ప్రజాశక్తి-హిందూపురం : ఒపిఎస్ విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులుకలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని యూటిఎఫ్, ఎపి ఎన్‌జిఒ సంఘం నాయకులు హెచ్చరించారు. సిపిఎస్‌ను (కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో సంకల్ప దీక్షను ఆదివారం చేపట్టారు. ఈ దీను ఎపి ఎన్‌జిఒ తాలూకా అధ్యక్షులు నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్బంగా యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మారుతీ శ్రీనివాస్, నరసింహులు మాట్లాడుతు సిపిఎస్‌ను రద్దు చేయాలని 18 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని స్పష్టంగా హామీ ఇచ్చిందని అయితే తీరా అధికారంలోకి వచ్చాక జిపిఎస్ అంటున్నారని విమర్శించారు. జిపిఎస్ విధానం వలన ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ప్రశాంతంగా సంకల్ప దీక్షలు చేపడుతుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం దుర్మార్గమని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతినెలా 1న వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు ఎపి ఎన్‌జిఒ, ఎపి జెఎసి నాయకులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి, కార్యదర్శి నాగేంద్ర, నాయకులు భూతన్న, సిహెచ్ బాబు, సీతాలక్ష్మి, సుధాకర్, మారుతి, రామకృష్ణ, చెన్నకేశవులు, మహంతి, శ్రీనివాసులు, నగేష్‌తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










