Feb 07,2023 21:47

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : నిబంధనలకు తిలోదకాలిచ్చిన నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ అనంతపురం పట్టణంలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో కదిరి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోందన్నారు. విద్యార్థిని కళాశాలకు చెల్లించాల్సిన ఫీజులో కొంతభాగం చెల్లించకపోవటంతో కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు.విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నారాయణ విద్యాసంస్థలను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గంగరాజు, వెంకటేష్‌, అజారుద్దీన్‌, మహేష్‌, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.