Apr 25,2022 07:18

'వివిధ అవసరాలు ముందుకు తోసినప్పుడు వివిధ రచనా పద్ధతులను, ప్రక్రియలను నేను ఎంచుకున్నాను. కానీ, నవల రచనా నాకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియ.' అన్నారు ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు సాగర్‌ శ్రీరామ కవచం. పద్యం, కవిత, విమర్శ, నవల తదితర ప్రక్రియల్లో అనేక రచనలు వెలువరించిన ఆయన .. ఈ ఏడాది సాహిత్య సప్తతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ముఖాముఖి ఇది.

మీ నవలల నేపథ్యం ప్రధానంగా ఏ భావాలతో నడుస్తాయి?
నేను చిన్నప్పటి నుంచీ నవలా రచనల్లోనే అభినివేశం చూపించటానికి ఎక్కువ ఇష్టపడే వాడిని. కాలేజీ రోజుల్లో 16 ఏళ్ల వయసులోనే 'సజన', 'ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి' అనే నవలలు రాశాను. 'సజన' నవల రాత ప్రతిని నా మిత్రులు చదివి ఎంతో అభినందించారు. రెండవ నవలని ఏదో పబ్లికేషన్‌ సంస్థకి పంపితే వారి నుంచి ఏ సమాధానమూ రాలేదు. అలా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. 1999 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది నవలలు రాశాను. ఇప్పటివరకూ దహనం, మూలుగు, యాతన, అవస్థ పబ్లిష్‌ అయ్యాయి. నా నవలలు వ్యక్తి స్వేచ్ఛ కోసం పరితపించే పాత్రలు కేంద్రంగా నడుస్తాయి.

'దహనం' గొప్ప నవలగా విమర్శకులు గుర్తించారు. అందుకు కారణాలు ఏమిటంటారు?
'దహనం' కన్నడ నవల 'సంస్కార' కంటే గొప్ప నవలగా పేరు తెచ్చుకుంది. జీవితం ఒక క్రీడలాంటిది. ఈ క్రీడలో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో ప్రధానంగా ఈ నవలలో చిత్రీకరించాను. ఈ నవల 100 ఏళ్ల క్రితం నాటి మానవ సమాజ పోకడలకి అద్దం పడుతుంది. చరిత్రను, కాల్పనికతను, వాస్తవికతను, ఆనాటి వ్యక్తుల డొల్లతనాన్ని, అమాయకత్వాన్ని, జాతీయ పోరాటాన్ని, అసాంఘికతను చిత్రీకరించింది. బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి భ్రష్టుపట్టిన వైనాన్ని 'దహనం' నవల రికార్డు చేసింది.

మీ 'మూలుగు' నవలను వేగుంట మోహన ప్రసాద్‌ (మో) బాగా మెచ్చుకున్నారట ...
'మూలుగు' నవల నుంచి నా ప్రయోగాత్మక రచనా సంవిధానం ప్రారంభమైంది. ఆ నవల చదివిన వాళ్ళు దాని ప్రభావం నుంచి బైట పడలేని మానసిక స్థితిలోకి వెళ్ళి పోయామని చెప్పేవాళ్ళు. నిజానికి నవల అంతా ఏక వాక్యం అని మో ప్రస్తుతించారు. 'మూలుగు నవల ఏక కాలంలో గొప్ప రచన, మహోత్కృష్ణ రచన కూడా. ఇలాంటి రచనలు వస్తేగానీ, మన తెలుగు నవలలోని సాదాసీదా నీచత్వం తొలగిపోదు.' అని మో పేర్కొన్నారు. ఆయన ఇంతగా నా నవలని అభిమానించటం గొప్ప అదష్టంగా భావిస్తాను.

మీ కుటుంబ నేపథ్యం, బాల్యం, విద్య గురించి చెబుతారా?
మాది చాలా పేద కుటుంబం. మా అమ్మ గంపెడు సంతానం కన్నది. పద్దెనిమిది మందిలో ఏడుగురం బతికాం. ఆరుగురు మగపిల్లల్లో నేను నాల్గోవాడిని. చిన్నప్పుడు తిండి తినక పండుకున్న దరిద్రపు రోజులు నన్ను ఇప్పటికీ వేధిస్తాయి. ఎనిమిదో యేటవరకూ ఇంట్లోనే విద్యాభ్యాసం. ప్రాథమిక విద్య మూడేళ్లలో పూర్తి చేశాను. ఆ తర్వాత పి.వి.ధర్‌ మున్సిపల్‌ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశాను. స్కూలు ఫస్ట్‌. ఆ మార్కుల మూలంగా డిగ్రీ రెండవ యేట తపాలా శాఖలో ఉద్యోగం వచ్చింది. 1972లో నిజామాబాద్‌లో ఉద్యోగంలో చేరాను. రిటైరై పదేళ్లవుతోంది. ఈరోజుకీ 5 గంటలపాటు అధ్యయనం చేస్తాను. రాసుకోటం కూడా అందులో భాగమే!

మీ సాహితీ వ్యాసంగం ఎప్పుడు, ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచి ఆటలకి దూరంగా, పుస్తకాలకి బాగా దగ్గరగా వుండేవాడిని. మా కుటుంబంలో సాహిత్యాభినివేశం ఉన్నవాళ్ళు బత్తిగా లేరు. నా పదో యేట నుంచే సాహిత్యంలోకి ప్రవేశించాను. నా తొలి రచన 'ఖడ్గ తిక్కన' నాటిక.
పద్యకవిగా మొదలైన మీ సాహిత్య జీవనం, కథకునిగా, వచన కవిగా, నవలాకారునిగా, విమర్శకునిగా జరిగిన పరిణామక్రమం గురించి వివరిస్తారా?
వావిలాల రామమూర్తి, భారతుల మార్కండేయ శర్మ గార్ల ప్రభావంతో ఎనిమిదో తరగతిలో రోజుకొక పద్యం రాసి చూపించేవాడిని. రోజూ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివేవాడిని. శ్రీశ్రీ, చలం తమ వెంట లాక్కుపోయారు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల నవలలు చదివి వుంటాను. నా అభిమాన ప్రక్రియ నవల.

మార్క్సిస్టు భావజాలానికి, ఆధునికానంతర భావజాలానికి తేడా ఏమిటి?
ఈ రెండూ తాత్విక సిద్ధాంతాలుగా అద్భుతమైనవి. మార్క్సిజం పోస్ట్‌ మోడర్నిజాన్ని వ్యతిరేకిస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాపితంగా ఫేక్‌ మోడర్నిజం గట్టిపడిపోయింది. అంతిమంగా ఫాసిజం తలెత్తింది. వ్యక్తికి ఈ రోజున కనీస హక్కులు లుప్తమవుతున్నాయి. బతుకుదెరువు ప్రశ్నార్థమవుతున్నది. ఇంకొకవైపు ప్రకృతి పగబడ్తున్నది. అందుకే మనిషి అస్తిత్వం కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అన్ని భావజాలాలూ ఈ రోజున ఆత్మరక్షణలో పడ్డాయి. ఫేక్‌ మోడర్నిజం ఈ పరిస్థితులకు అసలైన కారణం. ప్రపంచవ్యాపితంగా ఈరోజు అరాచకం రాజ్యమేలుతోంది. కళలు వ్యక్తి కోసం నిలబడాల్సిన అవసరం వచ్చింది.

'ప్రకృతి సాహితి' సాహిత్య మాస పత్రిక నడపడంలో మీ అనుభవాలు చెప్తారా?
ప్రకృతి సాహితి మొదటి సంచిక నవంబర్‌ 1998లో వెలువడింది. ఆ రోజుల్లో సాహిత్య పత్రికలు అంటే ప్రాపగాండా రాజకీయ వేదికలు మాత్రమే! దానికి భిన్నంగా పూర్తి సాహిత్యం కోసం ఈ పత్రికగా తెచ్చాను. చాలామంది రచయితలు ఆ పత్రికను తమ లైబ్రరీలో దాచుకున్నారు. డబ్బు వడ్డీకి తెచ్చి మరీ ఆ పత్రిక నడిపాను. చివరి 14వ సంచిక మార్చి 2007లో వచ్చింది.
నేను సాహిత్యం కోసం చేసిన ప్రయాణంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు, అవమానాలు భరించాను. చివరికి జైలుకి కూడా వెళ్ళాను. ఉద్యోగంలో నాలుగేళ్ళ పాటు సస్పెండ్‌ అయ్యాను. అయినా అది సాహిత్య ప్రయాణంగా భావించి ఓ దార్శనిక జీవితం అనుభవించాను. సాహిత్య ప్రయాణంలో రచయిత అన్ని ప్రక్రియల్లోనూ కషి చేయాలని నేను విశ్వసిస్తాను. ఏదో ఒక ప్రక్రియలో నిలబడిపోతే రచయిత కొన్నాళ్లకి స్టేల్‌ అయిపోతాడు.

'ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు' పేరుతో ఒక నూతన సాహిత్య విమర్శనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కదా! దీని గురించి వివరిస్తారా?
ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం ద్వారా నేను 'ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు' అనే నూతన విమర్శనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను. 'ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు' అనే పదం నానోట అచానక్‌గా వచ్చింది. దాన్ని ప్రతిపాదించి విస్తరించాను. విమర్శలో శూన్యాన్ని పూడ్చే క్రమంలో ఈ పుస్తకం రాశాను. ఈకాలంలో రచన ఓ సిజేరియన్‌ బిడ్డగా బైటికి వస్తోంది. సహజాతి సహజంగా రచన రావాలని 'ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు' బోధిస్తాయి. రచన తన చరిత్ర తాను రాసుకుంటుంది. రచయిత ఓ సాధనంగా ఉపకరిస్తాడు. ఆ జ్ఞానాన్ని 'ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు' తేటతెల్లం చేస్తాయి.

సాహిత్యపరంగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వారు ఎవరు?
చిన్నప్పటి నుంచి చలం ప్రభావం నాపై బాగా ఎక్కువ. ప్రేమ్‌చంద్‌ తదితరులను హిందీభాష పరీక్షలు రాసే క్రమంలో చదివాను. హరివంశరారు బచ్చన్‌ వంటి హేమాహేమీలు చదువులో భాగంగా దగ్గరయ్యారు. పాశ్చాత్య సాహిత్యం చాలా ఎక్కువ చదివాను. కాఫ్కా ప్రభావం చాలా ఎక్కువ. ఈరోజుకీ కాఫ్కా, సోమర్‌సెట్‌ మామ్‌, జేమ్స్‌ జాయిస్‌, హెరాల్డ్‌ రాబిన్స్‌, అల్బర్ట్‌ కామూ, సార్త్రే నాలో నిత్యం జీవించి వుంటారు. మార్క్విజ్‌, కుందేరా నన్ను వూపి పారేశారు.

భారతీయ సాహిత్యంలో మీకు నచ్చిన సాహితీవేత్త ఎవరు?
మన భారతీయ రచయితలపై పాశ్చాత్య ప్రభావం ఎక్కువ. వారి రచనల్లో ఒరిజినాలిటీ తక్కువ. ఎక్కువగా త్రిపురని యిష్టపడ్డాను. ఆయన నెరేషన్‌ నాకు నచ్చుతుంది. ఇక వేగుంట మోహన ప్రసాద్‌ని ఒకప్పుడు చాలా ఇష్టంగా చదివాను. శరత్‌ సాహిత్యం నన్ను చాలా దగ్గరికి లాక్కుంది.
యువకుడిగా నేను మార్క్సిజం బాగా అధ్యయనం చేశాను. ఆ తర్వాత వివేకానంద, జిడ్డు కష్ణమూర్తి, రమణ మహర్షి, డెర్రిడా మీదుగా పోస్ట్‌ మోడర్నిజం, జీన్‌ పాల్‌ సార్త్రె, అల్బర్ట్‌ కామూ, ఇక అంబేడ్కర్‌, అటునుంచి ఆచార్య నాగార్జున వంటి బౌద్ధ తత్వవేత్తలు నన్ను బాగా తమలో కలిపేసుకున్నారు. భారతీయ తత్వశాస్త్రాలు విపరీతంగా చదివాను. చరిత్ర నాకు అభిమాన శాస్త్రం. ఒక రచయితను ప్రేమిస్తే అతని సాహిత్యం పూర్తిగా చదివేయడం నాకు అలవాటు.

మీ రచనలకు మీరు కోరుకున్న గుర్తింపు రాలేదని ఎప్పుడైనా అనుకున్నారా?
నేనే కాదు, ప్రతి రచయితా అనుకుంటాడు. ప్రయోగాత్మక రచయితగా ఓ గుర్తింపు వచ్చింది. అది చాలు.

మీరు చాలా సాహిత్య విమర్శ రాశారు.వినిర్మాణ విమర్శ గురించి వివరిస్తారా?
ఈ విషయం మీద ఓ పెద్ద వ్యాసం రాస్తేగానీ స్పష్టత రాదు పాఠకుడికి. వినిర్మాణ వాదానికి సష్టికర్త జాక్వియస్‌ డెర్రిడాగా చెప్తారు. జ్ఞానానికి, సత్యానికి వున్న హేతుబద్ధతను డెర్రిడా తీవ్రంగా నిరాకరించాడు. వినిర్మాణవాదం తార్కికంగా చెప్తే తత్వశాస్త్రం కిందకి రాదు గానీ, ఒక గొప్ప వ్యాఖ్యానంగా స్వీకరించాలి. పదానికి కేంద్రంగా ఒక స్థిరమైన అర్థం వుండదు. భాషలో వాచకానికి సంబంధించి అర్ధం కూడా వ్యూహాత్మకమేనని భావిస్తారు. వినిర్మాణవాదులు వాచకం జంట పదాలని అంగీకరించరు. వాచకం వ్యాఖ్యానంలో అ - అ మాత్రమే. గతితార్కిక భౌతికవాద దృష్టిలో జంటపదాలు వుంటాయి. కుడి - ఎడమ, స్త్రీ - పురుష లాంటి జంటపదాలను, వాటి విభజనను అంగీకరించదు. కుడి - కుడిగానే, స్త్రీ - స్త్రీగానే తమ అస్తిత్వ ప్రకటన చేస్తాయి.

(సాగర్‌ శ్రీరామ కవచం సప్తతి సాహిత్య ఉత్సవాలను పురస్కరించుకొని)
సంభాషణ : విఎస్‌ఆర్‌ఎస్‌ సోమయాజులు