Aug 30,2022 23:05

ప్రజాశక్తి-విజయవాడ: నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, లేనట్లయితే తగిన చర్యలు తప్పవని నగర కమిషనర్‌ స్వప్పిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందితో తన చాంబర్‌లో కమిషనర్‌ మంగళవారం సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పారదర్శకంగా, నీతినిజాయితీగా విధులు నిర్వహించాలని కోరారు. అవినీతి అక్రమాలకు, నిబంధనలకు విరుద్దంగా పని చేసే అధికారులను వారి వారి మాతృ సంస్థకు పంపించాల్సి వస్తోందని హెచ్చరించారు. ఉద్యోగులు కూడా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. విజయవాడ నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు అనధికార నిర్మాణాలను ఎన్ని గుర్తించారో వివరించాలని సిటీ ప్లానర్‌ను కమిషనర్‌ ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను ప్రాధమిక దశలోనే గుర్తించి, వాటిని నిర్మూలించడమో, సంబంధిత వాటిపై ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయడమో ఏదో ఒకటి చేయాలని ఆదేశించారు. చైన్‌ మెన్‌/ప్లానింగ్‌ సెక్రటరీల దగ్గర నుంచి డిసిపి/ఎసిపిల వరకు ప్రతి ఒక్కరూ జావాబుదారీగా పని చేయాలని ఆదేశించారు. ఎటువంటి విమర్శలు లేకుండా వృత్తిని నిర్వర్తించాలని ఆదేశించారు. బిల్డింగ్‌ ప్లాను అనుమతుల్లో అలసత్వం వహించరాదన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 300 లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ దరఖాస్తు దారులను ఓపెన్‌ ఫోరమ్‌నకు పిలిపించి సత్వరమే పరిష్కరించాలన్నారు. బిల్డింగ్‌ షార్ట్‌ ఫాల్స్‌ పై నోటిసులు ఇచ్చి రుసుము వసూలు చేయాలన్నారు. సర్కిల్స్‌ వారీగారిజిస్టర్లు నిర్వహించాలన్నారు. లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌, ఎపిడిపిఎంఎస్‌ భవన నిర్మాణ అనుమతులు, టి.డి.ఆర్‌ బాండ్స్‌, టౌన్‌ సర్వేకు సంబంధించిన ఏ ఇతర పట్టణ ప్రణాళికా శాఖకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడానికి అధికారులు చర్యలుతీసుకోవాలన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ, సర్కిల్‌ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారము ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపెన్‌ ఫోరమ్‌ నిర్వహించాలని కమిషనర్‌ ఆదేశించారు.