేనుకు చెవి ఆన్చి
లోపలి గాయాలన్ని విన్నాను.
ఒక విషాద గేయం గుండెను కోసింది
ఆ విప్రలబ్ధ స్పర్శకు నీరై కరిగిపోయాను!
చేను కన్నీరు తుడిశాను..
యంత్రచేతి వేళ్ళతో
తలదువ్వి ముస్తాబు చేశాను
అప్పుడు నున్నని చేను అద్దంలో
నన్ను నేను చూసుకున్నాను
అద్దం నిండా నవ్వుతూ
తాత ముత్తాతల ముఖాలు!
ఒకనాడు, నింగి గట్టు తెగి
చేను తల కడిగింది..
చేను సిగ్గుల మడి అయ్యింది !
దాని బుగ్గలు
ఎర్రమంటి బొప్పిలిగాళ్లయి మెరిసినాయి
చేనుకంటిలో తిరునాళ్ళ తన్మయం
కాడెద్దులు హలం పట్టి
చేను కావ్యం రాశాయి
చేనుతలనిండా శనగపూల జాజర!
వూడలకలలు నేలంతా దిగి
నాలోనంతా విస్తరించాయి
బుడ్డలు బిడ్డలుగా ఎదుగుతుంటే
నాలోనూ చేనుపున్నమిపంట !
దదద
ఇప్పుడెప్పుడైనా
నేను మావూరికి పొతే...
నాయన, నిండుబండిలా ఎదురొస్తాడు..!
అమ్మ , కందిసాలై కళకళలాడుతాది!
ఆ వూరు, ఆ మనుషులు
నన్నిప్పుడు
పంటకల్లాన్ని చూసినట్లు చూస్తున్నారు !
- కొత్తపల్లి సురేష్










