పుట్టపర్తి అర్బన్ : సాగులో ఉన్న పేద రైతులందరికీ భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున పోరాటం చేపట్టారు. సోమవారం నాడు జిల్లా నలమూలల నుంచి వచ్చిన పేద రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా ఎనుములపల్లి గణేష్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. సమస్యను అధికారులకు తెలిపేందుకు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు నాయకులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. స్పందనలో అర్జీలు ఇవ్వడానికి వస్తే గేట్లు వేస్తారా.? ఇదెక్కడి న్యాయం అంటూ పేదలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా వ్యకాసం ఆధ్వర్యంలో రైతులు, కూలీలు కలెక్టరేట్ గేట్లు ఎక్కి కార్యాలయంలోకి ప్రవేశించారు. కార్యాలయం ఆవరణలో బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పేదలు భూములు సాగు చేసుకుంటున్నా, వారికి పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా పెనుకొండ, సోమందపల్లి, రొద్దం, చిలమత్తూరు, హిందూపురం తదితర మండలాల పరిధిలో ఎన్నో ఏళ్లుగా పేదలు పట్టాల కోసం అర్జీలు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ధర్మవరం ఎమ్మెల్యే కలెక్టరేట్‌కు వస్తే ఆయనకు రాజమర్యాదలు చేసిన అధికారులు పేదలను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పేదల భూములను ఆక్రమించుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్, ఎపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డిలు ప్రభుత్వ భూములను ఆక్రమించకుంటున్నా అధికారులు నోర మెదకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. సాగుదారులందరికీ పట్టాలు ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పేద దళిత, గిరిజనుల భూములు ఆక్రమించుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమస్యలన్నింటిపై కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న కలెక్టర్ బసంత్‌కుమార్ ఆందోళనకారుల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే అన్ని మండలాల్లో అసైన్‌మెంట్ కమిటీ సమావేశం జరుగుతుందని, ఆయా తహశీల్దార్లు పంపిన నివేదికలు ఆధారంగా కమిటీ ఆమోదిస్తుందన్నారు. ఇందులో పేదలందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పేదలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, నాయకులు నారాయణ, వెంకట రాముడు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, వెంకటేశులు, సిఐటియు నాయకులు జగదీష్, రామకష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రంగప్ప, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.










