పూలిచ్చే మకరందాలూ
ప్రాత:కాలపు మంచు బిందువులూ
తరులిచ్చే ఫలరసాలూ
తరలి వచ్చే తేనె ప్రవాహాలూ ఒకటేమిటి
క్షీరామృత ధారలెన్నో
మది క్షేత్రాన్ని మాధుర్యమై తాకుతున్నాయి
అయినా ఎంతకీ నిండని మధు పాత్రలా
గొంతెండిన పాటలా మిగిలాను
నువ్వొచ్చావు
చిరకాలపు దాహార్తిని చిటికెలోన తీర్చావు
నక్షత్రాలను దోసిట తెచ్చి నా గాత్రంలో పేర్చావు
నీ స్పర్శతో సంగీత నదిగా మార్చావు
వెలుగులీను పాటనై నీ వెంట నడిచాను
ఇంతకీ నువ్వెవరు?
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931










