వర్తమాన తెలుగు కవిత్వంతో పరిచయం ఉన్న వాళ్ళకు బాల సుధాకర్ మౌళి తెలీకపోవడం జరగదు. ’ ఆకు కదలని చోట ‘ మొదలై ఃదు:ఖపు వొరుపుః వరకూ సాగిన అతడి కవితాయానం కూడా తెలీకుండా ఉండదు. ఆరో కవిత్వ సంపుటి ఃనిర్వేదస్థలంఃను ప్రముఖ కవి కె.శివారెడ్డి మే 14న విజయనగరంలో మౌళి వివాహ వేడుకల్లో ఆవిష్కరించారు.
మౌళి చేతుల్లో కవిత్వం గోరింటాకు పండినట్టు పండుతుంది. సాలు తర్వాత సాలు పోసి పొలాన్ని దున్నే రైతులా అతడు పుస్తకం తర్వాత పుస్తకం అచ్చు వేసి కవిత్వసేద్యం చేస్తూ వస్తున్నాడు. ఒక పువ్వులో ఏ రేకుకా రేకు ప్రత్యేకమే అయినట్టు సుధాకర్ పుస్తకాల్లో ఏ పుస్తకానికి ఆ పుస్తకం ప్రత్యేకమే అయినా నిర్వేదస్థలం మరింత ప్రత్యేకం. అలల మీద తేలుతూ వచ్చి పడవ తీరం చేరినట్టు నిర్వేదస్థలంతో ఇతడు నిశ్చలత్వాన్నీ నిలకడనీ సాధించాడు. నిర్వేదస్థలం ఒక దు:ఖపు పాట. కరోనా విధ్వంస కాలపు రెండో చీకటి రుతువులోనూ, తదనంతర కాలంలోనూ బాణీ కట్టుకున్న శిశిరగీతం.
కవే చెప్పినట్టు.. ఃఎన్ని పరిభ్రమణాల తర్వాత మిగిలిన మౌనమో ఇదిః. కోవిడ్ మొదటి రెండు మృత్యు తరంగాల కాలంలోనూ ఆటు తర్వాత ఎంతో కవిత్వం ప్రవహించింది. అయితే ఃకవి స్వీయ దు:ఖం. దేశంతో పాటుగా తన సొంత దిగులు. స్వయానా అతడు అనుభవించిన వేదన. ఒకానొక రోజు అర్ధరాత్రి కేవలం కాసింత ఆక్సిజన్ దేహంలో కరువవడం వల్ల నా నెత్తుటి సోదరి సగంలోనే తన ప్రయాణాన్ని తెంసేసుకుని వెళ్లిపోయిందని ముందుమాటల్లో రాసుకున్నాడు. ఃరాత్రికి రాత్రిః, ఃసుందరం అక్కః కవితల్లో ఆ బాధనీ, దిగులునీ కవిత్వం చేశాడు. కరోనా రెండో సంక్షోభ సమయాలన్నీ ఈ సంపుటిలో కవితా వస్తువులయ్యాయి.
ః భూమి యుద్ధం మరిచిపోయినట్టు/ దిగాలుగా ముఖం పెట్టి నెత్తురోడుతోంది/ /ఎవరి వద్దా నిఖార్సైన ఒక జవాబు లేదు/ ఒక్క తేటదనం దరిదాపులో కనిపిస్తున్నట్టు లేదుః (ఒక జవాబు లేదు)
ః దు:ఖాన్ని నెమరు వేసుకునే వెసులుబాటు లేని కాలంలో/ బతకడమంత దు:ఖం ఇంకోటి లేదు// బహుశా నెమరు వేసుకుంటేనే అలవాటవుతుందేమో దు:ఖంః (మహా విభ్రాంతి)
ః అనేక మరణ క్షణాల తర్వాత ఒకే ఒక్క వీడ్కోలు/ లయ తప్పుతున్న గుండెను ఓదార్చడానికి ఎవరొస్తారో/ ఇంత ద్రవ వాతావరణంలోనూ తెలియని వీడని ఉక్కబోత/ /వెళ్తున్న మనిషిని వెళ్తున్నట్టే వదిలేయడమే/ పెద్ద క్షోభ. (ఒక నిశ్చేష్ట)
ఃదు:ఖస్థలిత గాయం వొక్కటే/ లోపలా బయటా/ ముగ్గి పలకబారిన ఫలంలాః (దు:ఖం వాసన వేస్తున్న పద్యం)
ఃతడి తగిలితే నాని పెచ్చులు పెచ్చులుగా/ వూడి పోయే హృదయం గోడల్లో/ చిన్న సెలయేటి కదలికను వూహించడం/ ఎందుకో అసాధ్య సన్నివేశంలా వుంది// రాతి వనాలుగా మారుతున్న రోజుల్లోంచి/ తల బయటకు పెట్టి కాంతిని తాగే క్షణాలు/మళ్ళీ వస్తాయో రావోః (దు:ఖసమయం)
వేదన ఒక సుడిగుండం. మనిషిని అక్కడక్కడే తిప్పుతుంది. కవి వున్న అలాంటి స్థితి చాలా కవితల్లో కొన్ని పదాలను రెండు మూడు నాలుగు సార్లు పునరావృతం చేయడంలో తెలుస్తుంది. ఃదు:ఖ సమయంః కవితలో - ఃఅల మీది అల మీది అల అలల సముద్రంః అనే వాక్యం, ఃఎడతెరిపిలేని వానః కవితలో - ఃఅతని నిద్రలేని రాత్రిని కలవరించిన ఆ పసికళ్లు/ చెరో ఇంత పంచుకుందామని ఎడతెగని యాతనలో/ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అలసిపోతూ..ః అనే వాక్యం, ఃఅదే కవితలో - ఎడతెరిపి లేకుండా కురుస్తూనే వుంది వాన వాన వానః అనే వాక్యం, ఃఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే/ ఏ లేత వరిమొవ్వు తల మీంచైనా ఒక తూనీగ పాట పాడాలనుందిః (ఒక తూనీగపాట) లాంటి వాక్యాలు కవి కన్నీటి ఊబిలో కూరుకుపోయిన మానసిక స్థితిని చెప్పకనే చెబుతాయి.
పుస్తక శీర్షికతో ఉన్న పద్యం మరియు ఃదృశ్యాల్ దృశ్యాల్‌ః అనే కవిత తెలుగులో వెలువడిన కరోనా కవిత్వంలో ఎన్నదగినవి. ఃఇదొక అనాది అనాథ స్థితి/ /ఎగిరిన రెక్కలు ఎగరాల్సిన రెక్కలు/ మధ్యలోనే ఆగిపోవడమే దు:ఖానికి మూలం// ఇల్లొక ఖాళీ నిర్వేదం/ /తుఫాను వచ్చి వెళ్లిపోయిందనడానికి/ చెల్లా చెదురైన ఈ గూడే సాక్ష్యం (నిర్వేదస్థలం). ఃధారలు ధారలుగా కురిసి ఆగింది పాట/ శిలా విగ్రహంలా మారిపోయాడు గాయకుడు/ /దు:ఖం వెలిసిన తర్వాత మిగిలిన చివరి కన్నీటి చుక్కలను/ బొట్లుబొట్లుగా రాల్చే కనుగుడ్డులా వుంది ఆకాశం/ / కాంతి చేజారిన క్షణమేనేమో నింగి గుండె బేజారెత్తుతుందిః (దృశ్యాల్ దృశ్యాల్)
అయితే, నిర్వేదస్థలాన్నంతా దు:ఖ సముద్రమే ఆవరించిందా? అనంటే.. లేదని చెప్పడానికి ఃమళ్ళీ సాఫీగా సాగిపోతున్నట్టేః అనే కవిత ఃమళ్ళీ యథేచ్ఛగాః వంటి కవితలు సాక్ష్యం. ఃనిశ్శబ్దానికి ఆవల చీకటికి ఆవల శూన్యానికి ఆవల/ అవిరామంగా మొలకెత్తే ఒక కాంతివృక్షం వుంటుందిః (ఒక కాంతివృక్షం) అన్న వాక్యం, ఃతుపాను ముసురులో తడిచి వొణికే పూరీడుపిట్ట/ తూరుపు రెక్కల్లో/ ఇంటి ముందు వసారాలో కొచ్చి నిల్చుందిః (దు:ఖ సమయం) లాంటి రేపటి మీద ఆశను రగిలించే వాక్యాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కనబడతాయి. ఃఅతను లేని ఆమె వద్ద కొంత సమయం ఆగుదామా/ బతుకును నెట్టుకొచ్చే రహస్యాన్ని కాసింతైనా తెలుసుకుందామాః (అతను లేని ఆమె వద్ద), ఃనువ్వు బతికే వున్నావ్ నేనూ బతికే ఉన్నాను/ లోకం ఇంకా ప్రాణంతో జవజవలాడుతూనే వుందిః (అరూప స్థితి), ఃనడుస్తున్న కాలం ఎంత విషప్పామో తెలీని పిల్లలే/ నడుస్తున్న కాలం నుంచి/ దు:ఖాన్ని చిలికి ఆనందాన్ని తేర్చగలరుః (అల్లిక రహస్యం) లాంటి వాక్యాలు వెలుగు దారిని చూపిస్తాయి. పసిపిల్లలున్న ఇల్లు గాయాలను త్వరగా మాన్పుకుంటుందని తెలిసిన కవి కాబట్టే - ఃపిల్లలు మాత్రమే గాయపడిన భూమిని/ ప్రేమ నిండిన చేతులతో లేపి మళ్ళీ నిటారుగా నిలబెట్టగలరుః (మళ్ళీ యథేచ్ఛగా) అంటున్నాడు.
కరోనా కవిత్వంతో పాటు పది వరకూ ఇతర కవితలు వున్నాయి. ఆర్కే స్మ ృతిలో రాసిన ఃఅడవి పూవుః, కత్తి మహేష్ స్మ ృతిలో రాసిన ఃఅతను ఆగిన తర్వాతః, పల్లె జీవితం కకావికలమై పట్టణంలో పునరావాసం పొందుతున్న జీవితాలను హృద్యంగా చిత్రించే ఃపునరావాసం నుంచిః వంటి కవితలు బాగుంటాయి. ఃఒడ్డుః కవిత ఆలోచింపజేస్తుంది. ఃఅదే వాస్తవంః కవిత అరు వరుసలే అయినా మార్మికత మాటున కవి వాక్యం అడవి మల్లెల పరిమళమై మనల్ని చేరుతుంది. ఃఎదురు గాలి వీచినప్పుడు/ అడివిపూలు రాలిపోతున్నాయని/ సంబరపడకు/ /రాలిన పూల గొంతులోంచి/ ఉబికి వచ్చే సూర్యపరిమళం/ ఇంకిపోదుః (అదే వాస్తవం)
మామూలుగానే సుధాకర్ గట్టి గింజ. అతడిప్పుడు ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళతో కదిలిపోతున్న దు:ఖరుతువును గానం చేస్తున్నాడు. దు:ఖానికి తనను తాను అర్పించుకుని కన్నీటిలో కడిగిన ముత్యంలా కనబడుతున్నాడు.
- సాంబమూర్తి లండ
96427 32008










